శ్రీజ సంచలనం
ఇండియా ఓపెన్ టీటీ టోర్నీలో కాంస్యం
న్యూఢిల్లీ: హైదరాబాద్ యువతార ఆకుల శ్రీజ తన కెరీర్‌లో గొప్ప ప్రదర్శన చేసింది. అంత్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) వరల్డ్ టూర్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్‌లో అండర్–21 మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. బుధవారం జరిగిన అండర్–21 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 322వ ర్యాంకర్ శ్రీజ 2–11, 11–13, 7–11తో వాయ్ యామ్ మినీ సూ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో శ్రీజ 11–7, 6–11, 6–11, 11–3, 11–9తో ప్రపంచ 171వ ర్యాంకర్ లిన్ పో సువాన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించగా... తొలి రౌండ్‌లో 7–11, 8–11, 11–6, 11–5, 11–5తో అమృత పుష్పక్ (భారత్)ను ఓడించింది. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు ఆంథోనీ అమల్‌రాజ్, హర్మీత్ దేశాయ్, జ్ఞానశేఖరన్ సత్యన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు.