సెరెనా తీన్‌మార్
♦ మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం
♦ ఖాతాలో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్
♦ అత్యధిక టైటిల్స్ నెగ్గిన జాబితాలో మూడో స్థానం
♦ రూ. 12 కోట్ల 82 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
♦ ఫైనల్లో పోరాడి ఓడిన సఫరోవా
పారిస్ : నల్ల కలువ మళ్లీ మెరిసింది. వేదిక ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా, పరిస్థితులు ఎలా ఉన్నా... తనకు తిరుగులేదని 33 ఏళ్ల అ‘మెరిక’న్ స్టార్ సెరెనా విలియమ్స్ నిరూపించుకుంది. టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ... నంబర్‌వన్ ర్యాంక్‌కు గౌరవం పెంచుతూ... ముచ్చటగా మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సెరెనా విలియమ్స్ 6-3, 6-7 (2/7), 6-2తో 13వ సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. పలు మలుపులు తిరిగిన 121 నిమిషాల అంతిమ సమరంలో తుదకు సెరెనానే విజయం వరించింది. విజేతగా నిలిచిన సెరెనాకు 18 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 82 లక్షలు), రన్నరప్ సఫరోవాకు 9 లక్షల యూరోలు (రూ. 6 కోట్ల 41 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సెరెనా గతంలో 2002, 2013లలో కూడా ఫ్రెంచ్ ఓపెన్ సాధించింది.
సఫరోవాతో జరిగిన ఫైనల్ పోరును సెరెనా వరుస సెట్‌లలో ముగించాల్సింది. తొలి సెట్‌ను 31 నిమిషాల్లో నెగ్గి, రెండో సెట్‌లో 4-1తో, తన సర్వీస్‌లో 40-15తో ముందంజలో ఉన్న సెరెనా ఆటతీరు అనూహ్యంగా లయ తప్పింది. తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతోన్న 28 ఏళ్ల సఫరోవా ఒక్కసారిగా చెలరేగి వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి స్కోరును 4-4తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సఫరోవా పైచేయి సాధించి 58 నిమిషాల్లో రెండో సెట్‌ను దక్కించుకుంది.
నిర్ణాయక మూడో సెట్ తొలి గేమ్‌లో తన సర్వీస్‌ను కోల్పోయి, 0-2తో వెనుకబడిన దశలో సెరెనా మళ్లీ నేలకు కొట్టిన రబ్బరు బంతిలా ఎగిసింది. పదునైన రిటర్న్ షాట్ లు, కచ్చితమైన సర్వీస్‌లతో చెలరేగి వరుసగా ఆరు గేమ్‌లు నెగ్గి సఫరోవా ఆటను కట్టిం చింది. మ్యాచ్ మొత్తంలో సెరెనా 11 ఏస్‌లు సంధించి, 9 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది.
► ఈ విజయంతో సెరెనా అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణుల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకింది. మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా-24 టైటిల్స్), స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ-22 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉండగా... సెరెనా 20 టైటిల్స్‌తో మూడో స్థానానికి చేరుకుంది. జెన్నిఫర్ కాప్రియాటి (2001లో) తర్వాత ఒకే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన ప్లేయర్‌గా సెరెనా నిలిచింది.
► సెరెనాకిది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2014 యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఆమె ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ విజేతగా నిలిచింది. ఒకవేళ వింబుల్డన్‌లోనూ గెలిస్తే సెరెనా రెండోసారి వరుసగా వేర్వేరు నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. అంతకుముందు సెరెనా 2002లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, 2003లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచింది.
ఫ్రెంచ్ ఓపెన్‌లో నా 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ వేదికపై నాకు గొప్ప ఫలితాలు రాలేదు. నా అభిమానులందరికీ కృతజ్ఞతలు. మరోసారి ఫ్రెంచ్ ఓపెన్‌ను నెగ్గి నా కలను నిజం చేసుకున్నాను.
- సెరెనా