కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో సెరెనా... తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో లూసీ...
నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్
సాయంత్రం గం. 6.30 నుంచి నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం
పారిస్ : కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో సెరెనా... తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో లూసీ సఫరోవా... ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో బరిలోకి దిగనున్నారు. ఫైనల్ చేరే క్రమంలో సెరెనా (అమెరికా) నాలుగు మ్యాచ్‌ల్లో తొలి సెట్‌ను కోల్పోయి ఆ తర్వాత విజయాలు సాధించగా... సఫరోవా (చెక్ రిపబ్లిక్) తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. ముఖాముఖి రికార్డులో మాత్రం సెరెనా 8-0తో సఫరోవాపై పైచేయిగా ఉంది.
గత చరిత్రను పక్కనబెడితే ఈ టోర్నీలో సఫరోవా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. డిఫెండింగ్ చాంపియన్ షరపోవాను, మాజీ చాంపియన్ ఇవనోవిచ్‌ను ఓడించి సఫరోవా ఫైనల్ చేరుకోవడం గమనార్హం. అపార అనుభవమున్న సెరెనా అనుభవం ముందు సఫరోవా ఎదురునిలుస్తుందో లేదో వేచి చూడాలి.