సోఫియా కెనిన్
పారిస్: ఈసారి సీడెడ్ క్రీడాకారిణులకు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ కలసి రావడంలేదు. తాజాగా మహిళల సింగిల్స్‌లో గత ఏడాది రన్నరప్, నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) కూడా ఇంటిముఖం పట్టింది. దాంతో క్వార్టర్ ఫైనల్ బరిలో టాప్–20లో కేవలం ఇద్దరు మాత్రమే బరిలో మిగిలారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ మరియా సాకరి (గ్రీస్) 6–1, 6–3తో ప్రపంచ ఐదో ర్యాంకర్ సోఫియా కెనిన్‌పై సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో సాకరి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. అంతేకాకుండా ఈ ఘనత సాధించిన తొలి గ్రీస్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 68 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకరి నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు కెనిన్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన సోఫియా కెనిన్ ఏకంగా తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు, 32 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.
53 నిమిషాల్లోనే...
మరోవైపు అమెరికా టీనేజ్ స్టార్ కోకో గాఫ్ కూడా తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. 17 ఏళ్ల గాఫ్ కేవలం 53 నిమిషాల్లో 6–3, 6–1తో 25వ సీడ్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా)ను చిత్తుగా ఓడించింది. తద్వారా 2006 తర్వాత (నికోల్ వైదిసోవా; చెక్ రిపబ్లిక్–ఫ్రెంచ్ ఓపెన్) ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్స్ చేరిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. జబర్‌తో మ్యాచ్‌లో గాఫ్ నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–0తో 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్, 2018 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచి తన కెరీర్‌లో తొలి సారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో గాఫ్‌తో క్రిచికోవా ఆడుతుంది.
నాదల్ 15వసారి...
మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 15వ సారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నాదల్ 7–5, 6–3, 6–0తో జానిక్ సినెర్ (ఇటలీ)పై గెలుపొందాడు. రెండు గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ నాలుగు ఏస్‌లు సంధించాడు. తన ప్రత్యర్థి సర్వీస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేశాడు. 13 సార్లు నెట్‌వద్దకు వచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో బెరెటిని (ఇటలీ)తో జొకోవిచ్; ష్వార్ట్‌జ్‌మన్‌తో నాదల్; జ్వెరెవ్‌తో ఫొకినా; ఐదో సీడ్ సిట్సిపాస్‌తో రెండో సీడ్ మెద్వెదెవ్ తలపడతారు.
గట్టెక్కిన జొకోవిచ్...
పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) 15వసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న 19 ఏళ్ల ఇటలీ టీనేజర్ లొరెంజో ముజెత్తితో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–7 (7/9), 6–7 (2/7), 6–1, 6–0, 4–0తో విజయం సాధించాడు. 3 గంటల 27 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొలి రెండు సెట్‌లను కోల్పోయాడు. ఆ తర్వాత అతను అనూహ్యంగా తేరుకొని వరుసగా రెండు సెట్‌లు గెలిచాడు. నిర్ణాయక చివరి సెట్‌లో సెర్బియా స్టార్ 4–0తో ఆధిక్యంలో ఉన్న దశలో లొరెంజో వెన్నునొప్పితో మ్యాచ్ నుంచి వైదొలి గాడు. దాంతో జొకోవిచ్ విజయం ఖాయైమంది. తొలి రెండు సెట్‌లు కోల్పోయాక గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్‌లో జొకోవిచ్ గెలుపొందడం ఇది ఐదో సారి మాత్రమే. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–1, 6–1 తో నిషికోరి (జపాన్)పై... ఫొకినా (స్పెయిన్) 6–4, 6–4, 4–6, 6–4తో డెల్‌బోనిస్ (అర్జెంటీనా)పై... పదో సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 7–6 (11/9), 6–4, 7–5తో లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment