లండన్: సెరెనా అడుగులు మార్గరెట్ కోర్ట్ రికార్డు దిశగా పడుతున్నాయి. వింబుల్డన్ ఓపెన్‌లో 12సారి సెమీస్ చేరిన ఈ నల్లకలువ 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసింది. ముందుగా 37 ఏళ్ల వెటరన్ స్టార్ ఇక సెమీస్ విజయమే లక్ష్యంగా తన రాకెట్‌ను రఫ్ఫాడించనుంది. సెరెనాతోతో పాటు ఏడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), ఎనిమిదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు.
కాస్త రిస్కీ అయింది!
మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సెరెనా గెలిచేందుకు తుదికంటా పోరాడాల్సి వచ్చింది. సహచర అమెరికా క్రీడాకారిణి అలీసన్ రిస్కీని ఓడించేందుకు సెరెనా మూడు సెట్లదాకా శ్రమించింది. 2 గంటల ఒక నిమిషం పాటు జరిగిన ఈ పోరులో చివరకు సెరెనా 6–4, 4–6, 6–3తో అన్‌సీడెడ్ రిస్కీపై గెలిచి ఊపిరి పీల్చుకుంది. వింబుల్డన్ కోర్టులపై అమెరికా నల్లకలువకు ఇది 97వ విజయం కావడం విశేషం. మిగతా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ హలెప్ 7–6 (7/4), 6–1తో షువాయ్ జంగ్ (చైనా)పై గెలుపొందగా, ఎనిమిదో సీడ్ స్వితోలినా 7–5, 6–4తో కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది.
క్వార్టర్స్ దాటిన స్ట్రికోవా
చెక్ రిపబ్లిక్ ప్లేయర్ బార్బరా స్ట్రికోవా ఎట్టకేలకు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ అంచెను దాటింది. 17 ఏళ్లుగా వింబుల్డన్ బరిలో దిగుతున్న ఆమె ఒకే ఒక్కసారి క్వార్టర్స్ (2014) చేరింది. ఇపుడు క్వార్టర్స్‌లో స్ట్రికోవా 7–6 (7/5), 6–1తో జొహానా కొంటా (బ్రిటన్)పై విజయం సాధించింది. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో స్ట్రికోవాతో సెరెనా; స్వితోలినాతో హలెప్ ఆడతారు.
డబుల్స్‌లో తొలి 12–12 టై బ్రేక్
మారథాన్ మ్యాచ్‌లకు మంగళం పలకాలని భావించిన ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ఈ ఏడాది 12–12 స్కోరు వద్ద టైబ్రేక్‌కు కటాఫ్ మార్క్ ఇచ్చింది. ఈ కటాఫ్ స్కోరు తొలిసారిగా పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో నమోదైంది. హెన్రీ కొంటినెన్ (ఫిన్‌లాండ్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా), రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్‌బరీ (బ్రిటన్) జంటల మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరికి హెన్రీ–పీర్స్ జోడీ 7–6 (7/2), 6–4, 3–6, 13–12 (7/2)తో నెగ్గింది. గతేడాది అండర్సన్, ఇస్నెర్‌ల మధ్య పురుషుల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌లో ఆఖరి సెట్ 26–24 స్కోరుదాకా అప్రతిహాతంగా సాగింది. దీంతో ఈ ఏడాది నుంచి 12–12 వద్ద టైబ్రేక్‌ను అనివార్యం చేశారు.
సెరెనా... 10 వేల డాలర్ల జరిమానా కట్టు!
ఏడు సార్లు వింబుల్డన్ చాంపియన్ అయిన సెరెనా విలియమ్స్‌పై ఆల్ ఇంగ్లండ్ క్లబ్ జరి మానా విధించింది. టోర్నీకి ముందు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న ఆమె టెన్నిస్ కోర్టును రాకెట్‌తో నష్టపరిచినట్లు తేలింది. దీంతో 10 వేల డాలర్లు (రూ.6.85 లక్షలు) జరిమానాగా చెల్లించాలని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ 37 ఏళ్ల అమెరికన్ స్టార్‌ను ఆదేశించింది.
నేటి షెడ్యూల్
(పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్)
జొకోవిచ్ X డేవిడ్ గాఫిన్
ఫెడరర్ X నిషికోరి
గిడో పెల్లా X బాటిస్టా అగుట్
నాదల్ X స్యామ్ క్వెరీ
సాయంత్రం 5.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం
స్వితోలినా, స్ట్రికోవా, హలెప్
సెరెనా.. శ్రమించి సెమీస్‌కు
Published Wed, Jul 10 2019 4:52 AM | Last Updated on Wed, Sep 18 2019 2:58 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment