ముగురుజాకు షాక్ | French Open champ Garbine Muguruza falls in Wimbledon second round | Sakshi
Sakshi News home page

ముగురుజాకు షాక్

Published Fri, Jul 1 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

ముగురుజాకు షాక్

ముగురుజాకు షాక్

* వింబుల్డన్ రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం
* అన్‌సీడెడ్ సెపలోవా చేతిలో ఓటమి
* మూడోరౌండ్‌లో ముర్రే, నిషికోరి, రావోనిక్

లండన్: గత మూడు రోజులు సాఫీగా సాగిన వింబుల్డన్‌లో నాలుగో రోజు పెను సంచలనం నమోదైంది. ఫ్రెంచ్ ఓపెన్ విజేత, ప్రపంచ రెండో ర్యాంకర్ గార్బిని ముగురుజా (స్పెయిన్) రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 127వ ర్యాంకర్ జానా సెపలోవా (స్లొవేకియా) 6-3, 6-2తో రెండోసీడ్ ముగురుజాపై నెగ్గి మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది.

59 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెపలోవా సర్వీస్‌లో చెలరేగిపోయింది. బలమైన ఫోర్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో స్పెయిన్ ప్లేయర్ ఆట కట్టించింది. తొలిసెట్ రెండో గేమ్‌లోనే సర్వీస్‌ను కోల్పోవడం ముగురుజాపై ప్రభావం చూపింది. నాలుగు, ఏడు, ఎనిమిది గేమ్‌ల్లో సర్వీస్‌ను కాపాడుకున్నా ఫలితం లేకపోయింది. ఇక రెండో సెట్‌లో సెపలోవా మరింత జోరు చూపెట్టింది. రెండుసార్లు సర్వీస్‌ను కాపాడుకున్న ఆమె రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

చివరి నాలుగు గేమ్‌ల్లో ముగురుజా రెండుసార్లు సర్వీస్‌ను కాపాడుకున్నా... ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయలేక మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఓవరాల్‌గా ముగురుజా మ్యాచ్ మొత్తంలో 22సార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో 4వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 6-1, 6-4తో లెప్‌చెంకో (అమెరికా)పై; 5వ సీడ్ హలెప్ (రొమేనియా) 6-1, 6-1తో షియావోన్ (ఇటలీ)పై; 8వ సీడ్ వీనస్ (అమెరికా) 7-5, 4-6, 6-3తో మరియా సక్కారి (గ్రీక్)పై; 9వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6-4, 4-6, 6-3తో ఫ్లిప్‌కెన్స్ (బెల్జియం)పై; 11వ సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 6-4, 6-2తో కుమ్‌కుమ్ (థాయ్‌లాండ్)పై; 12వ సీడ్ నవారో (స్విట్జర్లాండ్) 3-6, 6-2, 6-1తో అలెర్టోవా (చెక్)పై; లిసికి (జర్మనీ) 6-4, 6-2తో 14వ సీడ్ స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై గెలిచి తదుపరి రౌండ్‌లోకి అడుగుపెట్టారు. బొసెరుప్ (అమెరికా) 6-4, 1-0 ఉన్న దశలో ఏడోసీడ్ బెనిసిచ్ (స్విట్జర్లాండ్) మ్యాచ్ నుంచి వైదొలిగింది.
 
ముర్రే జోరు...  
పురుషుల సింగిల్స్‌లో రెండోసీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) జోరు కొనసాగిస్తున్నాడు. రెండోరౌండ్‌లో 6-3, 6-2, 6-1తో యెన్ సున్ లూ (తైపీ)పై నెగ్గి మూడోరౌండ్‌లోకి ప్రవేశించాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఐదోసీడ్ నిషికోరి (జపాన్) 4-6, 6-4, 6-4, 6-2తో బెన్నెట్ (ఫ్రాన్స్)పై; 6వ సీడ్ రావోనిక్ (కెనడా) 7-6 (5), 6-4, 6-2తో సెప్పీ (ఇటలీ)పై; 9వ సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6-2, 6-7 (6), 6-4, 6-4తో స్టాకోవోస్కీ (ఉక్రెయిన్)పై; 11వ సీడ్ గోఫిన్ (బెల్జియం) 6-4, 6-0, 6-3తో రోజెర్ వాసెలిన్ (ఫ్రాన్స్)పై; మహుట్ (ఫ్రాన్స్) 6-1, 6-4, 6-3తో 13వ సీడ్ ఫెరర్ (స్పెయిన్)పై;  దిమిత్రోవ్ (బల్గేరియా) 6-3, 7-6 (1), 4-6, 6-4తో 16వ సీడ్ సిమోన్స్ (ఫ్రాన్స్)పై గెలిచారు. 14వ సీడ్ అగుట్ (స్పెయిన్)కు... కుష్‌కిన్ (కజకిస్తాన్) నుంచి వాకోవర్ లభించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement