భారత్‌కు మలేసియా పరీక్ష | Malaysia test to india | Sakshi
Sakshi News home page

భారత్‌కు మలేసియా పరీక్ష

Published Sun, May 10 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

Malaysia test to india

నేటి నుంచి సుదిర్మన్ కప్
 
 డాంగువాన్ (చైనా) : ప్రపంచ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ‘సుదిర్మన్ కప్’ నేడు ప్రారంభమవుతుంది. నాకౌట్‌కు చేరడమే తొలి లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది. ‘గ్రూప్-1డి’లో ఉన్న భారత్ సోమవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో... బుధవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో మూడుసార్లు చాంపియన్ దక్షిణ కొరియాతో ఆడుతుంది. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో కలిపి మొత్తం ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి.

ఐదింట్లో మూడు మ్యాచ్‌లు నెగ్గిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్‌లతో భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ రెండు సింగిల్స్ లో భారత్ నెగ్గినా... జట్టు విజయావకాశాలు డబుల్స్ జోడీల ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటాయి. తనపై విధించిన నిషేధం గడువు పూర్తి కావడంతో ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) ఈ టోర్నీతో పునరాగమనం చేయనున్నాడు.

లీ చోంగ్ వీపై భారత ఆటగాళ్లకు గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దాంతో మహిళల సింగిల్స్‌లో సైనాతోపాటు డబుల్స్‌లో రెండు మ్యాచ్‌ల్లో నెగ్గితేనే భారత్ విజయం ఖాయమవుతుంది. సింగిల్స్‌తోపాటు డబుల్స్‌లోనూ దక్షిణ కొరియా చాలా పటిష్టంగా ఉండటంతో భారత్ నాకౌట్ చేరే అంశం మలేసియాపై వచ్చే ఫలితంపైనే ఆధారపడి ఉంది. 2011లో నాకౌట్‌కు అర్హత పొందిన భారత్... 2013లో లీగ్ దశలోనే నిష్ర్కమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement