Quarter finale
-
Japan Open: పోరాడి ఓడిన ప్రణయ్
జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం ముగిసింది. టోక్యోలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 17–21, 21–15, 20–22తో ఆరో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కీలకదశలో ప్రణయ్ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. ముఖాముఖిగా ఇప్పటివరకు చౌ తియెన్ చెన్, ప్రణయ్ ఎనిమిదిసార్లు తలపడగా... ఐదుసార్లు చౌ తియెన్ చెన్, మూడుసార్లు ప్రణయ్ గెలిచారు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన ప్రణయ్‌కు 4,125 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 28 వేలు)తోపాటు 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Chicago Open ATP Challenger Tennis: పోరాడి ఓడిన సాకేత్–యూకీ బాంబ్రీ జోడీ
షికాగో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జంట పోరాటం ముగిసింది. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ ద్వయం 5–7, 6–4, 3–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్)–బెన్ మెక్లాచ్లాన్ (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట నాలుగు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. ఈ సీజన్లో సాకేత్–యూకీ జంట అద్భుతమైన ఫామ్‌లో ఉంది. వీరిద్దరు కలిసి నాలుగు ఏటీపీ చాలెంజర్ టైటిల్స్‌ను, రెండు ఐటీఎఫ్ టోర్నీ టైటిల్స్‌ను సాధించారు. -
క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం స్పెయిన్‌తో భారత్ పోరు
ప్రపంచకప్ మహిళల హాకీ టోర్నీలో ఆదివారం జరిగే ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో స్పెయిన్‌తో భారత్ ఆడుతుంది. గెలిచిన జట్టు క్వార్టర్ ఫైనల్ చేరుతుంది. న్యూజిలాండ్‌తో జరిగిన పూల్ ‘బి’ మ్యాచ్‌లో సవితా పూనియా కెప్టెన్సీలోని టీమిండియా 3–4తో ఓడిపోయింది. అయితే ఇంగ్లండ్ జట్టు చేతిలో చైనా కూడా ఓడిపోవడం భారత్‌కు కలిసొచ్చింది. భారత్, చైనా రెండు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలువగా... మెరుగైన గోల్స్ అంతరంతో భారత్ మూడో స్థానంలో నిలిచి ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌కు అర్హత సాధించింది. -
Hockey Men Junior World Cup: యువ భారత్ జోరు...
భువనేశ్వర్: డిఫెండింగ్ చాంపియన్ భారత్ జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో టైటిల్ నిలబెట్టుకునేందుకు మరో అడుగు ముందుకు వేసింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జూనియర్ జట్టు 1–0తో బెల్జియంపై గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను శారదానంద్ తివారి సాధించాడు. ఆట 21వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను శారదానంద్ ఎలాంటి పొరపాటు చేయకుండా నేర్పుగా గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. దీంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీన్ని తుదిదాకా కాపాడుకొని విజయం సాధించింది. మ్యాచ్ మొదలవగానే బెల్జియం దూకుడు పెంచింది. పదేపదే భారత రక్షణపంక్తిని ఛేదించుకుంటూ దాడులకు పదునుపెట్టింది. అయితే గోల్‌కీపర్ పవన్ చక్కని సమయస్ఫూర్తితో వారి ప్రయత్నాల్ని నీరుగార్చాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో జర్మనీ పెనాల్టీ షూటౌట్లో 3–1తో స్పెయిన్‌పై, అర్జెంటీనా 2–1 తో నెదర్లాండ్స్‌పై, ఫ్రాన్స్ 4–0తో మలేసియాపై గెలిచాయి. రేపు జరిగే సెమీఫైనల్స్‌లో అర్జెంటీనా తో ఫ్రాన్స్; జర్మనీతో భారత్ తలపడతాయి. -
క్వార్టర్స్‌లో సింధు
బ్యాంకాక్: ప్రపంచ చాంపియన్ పీవీ సింధు థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత స్టార్ షట్లర్ 21–10, 21–12తో కిసొనా సెల్వడ్యురె (మలేసియా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ... డెన్మార్క్ ఆటగాడు రస్మస్ గెంకెను వరుస గేముల్లో 21–12, 21–9తో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్ చేరాడు. మరో మ్యాచ్‌లో ప్రణయ్ 17–21, 18–21తో మలేసియాకు చెందిన లియూ డారెన్ చేతిలో పరాజయం చవిచూశాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 21–18, 23–21తో ఏడో సీడ్ చొయి సొల్గి యు–సి సియంగ్ జె (కొరియా) జంటకు షాకిచ్చింది. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్–అశ్విని పొన్నప్ప జోడీ 22–20, 14–21, 21–16తో జర్మనీకి చెందిన మార్క్ లమ్స్‌ఫుస్–ఇసాబెల్ హెర్ట్రిచ్ జంటను ఓడించి ముందంజ వేసింది. అర్జున్–ధ్రువ్ కపిల జంట ప్రిక్వార్టర్స్‌లో 9–21, 11–21తో బెన్ లెన్–సియాన్ వెండి (ఇంగ్లండ్) జోడీ చేతిలో ఓడింది. -
జొకోవిచ్‌కు షాక్!
