లండన్: కరోనాతో పరిస్థితులు ప్రతి కూలంగా మారుతున్నా... 143 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక గ్రాస్ కోర్టు గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్‌ను మాత్రం అనుకున్న తేదీల్లోనే నిర్వహించాలనే ఉద్దేశంలో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే టోర్నీ ఆరంభమయ్యే జూన్ సమయానికి కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ అధికారులు విశ్వసిస్తున్నారు. ఒకవేళ టోర్నీ ఆరంభమయ్యే సమయానికి కరోనా తీవ్రత తగ్గకపోతే మాత్రమే టోర్నీని వాయిదా వేయడమో లేక రద్దు చేయడమో చేస్తామని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్, క్రోకెట్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ లూయిస్ పేర్కొన్నాడు. ఈ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ జూన్ 29 నుంచి జులై 12 వరకు జరగాల్సి ఉంది.
యూఎస్ ఓపెన్ వాయిదా!
న్యూయార్క్: కరోనా దెబ్బకు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేస్తున్నామంటూ ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య మంగళవారం ప్రకటించగా... ప్రస్తుతం ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ అయిన యూఎస్ ఓపెన్ కూడా వాయిదా పడేట్లు ఉంది. యూఎస్ ఓపెన్ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరగాల్సి ఉంది. ఒకవేళ ఆ సమయానికి కరోనా తగ్గుముఖం పట్టినా యూఎస్ ఓపెన్ అనుకున్న తేదీల్లోనే జరుగుతుందా అనేది అనుమానమే... దానికి కారణం ఫ్రెంచ్ ఓపెన్ వాయిదా. మేలో ఆరంభం కావల్సిన ఫ్రెంచ్ ఓపెన్‌ను నిర్వాహకులు సెప్టెంబర్ 20కు వాయిదా వేశారు. దాంతో ఈ రెండు టోర్నీల మధ్య విరామం ఒక వారం మాత్రమే ఉంటుంది. దాంతో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment