పీవీ సింధు, సైనా నెహ్వాల్
జకార్తా: ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్ ఇలా అత్యున్నత వేదికలపై మహిళల సింగిల్స్ విభాగంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు పీవీ సింధు, సైనా నెహ్వాల్ పతకాలు కొల్లగొట్టారు. అయితే ఆసియా క్రీడల్లో మాత్రం సింగిల్స్ విభాగం పతకం ఈ ఇద్దరు స్టార్స్‌కే కాకుండా భారత్‌కూ అందని ద్రాక్షగా ఉంది. కొంతకాలంగా మంచి ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరు ఆ కొరత తీర్చుకునేదిశగా మరో అడుగు ముందుకేశారు. ఆసియా క్రీడల్లో భాగంగా సింధు, సైనా మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 21–12, 21–15తో గ్రెగోరియా టున్‌జుంగ్ (ఇండోనేసియా)పై... సైనా 21–6, 21–14తో ఫిత్రియాని (ఇండోనేసియా)పై గెలుపొందారు. నేడు జరిగే క్వార్టర్‌లో రచనోక్ (థాయ్ లాండ్)తో సైనా; జిందాపోల్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడతారు. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే పతకాలు ఖాయమవుతాయి.
పోరాడి ఓడిన సుమీత్ జంట...
మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట క్వార్టర్ ఫైనల్లో... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; సుమీత్ రెడ్డి–మనూ అత్రి జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాయి. సిక్కి–అశ్విని ద్వయం 11–21, 22–24తో మూడో సీడ్ చెన్ కింగ్‌చెన్–జియా యిఫాన్ జంట చేతిలో ఓడిపోయింది. సాత్విక్–చిరాగ్ 17–21, 21–19, 17–21తో చోయ్ సొల్గు–మిన్ హుక్ కాంగ్ (కొరియా) చేతిలో... సుమీత్–మనూ అత్రి 13–21, 21–17, 23–25తో రెండో సీడ్ లి జున్‌హుయ్–లియు యుచెన్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయారు. సుమీత్ జంట నిర్ణాయక మూడో గేమ్‌లో ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను వదులుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment