wimbledon open
-
అల్కరాజ్ అద్భుత రీతిలో...
లండన్: డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఓటమి అంచుల నుంచి గట్టెక్కి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్‌లో మూడో రౌండ్ దాటేందుకే ప్రస్తుత ఫ్రెంచ్ ఓపెన్ చాంప్ అష్టకష్టాలు పడ్డాడు. ఐదు సెట్ల పాటు సాగిన సుదీర్ఘ పోరాటంలో ఎట్టకేలకు కార్లొస్ అల్కరాజ్ 5–7, 6–2, 4–6, 7–6 (7/2), 6–2తో ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)పై చెమటోడ్చి గెలిచాడు. ఈ మ్యాచ్‌లో 29వ సీడ్ టియాఫో... స్పెయిన్ స్టార్‌కు చుక్కలు చూపించాడు. దాదాపు ఓడించినంత పనిచేశాడు. అల్కరాజ్ 1–2 సెట్లతో వెనుకబడిన దశలో నాలుగో సెట్ హోరాహోరీగా సాగింది. స్కోరు 6–6 వద్ద సమం కాగా... టైబ్రేక్ నిర్వహించారు. ఇందులో పుంజుకున్న అల్కరాజ్ తర్వాత ఆఖరి ఐదో సెట్‌ను సులువుగా గెలుచుకొని ఊపిరి పీల్చుకున్నాడు. ఇతర మ్యాచ్‌లలో పదో సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6–3, 6–4, 6–3తో గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై వరుస సెట్లలో విజయం సాధించగా, ఐదో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 6–1, 6–3, 4–6, 1–1తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)పై ఆధిక్యంలో ఉన్న దశలో వర్షం వల్ల మ్యాచ్‌ను నిలిపివేశారు. మహిళల సింగిల్స్‌లో 12వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), ఏడో సీడ్ జాస్మిన్ పావొలిని (ఇటలీ) ప్రిక్వార్టర్స్ చేరారు. మూడో రౌండ్లో కీస్ 6–4, 6–3తో 18వ సీడ్ మార్ట కొస్ట్యుక్ (ఉక్రెయిన్)పై, పావొలిని (ఇటలీ) 7–6 (7/4), 6–1తో బియాంక ఆండ్రీస్కు (కెనడా)పై విజయం సాధించారు. మరో మ్యాచ్‌లో ఎమ్మా నవారో (అమెరికా) 2–6, 6–3, 6–4తో డయానా స్నైడెర్ (రష్యా)పై నెగ్గింది. ముర్రే నిష్క్రమణ... స్థానిక బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే కెరీర్ ప్రఖ్యాత వింబుల్డన్‌లో తొలి రౌండ్ ఓటమితో ముగిసింది. సోదరుడు జేమీ ముర్రేతో కలిసి అతను డబుల్స్ బరిలోకి దిగాడు. ముర్రే జోడీ 6–7 (6/8), 4–6 స్కోరుతో రింకీ హిజికట–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడింది. దీంతో రెండు సార్లు వింబుల్డన్ సింగిల్స్ చాంప్ (2013, 2016) ముర్రేకు ప్రేక్షకులంతా స్టాండింగ్ ఒవేషన్‌తో గౌరవ వందం ఇచ్చారు. దిగ్గజాలు ఫెడరర్, నాదల్, జొకోవిచ్, వీనస్ విలియమ్స్‌లు వీడియో సందేశాల ద్వారా అతనికి ఫేర్వెల్ పలికారు. వర్షం కారణంగా వింబుల్డన్ టోర్నీకి అంతరాయం కలిగింది. పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లను నిలిపివేసి శనివారానికి వాయిదా వేశారు. యూకీ, బాలాజీ జోడీలు అవుట్ డబుల్స్‌లో భారత ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. యూకీ బాంబ్రీ పోరాటం రెండో రౌండ్లో ముగియగా, శ్రీరామ్ బాలాజీ కనీసం తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. రెండో రౌండ్లో యూకీ–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ 6–4, 4–6, 3–6తో జర్మనీకి చెందిన కెవిన్ క్రావిట్జ్–టిమ్ ప్యుయెట్జ్ జంట చేతిలో పరాజయం చవి చూసింది. తొలి సెట్లో కనబరిచిన ఉత్సాహం తర్వాతి సెట్లలో కొనసాగించడంతో భారత్–ఫ్రాన్స్ ద్వయం విఫలమైంది. మరో మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ జంటకు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. బాలాజీ–జాన్సన్ (బ్రిటన్) జంట 4–6, 5–7తో నాలుగో సీడ్ మార్సెలొ అరెవలో (సాల్వేడార్)– మేట్ పావిచ్ (క్రొయేషియా) జోడీ చేతిలో ఓడింది. -
వొండ్రుసోవాకు షాక్
లండన్: జెస్సికా బౌజస్ మనెరో వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో పెను సంచలనం సృష్టించింది. ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో బౌజస్ పేరు మార్మోగుతోంది. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ ఆరో ర్యాంకర్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)కు తొలి రౌండ్లోనే షాకిచ్చి సంచలన విజయంతో వింబుల్డన్‌ను ఆరంభించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో జెస్సికా బౌజస్ (స్పెయిన్) 6–4, 6–2తో ఆరో సీడ్ వొండ్రుసోవాను వరుస సెట్లలోనే ఇంటిదారి పట్టించింది. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనలిస్టుగా నిలిచిన ఈ చెక్ రిపబ్లిక్ స్టార్... ఈ పరాభవంతో మూడు దశాబ్దాల తర్వాత వింబుల్డన్ గడ్డపై ఓ డిఫెండింగ్ చాంపియన్ తొలి రౌండ్లోనే ఓడిన చెత్త రికార్డును మూటగట్టుకుంది. మహిళల్లో ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకరైన స్టెఫీగ్రాఫ్ (జర్మనీ) 1994లో డిఫెండింగ్ చాంపియన్ హోదాతో వింబుల్డన్ బరిలోకి దిగి అనామక ప్లేయర్ లోరీ మెక్నీల్ (అమెరికా) చేతిలో ఓడింది. జొకోవిచ్ సులువుగా... పురుషుల సింగిల్స్‌లో సెర్బియన్ సూపర్‌స్టార్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ సులువుగా ముందంజ వేశాడు. జొకో 6–1, 6–2, 6–2తో విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)పై అలవోక విజయం సాధించాడు. నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–2, 6–4, 6–2తో కార్బలెస్ బేన (స్పెయిన్)పై గెలుపొందగా, రష్యన్ స్టార్, ఆరో సీడ్ రుబ్లెవ్ ఆట తొలి రౌండ్లోనే ముగిసింది. కామెసన (అర్జెంటీనా) 6–4, 5–7, 6–2, 7–6 (7/5)తో రుబ్లెవ్‌ను కంగుతినిపించాడు. ప్రపంచ నంబర్‌వన్, జానిక్ సినెర్ (ఇటలీ) 6–3, 6–4, 3–6, 6–3తో యానిక్ హఫ్‌మన్ (జర్మనీ)పై, ఏడో సీడ్ హుర్కాజ్ (పొలాండ్) 5–7, 6–4, 6–3, 6–4తో అల్బాట్ (మాల్దొవా)పై గెలుపొందారు. తొమ్మిదో సీడ్ డి మినౌర్ (ఆ్రస్టేలియా) 7–6 (7/1), 7–6 (7/3), 7–6 (7/4)తో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై ప్రతి సెట్ కోసం ఓ యుద్ధమే చేసి గెలిచాడు. సూపర్ స్వియాటెక్ మహిళల సింగిల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, టాప్ సీడ్ స్వియాటెక్ (పొలాండ్) 6–3, 6–4తో అమెరికా చెందిన సోఫియా కెనిన్‌పై వరుస సెట్లలో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఇతర మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) 6–3 6–1తో గాబ్రియెలా రూస్ (రుమేనియా)పై, ఐదో సీడ్ పెగులా (అమెరికా) 6–2, 6–0తో అష్లిన్ క్రూగెర్ (అమెరికా)పై, 15వ సీడ్ సామ్సోనొవా (రష్యా) 6–3, 4–6, 6–2తో రెబెకా మసరొవా (స్పెయిన్)పై విజయం సాధించారు. మాజీ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ జెలినా ఒస్టాపెంకో (లాత్వియా) 6–1, 6–2తో టామ్జనోవిక్ (ఆ్రస్టేలియా)పై సులువైన విజయంతో శుభారంభం చేసింది. నగాల్ అవుట్ భారత నంబర్‌వన్ సింగిల్స్ ప్లేయర్ సుమిత్ నగాల్ ఆట వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రౌండ్లో ముగిసింది. 72వ ర్యాంక్ భారత ప్లేయర్ 2–6 6–3, 3–6, 4–6తో ప్రపంచ 53వ ర్యాంకర్ కెక్మనొవిచ్ (సెర్బియా) చేతిలో పరాజయం చవిచూశాడు. 26 ఏళ్ల నగాల్ వరుస తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఏకంగా 44 అనవసర తప్పిదాలు చేశాడు. ప్రత్యర్థి ఆరు ఏస్‌లు సంధించి కేవలం రెండుసార్లు మాత్రమే డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. -
ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్స్‌లో కీలక మార్పు.. ఇకపై
టెన్నిస్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్‌ల్లో ఇకపై ఆఖరి సెట్లో స్కోరు 6-6తో సమంగా ఉన్నప్పుడు 10 పాయింట్ టై బ్రేక్ ఆడేలా కొత్త రూల్ తీసుకొచ్చినట్లు బుధవారం గ్రాండ్‌స్లామ్ బోర్డు ఉమ్మడి అధికారిక ప్రకటన చేసింది. ఈ నిబంధన రానున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచే అమలు చేయనున్నట్లు బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ''ఆస్ట్రేలియన్ ఓపెన్, రోలాండ్-గారోస్(ఫ్రెంచ్ ఓపెన్), వింబుల్డన్, యుఎస్ ఓపెన్ లాంటి మేజర్ గ్రాండ్ స్లామ్ టోర్నీలలో 10-పాయింట్ టై-బ్రేక్ ఆడాలనే ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఆఖరి సెట్లో స్కోరు ఆరుకు చేరుకున్నప్పుడు ఈ 10 పాయింట్ టై బ్రేక్ ఆడాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సుధీర్ఘ మ్యాచ్‌లు జరిగాయి. వాటివల్ల ఆటగాళ్లు మానసికంగా అలిసిపోతున్నారు.బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం ఆట నియమాలలో మరింత స్థిరత్వాన్ని సృష్టించనుంది. తద్వారా ఆటగాళ్ల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఇక డబ్ల్యూటీఏ, ఏటీపీ, ఐటీఎఫ్ లాంటి టోర్నీల్లోనూ త్వరలోనే దీనిని అమలు చేయనున్నాం. ఇందుకోసం సదరు కమ్యూనిటీ అధికారులతో విస్తృతమైన సంప్రదింపులు జరుపుతున్నాం. ముందుగా ఫ్రెంచ్ ఓపెన్‌లో 10 పాయింట్ టై బ్రేక్‌ను ట్రయల్ నిర్వహించనున్నాం. ఆ తర్వాత మెల్లిగా అన్నింటికి వర్తించనున్నాం'' అని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక 10 పాయింట్ టై బ్రేక్ అనేది అన్ని గ్రాండ్‌స్లామ్‌ల్లో.. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో క్వాలిఫయింగ్ నుంచి ఫైనల్‌కు వరకు ఆఖరి సెట్లో ఇది వర్తించనుంది. సీనియర్‌తో పాటు జూనియర్ సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, వీల్‌చైర్ డబుల్స్‌లో కూడా ఈ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. చదవండి: Maria Sharapova-Michael Schumacher: షరపోవా, షుమాకర్‌లపై చీటింగ్, క్రిమినల్ కేసులు PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్; సీన్ రిపీట్ -
French Open: వైదొలిగిన ఫెడరర్
వింబుల్డన్ టోర్నమెంట్‌కు ముందు పూర్తి ఫిట్నెస్తో ఉండాలనే ఉద్దేశంతో... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో ఫెడరర్ 3 గంటల 35 నిమిషాల్లో 7–6 (7/5), 6–7 (3/7), 7–6 (7/4), 7–5తో ప్రపంచ 59వ ర్యాంకర్ డొమినిక్ కోప్ఫెర్ (జర్మనీ)పై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.‘నా సహాయక సిబ్బందితో చర్చించాక ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాను. గతేడాది మోకాలికి రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి. పూర్తి ఫిట్నెస్ సంతరించుకునే క్రమం లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడు మ్యాచ్‌లు గెలిచి ఫిట్నెస్ పరంగా నేను సరైన దారిలో వెళ్తున్నట్లునిపిస్తోంది’ అని 39 ఏళ్ల ఫెడరర్ అన్నాడు. గ్రాస్‌కోర్టు సీజన్లో భాగంగా ఈనెల 14న మొదలయ్యే హాలే ఓపెన్‌లో ఫెడరర్ ఆడతాడు. అనంతరం ఈనెల 28న ప్రారంభమయ్యే వింబుల్డన్ టోర్నీలో తొమ్మిదో టైటిలే లక్ష్యంగా ఫెడరర్ బరిలోకి దిగుతాడు. -
వింబుల్డన్ షెడ్యూల్ ప్రకారమే!
లండన్: కరోనాతో పరిస్థితులు ప్రతి కూలంగా మారుతున్నా... 143 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక గ్రాస్ కోర్టు గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్‌ను మాత్రం అనుకున్న తేదీల్లోనే నిర్వహించాలనే ఉద్దేశంలో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే టోర్నీ ఆరంభమయ్యే జూన్ సమయానికి కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ అధికారులు విశ్వసిస్తున్నారు. ఒకవేళ టోర్నీ ఆరంభమయ్యే సమయానికి కరోనా తీవ్రత తగ్గకపోతే మాత్రమే టోర్నీని వాయిదా వేయడమో లేక రద్దు చేయడమో చేస్తామని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్, క్రోకెట్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ లూయిస్ పేర్కొన్నాడు. ఈ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ జూన్ 29 నుంచి జులై 12 వరకు జరగాల్సి ఉంది. యూఎస్ ఓపెన్ వాయిదా! న్యూయార్క్: కరోనా దెబ్బకు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేస్తున్నామంటూ ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య మంగళవారం ప్రకటించగా... ప్రస్తుతం ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ అయిన యూఎస్ ఓపెన్ కూడా వాయిదా పడేట్లు ఉంది. యూఎస్ ఓపెన్ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరగాల్సి ఉంది. ఒకవేళ ఆ సమయానికి కరోనా తగ్గుముఖం పట్టినా యూఎస్ ఓపెన్ అనుకున్న తేదీల్లోనే జరుగుతుందా అనేది అనుమానమే... దానికి కారణం ఫ్రెంచ్ ఓపెన్ వాయిదా. మేలో ఆరంభం కావల్సిన ఫ్రెంచ్ ఓపెన్‌ను నిర్వాహకులు సెప్టెంబర్ 20కు వాయిదా వేశారు. దాంతో ఈ రెండు టోర్నీల మధ్య విరామం ఒక వారం మాత్రమే ఉంటుంది. దాంతో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. -
సెరెనా.. శ్రమించి సెమీస్‌కు
లండన్: సెరెనా అడుగులు మార్గరెట్ కోర్ట్ రికార్డు దిశగా పడుతున్నాయి. వింబుల్డన్ ఓపెన్‌లో 12సారి సెమీస్ చేరిన ఈ నల్లకలువ 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసింది. ముందుగా 37 ఏళ్ల వెటరన్ స్టార్ ఇక సెమీస్ విజయమే లక్ష్యంగా తన రాకెట్‌ను రఫ్ఫాడించనుంది. సెరెనాతోతో పాటు ఏడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), ఎనిమిదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. కాస్త రిస్కీ అయింది! మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సెరెనా గెలిచేందుకు తుదికంటా పోరాడాల్సి వచ్చింది. సహచర అమెరికా క్రీడాకారిణి అలీసన్ రిస్కీని ఓడించేందుకు సెరెనా మూడు సెట్లదాకా శ్రమించింది. 2 గంటల ఒక నిమిషం పాటు జరిగిన ఈ పోరులో చివరకు సెరెనా 6–4, 4–6, 6–3తో అన్‌సీడెడ్ రిస్కీపై గెలిచి ఊపిరి పీల్చుకుంది. వింబుల్డన్ కోర్టులపై అమెరికా నల్లకలువకు ఇది 97వ విజయం కావడం విశేషం. మిగతా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ హలెప్ 7–6 (7/4), 6–1తో షువాయ్ జంగ్ (చైనా)పై గెలుపొందగా, ఎనిమిదో సీడ్ స్వితోలినా 7–5, 6–4తో కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది. క్వార్టర్స్ దాటిన స్ట్రికోవా చెక్ రిపబ్లిక్ ప్లేయర్ బార్బరా స్ట్రికోవా ఎట్టకేలకు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ అంచెను దాటింది. 17 ఏళ్లుగా వింబుల్డన్ బరిలో దిగుతున్న ఆమె ఒకే ఒక్కసారి క్వార్టర్స్ (2014) చేరింది. ఇపుడు క్వార్టర్స్‌లో స్ట్రికోవా 7–6 (7/5), 6–1తో జొహానా కొంటా (బ్రిటన్)పై విజయం సాధించింది. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో స్ట్రికోవాతో సెరెనా; స్వితోలినాతో హలెప్ ఆడతారు. డబుల్స్‌లో తొలి 12–12 టై బ్రేక్ మారథాన్ మ్యాచ్‌లకు మంగళం పలకాలని భావించిన ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ఈ ఏడాది 12–12 స్కోరు వద్ద టైబ్రేక్‌కు కటాఫ్ మార్క్ ఇచ్చింది. ఈ కటాఫ్ స్కోరు తొలిసారిగా పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో నమోదైంది. హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా), రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్బరీ (బ్రిటన్) జంటల మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరికి హెన్రీ–పీర్స్ జోడీ 7–6 (7/2), 6–4, 3–6, 13–12 (7/2)తో నెగ్గింది. గతేడాది అండర్సన్, ఇస్నెర్ల మధ్య పురుషుల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌లో ఆఖరి సెట్ 26–24 స్కోరుదాకా అప్రతిహాతంగా సాగింది. దీంతో ఈ ఏడాది నుంచి 12–12 వద్ద టైబ్రేక్‌ను అనివార్యం చేశారు. సెరెనా... 10 వేల డాలర్ల జరిమానా కట్టు! ఏడు సార్లు వింబుల్డన్ చాంపియన్ అయిన సెరెనా విలియమ్స్‌పై ఆల్ ఇంగ్లండ్ క్లబ్ జరి మానా విధించింది. టోర్నీకి ముందు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న ఆమె టెన్నిస్ కోర్టును రాకెట్‌తో నష్టపరిచినట్లు తేలింది. దీంతో 10 వేల డాలర్లు (రూ.6.85 లక్షలు) జరిమానాగా చెల్లించాలని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ 37 ఏళ్ల అమెరికన్ స్టార్‌ను ఆదేశించింది. నేటి షెడ్యూల్ (పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్) జొకోవిచ్ X డేవిడ్ గాఫిన్ ఫెడరర్ X నిషికోరి గిడో పెల్లా X బాటిస్టా అగుట్ నాదల్ X స్యామ్ క్వెరీ సాయంత్రం 5.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం స్వితోలినా, స్ట్రికోవా, హలెప్ -
వింబుల్డన్ చాంపియన్ సెర్బియా యోధుడు
లండన్ : వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ విజేతగా సెర్బియా ఆటగాడు నొవాక్ జొకోవిచ్ నిలిచాడు. ఫైనల్లో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై 6-2, 6-2, 7-6 తేడాతో జొకోవిచ్ విజయం సాధించి తన కెరీర్లో మరో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. వరుసగా మూడు సెట్లలో నెగ్గి ప్రత్యర్థి అండర్సన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వని జొకోకు.. కెరీర్లో తాజా గ్రాండ్‌స్లామ్ నాలుగో వింబుల్డన్ ట్రోఫీ. కాగా, 2011, 2014, 2015లలో సెర్బియా ప్లేయర్ జొకోవిచ్ వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన అండర్సన్‌కు నిరాశే ఎదురైంది. ఈ దక్షిణాఫ్రికా టెన్నిస్ స్టార్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. -
శభాష్.. ముగురుజ
లండన్: స్పెయిన్ వర్ధమాన టెన్నిస్ తార గాబ్రినె ముగురుజ వయసు 21. అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ గెల్చుకున్న గ్రాండ్‌స్లామ్స్ సింగిల్స్ టైటిల్స్ (21) సంఖ్యతో సమానం. ర్యాంకింగ్స్‌లో సెరెనా ప్రపంచ నెంబర్ కాగా ముగురుజ 20వ ర్యాంకర్. సెరెనాకు గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ నెగ్గడం కొత్తకాదు. మొత్తం 36 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించింది. అయితే ముగురుజ మొన్నటి వరకు పెద్దగా తెలియదు. ముగురుజ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లో ఫైనల్‌కు రావడం ఇదే తొలిసారి. అయితేనేం సెరెనాతో ముగురుజ నువ్వానేనా అన్నట్టు తలపడింది. సెరెనాకు చివరి వరకు ముచ్చెమటలు పట్టించింది. వింబుల్డన్ ఓపెన్ మహిళల గ్రాండ్ స్లామ్ ఫైనల్లో సెరెనా విజేతగా నిలిచినా.. ముగురుజ ఆద్యంతం ఆకట్టుకుంది. పోరాటపటిమతో చివరి దాకా సెరెనాను నిలువరించింది. తొలిగేమ్‌ను ముగురుజ గెలిచి శుభారంభం చేసింది. అయితే సెరెనా పవర్ ముందు ఆమె పోరాటం ఫలించలేదు. సెరెనా 6-4తో తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్లోనూ 5-1తో ముందంజ వేసింది. అయితే ఈ సమయంలో ముగురుజ వరుసగా మూడు గేమ్‌లు గెలిచి సెరెనాకు ముచ్చెమటలు పట్టించింది. సెట్‌ను 5-4కు తీసుకెళ్లింది. ఆ తర్వాత సెట్‌తో పాటు మ్యాచ్‌ను ఓడినా ముగురుజ క్రీడాభిమానుల మనసును గెల్చుకుంది. వింబుల్డన్ ద్వారా ఆమె టెన్నిస్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. టెన్నిస్ ప్రపంచానికి మరో స్టార్ వస్తుందనే ఆశలు రేకెత్తించింది. బెస్ట్ ఆఫ్ లక్ ముగురుజ. గాబ్రినె ముగురుజ ప్రొఫైల్: జన్మదినం 1993 అక్టోబర్ 8 స్వస్థలం: బార్సిలోనా, స్పెయిన్ వయసు 21 ప్రస్తుత ర్యాంక్ 20 కెరీర్ సింగిల్ టైటిల్స్ డబ్ల్యూటీఏ 1, ఐటీఎఫ్ 7 గ్రాండ్‌స్లామ్: వింబుల్డన్ రన్నరప్ -
వింబుల్డన్ ఫైనల్లోకి సానియా
-
వింబుల్డన్‌లో సానియా జోరు
లండన్: వింబుల్డన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దూసుకెళ్తోంది. మహిళల డబుల్స్ టైటిల్ రేసులో సానియా అడుగు దూరంలో నిలిచింది. మార్టినా హింగీస్ (స్విట్జర్లాండ్)తో కలసి ఆడుతున్న సానియా ఫైనల్లో ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీస్‌లో టాప్ సీడ్ సానియా/హింగీస్ 6-1, 6-2తో అమెరికా జోడీ రాక్వెల్ జోన్స్, అబిగెయిల్ స్పియర్స్‌పై అలవోకగా విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో సానియా ద్వయం వరుసగా రెండు సెట్లను గెలిచి మ్యాచ్‌ను వశం చేసుకుంది. -
దిగ్గజాల సమరం మొదలైంది..
లండన్: టెన్నిస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న దిగ్గజాల సమరం ఆరంభమైంది. వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం ఆసక్తికర పోరు సాగుతోంది. టైటిల్ పోరులో టాప్-3 ఆటగాళ్లు రేసులో నిలిచారు. సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్, స్విస్ కెరటం రోజర్ ఫెదరర్, బ్రిటన్ గ్రేట్ ఆండీ ముర్రే సెమీస్ బెర్తు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా నాలుగో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను ఓడించి రిచర్డ్ గాస్కెట్ (ఫ్రాన్స్) మరో బెర్తు దక్కించుకున్నాడు. రెండు సెమీస్ మ్యాచ్‌లు హోరీహోరీగా సాగే అవకాశముంది. తొలి సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నెంబర్ వన్ జొకోవిచ్.. 21వ సీడ్ గాస్క్వెట్‌తో తలపడుతున్నాడు. ఈ పోరులో జొకోవిచ్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా, గాస్క్వెట్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మరో మ్యాచ్‌లో ఏడుసార్లు వింబుల్డన్ చాంప్ ఫెదరర్, ముర్రే మధ్య అమీతుమీ తేల్చుకోనున్నారు. ముర్రేకు స్థానిక అభిమానుల మద్దతు లభించనుండటం కలసి వచ్చే అంశం. ఇక మహిళల డబుల్స్ సెమీస్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బరిలో దిగింది. సానియా, మార్టినా హింగీస్ (స్విట్జర్లాండ్)తో కలసి అమెరికా జోడీ రాక్వెల్ జోన్స్, అబిగెయిల్ స్పియర్స్‌తో తలపడుతోంది. -
ప్రీ క్వార్టర్స్‌లో పేస్ జోడీ
లండన్: వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్లో భారత వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ జోడీ ప్రీ క్వార్టర్స్‌లో ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్లో పేస్, డానియల్ నెస్టర్ (కెనడా) 5-7, 7-6 (3), 7-6 (4), 7-5 స్కోరుతో తైపీ-రష్యా జోడీ యెన్-హున్ లు, టెమురజ్పై విజయం సాధించారు. మూడు గంటల 15 నిమిషాల పాటు నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ పోరులో పేస్ జోడీ చెమటోడ్చి నెగ్గింది. ఈ మెగా ఈవెంట్ మహిళల డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా జోడీ కూడా ముందంజ వేసింది. -
సానియా జోడీ ముందంజ
వింబుల్డన్: వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల డబుల్స్‌లో భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ ముందంజ వేసింది. స్విట్జర్లాండ్ క్రీడాకారిణి మార్టినా హింగీస్‌తో కలసి బరిలో దిగిన సానియా మూడో రౌండ్లో ప్రవేశించింది. రెండో రౌండ్లో సానియా, మార్టినా 6-0, 6-1 స్కోరుతో కిమికో డేట్ క్రమ్న్ (జపాన్), ఫ్రాన్సెస్కా షియవోన్ (ఇటలీ) జంటపై విజయం సాధించారు. 45 నిమిషాల పాటు ఏకపక్షంగా సాగిన ఈ పోరులో సానియా జోడీ సునాయాసంగా గెలుపొందింది.