వొండ్రుసోవాకు షాక్‌ | Shock for Vondrusova | Sakshi
Sakshi News home page

వొండ్రుసోవాకు షాక్‌

Published Wed, Jul 3 2024 3:49 AM | Last Updated on Wed, Jul 3 2024 3:49 AM

Shock for Vondrusova

తొలి రౌండ్‌లోనే బౌజస్‌ సంచలనం 

వింబుల్డన్‌ టోర్నీ  

లండన్‌: జెస్సికా బౌజస్‌ మనెరో వింబుల్డన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో పెను సంచలనం సృష్టించింది. ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో బౌజస్‌ పేరు మార్మోగుతోంది. డిఫెండింగ్‌ చాంపియన్, ప్రపంచ ఆరో ర్యాంకర్‌ మర్కెటా వొండ్రుసోవా (చెక్‌ రిపబ్లిక్‌)కు తొలి రౌండ్లోనే షాకిచ్చి సంచలన విజయంతో వింబుల్డన్‌ను ఆరంభించింది. 

మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో జెస్సికా బౌజస్‌ (స్పెయిన్‌) 6–4, 6–2తో ఆరో సీడ్‌ వొండ్రుసోవాను వరుస సెట్లలోనే ఇంటిదారి పట్టించింది. ఇటీవల ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనలిస్టుగా నిలిచిన ఈ చెక్‌ రిపబ్లిక్‌ స్టార్‌... ఈ పరాభవంతో మూడు దశాబ్దాల తర్వాత వింబుల్డన్‌ గడ్డపై ఓ డిఫెండింగ్‌ చాంపియన్‌ తొలి రౌండ్లోనే ఓడిన చెత్త రికార్డును మూటగట్టుకుంది. 

మహిళల్లో ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకరైన స్టెఫీగ్రాఫ్‌ (జర్మనీ) 1994లో డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాతో వింబుల్డన్‌ బరిలోకి దిగి అనామక ప్లేయర్‌ లోరీ మెక్‌నీల్‌ (అమెరికా) చేతిలో ఓడింది.  

జొకోవిచ్‌ సులువుగా... 
పురుషుల సింగిల్స్‌లో సెర్బియన్‌ సూపర్‌స్టార్, రెండో సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ సులువుగా ముందంజ వేశాడు. జొకో 6–1, 6–2, 6–2తో విట్‌ కొప్రివా (చెక్‌ రిపబ్లిక్‌)పై అలవోక విజయం సాధించాడు. నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6–2, 6–4, 6–2తో కార్బలెస్‌ బేన (స్పెయిన్‌)పై గెలుపొందగా, రష్యన్‌ స్టార్, ఆరో సీడ్‌ రుబ్లెవ్‌ ఆట తొలి రౌండ్లోనే ముగిసింది. 

కామెసన (అర్జెంటీనా) 6–4, 5–7, 6–2, 7–6 (7/5)తో రుబ్లెవ్‌ను కంగుతినిపించాడు. ప్రపంచ నంబర్‌వన్,  జానిక్‌ సినెర్‌ (ఇటలీ) 6–3, 6–4, 3–6, 6–3తో యానిక్‌ హఫ్‌మన్‌ (జర్మనీ)పై, ఏడో సీడ్‌ హుర్కాజ్‌ (పొలాండ్‌) 5–7, 6–4, 6–3, 6–4తో అల్బాట్‌ (మాల్దొవా)పై గెలుపొందారు. తొమ్మిదో సీడ్‌ డి మినౌర్‌ (ఆ్రస్టేలియా) 7–6 (7/1), 7–6 (7/3), 7–6 (7/4)తో జేమ్స్‌ డక్‌వర్త్‌ (ఆస్ట్రేలియా)పై ప్రతి సెట్‌ కోసం ఓ యుద్ధమే చేసి గెలిచాడు. 

సూపర్‌ స్వియాటెక్‌  
మహిళల సింగిల్స్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్, టాప్‌ సీడ్‌ స్వియాటెక్‌ (పొలాండ్‌) 6–3, 6–4తో అమెరికా చెందిన సోఫియా కెనిన్‌పై వరుస సెట్లలో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఇతర మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్‌) 6–3 6–1తో గాబ్రియెలా రూస్‌ (రుమేనియా)పై, ఐదో సీడ్‌ పెగులా (అమెరికా) 6–2, 6–0తో అష్లిన్‌ క్రూగెర్‌ (అమెరికా)పై, 15వ సీడ్‌ సామ్సోనొవా (రష్యా) 6–3, 4–6, 6–2తో రెబెకా మసరొవా (స్పెయిన్‌)పై విజయం సాధించారు. 

మాజీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ జెలినా ఒస్టాపెంకో (లాత్వియా) 6–1, 6–2తో టామ్‌జనోవిక్‌ (ఆ్రస్టేలియా)పై సులువైన విజయంతో శుభారంభం చేసింది. 

నగాల్‌ అవుట్‌ 
భారత నంబర్‌వన్‌ సింగిల్స్‌ ప్లేయర్‌ సుమిత్‌ నగాల్‌ ఆట వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో తొలి రౌండ్లో ముగిసింది. 72వ ర్యాంక్‌ భారత ప్లేయర్‌ 2–6 6–3, 3–6, 4–6తో  ప్రపంచ 53వ ర్యాంకర్‌ కెక్మనొవిచ్‌ (సెర్బియా) చేతిలో పరాజయం చవిచూశాడు. 26 ఏళ్ల నగాల్‌ వరుస తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఏకంగా 44 అనవసర తప్పిదాలు చేశాడు. ప్రత్యర్థి ఆరు ఏస్‌లు సంధించి కేవలం రెండుసార్లు మాత్రమే డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement