Safarova
-
సఫరోవాకు షాక్
♦ సెరెనా, నాదల్ శుభారంభం ♦ యూఎస్ ఓపెన్ టెన్నిస్ న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో రెండో రోజూ సంచలనం నమోదైంది. తొలి రోజున మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా), ఎనిమిదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), పదో సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)... పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ కీ నిషికోరి (జపాన్) ఇంటిముఖం పట్టగా... వీరి సరసన తాజాగా ఆరో సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) చేరింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో లెసియా సురెంకో (ఉక్రెయిన్) 6-4, 6-1తో సఫరోవాను ఓడించింది. మరోవైపు ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ లక్ష్యంతో బరిలోకి దిగిన సెరెనా విలియమ్స్ (అమెరికా)... ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్ టైటిల్ లోటును తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న రాఫెల్ నాదల్ (స్పెయిన్) శుభారంభం చేశారు. తొలి రౌండ్లో టాప్ సీడ్ సెరెనా 6-0, 2-0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి వితాలియా దియత్‌చెంకో (రష్యా) గాయం కారణంగా వైదొలిగింది. మరోవైపు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ నాదల్ 6-3, 6-2, 4-6, 6-4తో బోర్నా కోరిక్ (క్రొయేషియా)ను ఓడించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-1, 6-1, 6-1తో జోవో సుజా (బ్రెజిల్)పై, డిఫెండింగ్ చాంపియన్, తొమ్మిదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6-3, 7-6 (7/3), 7-6 (7/3)తో పెల్లా (అర్జెంటీనా)పై గెలిచారు. ఏడో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్), పదో సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా) కూడా రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్ విభాగం తొలి రౌండ్లో అనా తాతిష్విలి (అమెరికా) 6-2, 6-1తో 8వ సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై, డెనిసా అలెర్టోవా (చెక్ రిపబ్లిక్) 6-1, 7-6 (7/5)తో 10వ సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)పై, ఓసిన్ డోడిన్ (ఫ్రాన్స్) 2-6, 7-5, 6-3తో 21వ సీడ్ జంకోవిచ్ (సెర్బియా)పై, మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) 6-3, 7-5తో 30వ సీడ్ కుజ్నెత్సోవా (రష్యా)పై, కోకో వాండెవెగె (అమెరికా) 6-4, 6-3తో 29వ సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై సంచలన విజయాలు సాధించారు. -
సెరెనా తీన్మార్
♦ మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం ♦ ఖాతాలో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ♦ అత్యధిక టైటిల్స్ నెగ్గిన జాబితాలో మూడో స్థానం ♦ రూ. 12 కోట్ల 82 లక్షల ప్రైజ్‌మనీ సొంతం ♦ ఫైనల్లో పోరాడి ఓడిన సఫరోవా పారిస్ : నల్ల కలువ మళ్లీ మెరిసింది. వేదిక ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా, పరిస్థితులు ఎలా ఉన్నా... తనకు తిరుగులేదని 33 ఏళ్ల అ‘మెరిక’న్ స్టార్ సెరెనా విలియమ్స్ నిరూపించుకుంది. టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ... నంబర్‌వన్ ర్యాంక్‌కు గౌరవం పెంచుతూ... ముచ్చటగా మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సెరెనా విలియమ్స్ 6-3, 6-7 (2/7), 6-2తో 13వ సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. పలు మలుపులు తిరిగిన 121 నిమిషాల అంతిమ సమరంలో తుదకు సెరెనానే విజయం వరించింది. విజేతగా నిలిచిన సెరెనాకు 18 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 82 లక్షలు), రన్నరప్ సఫరోవాకు 9 లక్షల యూరోలు (రూ. 6 కోట్ల 41 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సెరెనా గతంలో 2002, 2013లలో కూడా ఫ్రెంచ్ ఓపెన్ సాధించింది. సఫరోవాతో జరిగిన ఫైనల్ పోరును సెరెనా వరుస సెట్లలో ముగించాల్సింది. తొలి సెట్‌ను 31 నిమిషాల్లో నెగ్గి, రెండో సెట్లో 4-1తో, తన సర్వీస్‌లో 40-15తో ముందంజలో ఉన్న సెరెనా ఆటతీరు అనూహ్యంగా లయ తప్పింది. తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతోన్న 28 ఏళ్ల సఫరోవా ఒక్కసారిగా చెలరేగి వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి స్కోరును 4-4తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సఫరోవా పైచేయి సాధించి 58 నిమిషాల్లో రెండో సెట్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో సెట్ తొలి గేమ్‌లో తన సర్వీస్‌ను కోల్పోయి, 0-2తో వెనుకబడిన దశలో సెరెనా మళ్లీ నేలకు కొట్టిన రబ్బరు బంతిలా ఎగిసింది. పదునైన రిటర్న్ షాట్ లు, కచ్చితమైన సర్వీస్‌లతో చెలరేగి వరుసగా ఆరు గేమ్‌లు నెగ్గి సఫరోవా ఆటను కట్టిం చింది. మ్యాచ్ మొత్తంలో సెరెనా 11 ఏస్‌లు సంధించి, 9 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. ► ఈ విజయంతో సెరెనా అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణుల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకింది. మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా-24 టైటిల్స్), స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ-22 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉండగా... సెరెనా 20 టైటిల్స్‌తో మూడో స్థానానికి చేరుకుంది. జెన్నిఫర్ కాప్రియాటి (2001లో) తర్వాత ఒకే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన ప్లేయర్‌గా సెరెనా నిలిచింది. ► సెరెనాకిది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2014 యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఆమె ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ విజేతగా నిలిచింది. ఒకవేళ వింబుల్డన్‌లోనూ గెలిస్తే సెరెనా రెండోసారి వరుసగా వేర్వేరు నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. అంతకుముందు సెరెనా 2002లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, 2003లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో నా 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ వేదికపై నాకు గొప్ప ఫలితాలు రాలేదు. నా అభిమానులందరికీ కృతజ్ఞతలు. మరోసారి ఫ్రెంచ్ ఓపెన్‌ను నెగ్గి నా కలను నిజం చేసుకున్నాను. - సెరెనా -
సఫరోవా8సెరెనా
నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ సాయంత్రం గం. 6.30 నుంచి నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం పారిస్ : కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో సెరెనా... తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో లూసీ సఫరోవా... ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో బరిలోకి దిగనున్నారు. ఫైనల్ చేరే క్రమంలో సెరెనా (అమెరికా) నాలుగు మ్యాచ్‌ల్లో తొలి సెట్‌ను కోల్పోయి ఆ తర్వాత విజయాలు సాధించగా... సఫరోవా (చెక్ రిపబ్లిక్) తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. ముఖాముఖి రికార్డులో మాత్రం సెరెనా 8-0తో సఫరోవాపై పైచేయిగా ఉంది. గత చరిత్రను పక్కనబెడితే ఈ టోర్నీలో సఫరోవా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. డిఫెండింగ్ చాంపియన్ షరపోవాను, మాజీ చాంపియన్ ఇవనోవిచ్‌ను ఓడించి సఫరోవా ఫైనల్ చేరుకోవడం గమనార్హం. అపార అనుభవమున్న సెరెనా అనుభవం ముందు సఫరోవా ఎదురునిలుస్తుందో లేదో వేచి చూడాలి. -
సెమీస్‌లో ఇవనోవిచ్, సఫరోవా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో టాప్ సీడ్లు అనా ఇవనోవిచ్, లూసీ సఫరోవా దూసుకెళ్తున్నారు. మహిళల సింగిల్స్‌లో ఇవనోవిచ్, సఫరోవా సెమీస్‌లో ప్రవేశించారు. క్వార్టర్స్‌లో ఇవనోవిచ్ 6-3, 6-2 స్కోరుతో ఎలీనా స్విటోలినాపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో సఫరోవా 7-6 (7/3), 6-3 తో గార్బినె ముగురుజను ఓడించింది.