భారత్ ఖేల్‌ఖతం
►కొరియా చేతిలో 1-4తో ఓటమి
►సైనా మినహా అందరూ పరాజయం
►సుదిర్మన్ కప్
డాంగ్వాన్ (చైనా) : ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ కథ లీగ్ దశలోనే ముగిసింది. నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. మూడుసార్లు చాంపియన్ దక్షిణ కొరియాతో బుధవారం జరిగిన గ్రూప్1-డి మ్యాచ్‌లో టీమిండియా 1-4 తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ విజయం సాధించగా... పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్, పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు ఓటమి పాలయ్యారు. మలేసియాతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ఈ గ్రూప్ నుంచి మలేసియా, దక్షిణ కొరియా క్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశకు అర్హత పొందాయి.
తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ ద్వయం 10-21, 19-21తో కిమ్ జీ జంగ్-కిమ్ సా రాంగ్ జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 22-20, 17-21, 21-13తో బే యోన్ జూపై గెలుపొంది స్కోరును 1-1తో సమం చేసింది. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ 21-13, 12-21, 12-21తో సన్ వాన్ హో చేతిలో ఓడిపోయాడు.
మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 21-18, 12-21, 12-21తో చాంగ్ యె నా -జంగ్ క్యుంగ్ ఎన్ జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో మనూ అత్రి-సిక్కి రెడ్డి జంట 12-21, 20-22తో కిమ్ హా నా-కో సుంగ్ హ్యున్ ద్వయం చేతిలో పరాజయం పాలైంది. గతంలో బే యోన్‌పై ఏడుసార్లు నెగ్గి, నాలుగుసార్లు ఓడిపోయిన సైనాకు ఈసారీ గట్టిపోటీనే ఎదురైంది.
తొలి గేమ్‌లో గేమ్ పాయింట్ కాపాడుకున్న ఈ హైదరాబాద్ అమ్మాయి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 22-20తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. అయితే స్కోరు 13-14తో ఉన్న దశలో బే యోన్ వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి 20-14తో ముందంజ వేసింది. అదే జోరులో రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా తేరుకొని ఆరంభంలోనే 7-2తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అదే జోరును తర్వాత కూడా కొనసాగించి 68 నిమిషాల్లో విజయాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ శ్రీకాంత్‌ను కాదని అనుభవజ్ఞుడైన కశ్యప్‌ను బరిలోకి దించినా ప్రయోజనం లేకపోయింది. ప్రపంచ ఐదో ర్యాంకర్ సన్ వాన్ హోపై తొలి గేమ్ నెగ్గిన కశ్యప్ ఆ తర్వాత అదే దూకుడును కనబర్చలేకపోయాడు. మహిళల డబుల్స్‌లో ప్రపంచ 75వ ర్యాంక్ కొరియా జోడీపై జ్వాల-అశ్విని ద్వయం పైచేయి సాధించలేకపోయింది.