వియన్నా: ప్రపంచ నంబర్ వన్, 17 టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు ఊహించని ఓటమి ఎదురైంది. ఆస్ట్రియా రాజధానిలో జరుగుతున్న వియన్నా ఓపెన్‌లో అనామక ఆటగాడు లొరెంజో సొనెగొ (ఇటలీ) చేతిలో అతను కంగుతిన్నాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో జొకోవిచ్ 2–6, 1–6తో లొరెంజో చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 2005 ఆస్ట్రేలియా ఓపెన్ తొలి రౌండ్ ఓటమి తర్వాత జొకోవిచ్‌కు ఎదురైన దారుణ పరాభవం ఇదే కావడం విశేషం. ఈ రెండు మ్యాచ్‌ల్లో జొకోవిచ్ కేవలం మూడు గేములను మాత్రమే సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచే తడబడ్డ జొకోవిచ్... ఎక్కడా ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరు సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఒక్కసారి కూడా సఫలం కాలేదు. ఈ మ్యాచ్‌లో లొరెంజో ఎనిమిది ఏస్‌లను కొట్టగా... జొకోవిచ్ కేవలం మూడు ఏస్‌లను మాత్రమే సంధించాడు. క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో ఓడి ఈ టోర్నీకి ముందుగా అర్హత సాధించలేకపోయిన 42వ ర్యాంకర్ లొరెంజో...అదృష్టం కలిసొచ్చి ‘లక్కీ లూజర్’గా అడుగు పెట్టడం విశేషం. గతంలో 12 సార్లు ఇలాంటి లక్కీ లూజర్లపై తలపడి ఓటమి ఎరుగని జొకోవిచ్, తొలిసారి పరాజయం పాలయ్యాడు. -
ప్రణీత్ ఒక్కడే క్వార్టర్స్‌కు
బ్యాంకాక్: టైటిల్ వేటలో భారత షట్లర్ల ఆటలు థాయ్‌లాండ్ ఓపెన్‌లోనూ సాగడంలేదు. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే కంగుతిన్నారు. ఈ ‘బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500’ టోర్నమెంట్లో ఇప్పుడు భారత్ ఆశలన్నీ భమిడిపాటి సాయిప్రణీత్‌పైనే ఉన్నాయి. ఈ అన్‌సీడెడ్ షట్లర్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల, మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ జోడీలు ముందంజ వేయగా సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీకి చుక్కెదురైంది. సాయి ప్రణీత్ అలవోక విజయం మిగతా భారత షట్లర్లకు విదేశీ ఆటగాళ్లు ఎదురుకాగా... సాయిప్రణీత్‌తో సహచరుడు శుభాంకర్ డే తలపడ్డాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అతను వరుస గేముల్లో 21–18, 21–19తో శుభాంకర్‌పై గెలుపొందాడు. 42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శుభాంకర్ ప్రతీ గేమ్‌లోనూ పోరాడాడు. కానీ అతనికంటే మేటి ఆటగాడైన ప్రణీత్ ముందు ఎదురు నిలువలేకపోయాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–11, 16–21, 12–21తో స్థానిక ఆటగాడు కొసిట్ ఫెప్రదబ్ చేతిలో కంగుతిన్నాడు. మూడో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) ధాటికి 21–9, 21–14తో పారుపల్లి కశ్యప్ నిలువలేకపోయాడు. హెచ్.ఎస్.ప్రణయ్ ఆటను జపాన్‌కు చెందిన కెంటో నిషిమోటో వరుస గేముల్లోనే ముగించాడు. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆరోసీడ్ నిషిమోటో 21–17, 21–10తో ప్రణయ్‌ని ఇంటిదారి పట్టించాడు. సైనా పోరాటం సరిపోలేదు మహిళల సింగిల్స్‌లో సుమారు రెండు నెలల అనంతరం బరిలోకి దిగిన సైనా తొలి గేమ్ విజయంతో టచ్‌లోకి వచ్చింది. తర్వాత గేమ్‌లలో పోరాడే ప్రయత్నం చేసినా... జపాన్ ప్రత్యర్థి సయాక తకహాషి జోరు ముందు అదేమాత్రం సరిపోలేదు. చివరకు ఏడో సీడ్ భారత స్టార్ 21–16, 11–21, 14–21తో పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–17, 21–19తో ఆరోసీడ్ ఫజర్–ముహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్–అశ్విని పొన్నప్ప జంట 21–18, 21–19తో అల్ఫియాన్–మార్షెయిలా ఇస్లామి (ఇండోనేసియా) జంటపై నెగ్గింది. సిక్కిరెడ్డి–ప్రణవ్ జోడీ 16–21, 11–21తో ఎనిమిదో సీడ్ తంగ్చన్ మన్– సె యింగ్ సుయెట్ (హాంకాంగ్) జంట చేతిలో ఓడింది. -
అనిసిమోవా సంచలనం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈసారి మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ కనిపించనుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) ఇంటిముఖం పట్టింది. అమెరికాకు చెందిన 17 ఏళ్ల టీనేజర్ అమండ అనిసిమోవా తన అద్వితీయ ప్రదర్శన కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్లో 6–2, 6–4తో హలెప్‌ను బోల్తా కొట్టించింది. తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లో అడుగు పెట్టింది. అంతేకాకుండా నికోల్ వైదిసోవా (చెక్ రిపబ్లిక్–2007 ఆస్ట్రేలియన్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. 1990లో జెన్నిఫర్ కాప్రియాటి తర్వాత అమెరికా తరఫున ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరిన పిన్న వయస్కురాలిగా... 1997లో వీనస్ విలియమ్స్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన పిన్న వయస్కురాలిగా అనిసిమోవా ఘనత వహించింది. మరో క్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–3, 7–5తో మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో 14వ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)తో అనిసిమోవా; మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)తో జొహనా కొంటా (బ్రిటన్) తలపడతారు. సెమీస్‌లో జొకోవిచ్, థీమ్ పురుషుల సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 7–5, 6–2, 6–2తో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై, నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–2, 6–4, 6–2తో పదో సీడ్ ఖచనోవ్ (రష్యా)పై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో ఫెడరర్ (స్విట్జర్లాండ్); జొకోవిచ్‌తో థీమ్ ఆడతారు. -
క్వార్టర్ ఫైనల్లో నిఖత్
న్యూఢిల్లీ: స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. బల్గేరియాలోని సోఫియాలో శుక్రవారం జరిగిన మహిళల 51 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో నిఖత్ ఇటలీకి చెందిన మార్చిస్ గియోవానాపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రెండు రౌండ్లలో నిఖత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. చివరిదైన మూడో రౌండ్ ఆరంభంలో నిఖత్ పంచ్‌ల ధాటికి గియోవానా ఎదురు నిలువ లేకపోయింది. దాంతో రిఫరీ బౌట్‌ను మధ్యలో నిలిపివేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించారు. మరోవైపు భారత్‌కే చెందిన సోనియా లాథెర్ (57 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు), ప్విలావో బాసుమతారి (64 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. సోనియా 5–0తో జెలెనా జెకిచ్ (సెర్బియా)పై... జెస్సికా మెసినా (ఆస్ట్రేలియా)పై లవ్లీనా... బాసుమతారి 3–2తో మెలిస్ (బల్గేరియా)పై గెలిచారు. పురుషుల విభాగంలో మన్దీప్ జాంగ్రా (69 కేజీలు), హర్‡్ష లాక్రా (81 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడిపోయారు. -
సైనా... 12వ‘సారీ’
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా 20–22, 11–21తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. తై జు యింగ్ చేతిలో సైనాకిది వరుసగా 12వ పరాజయం కావడం విశేషం. గత ఆదివారం డెన్మార్క్ ఓపెన్ ఫైనల్లోనూ తై జు చేతిలో సైనా ఓడిన సంగతి తెలిసిందే. 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సైనా 20–16తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ... ఆ తర్వాత వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను చేజార్చుకుంది. రెండో గేమ్‌లో ఈ భారత స్టార్ పూర్తిగా చేతులెత్తేసింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–17, 21–11తో సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) జోడీపై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం క్వార్టర్ ఫైనల్లో సుమీత్–మను అత్రి జంట 21–16, 21–14తో ప్రపంచ ఐదో ర్యాంక్ జోడీ లియు చెంగ్–నాన్ జాంగ్ (చైనా)పై సంచలన విజయం సాధించింది. -
క్వార్టర్స్‌లో అజయ్ జయరామ్
తైపీ సిటీ: చైనీస్ తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ తరఫున అజయ్ జయరామ్ ఒక్కడే నిలిచాడు. పురుషుల సింగిల్స్‌లో అతను క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా, మాజీ జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ ఆట ప్రిక్వార్టర్స్‌లో ముగిసింది. భారత స్టార్లు దూరంగా ఉన్న ఈ టోర్నీలో మిగతా యువ షట్లర్లంతా తొలిరౌండ్లోనే కంగుతిన్నారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అజయ్ 21–10, 22–20తో డెన్మార్క్‌కు చెందిన కిమ్ బ్రూన్‌ను వరుస గేముల్లో ఓడించాడు. 30 ఏళ్ల భారత ఆటగాడు... క్వార్టర్స్‌లో లీ జి జియా (మలేసియా)తో తలపడతాడు. సౌరభ్ వర్మ 21–19, 21–23, 16–21తో జపాన్‌కు చెందిన రిచి తకషిత చేతిలో పరాజయం చవిచూశాడు. -
ఇంకోటి గెలిస్తే చరిత్ర
జకార్తా: ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్ ఇలా అత్యున్నత వేదికలపై మహిళల సింగిల్స్ విభాగంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు పీవీ సింధు, సైనా నెహ్వాల్ పతకాలు కొల్లగొట్టారు. అయితే ఆసియా క్రీడల్లో మాత్రం సింగిల్స్ విభాగం పతకం ఈ ఇద్దరు స్టార్స్‌కే కాకుండా భారత్‌కూ అందని ద్రాక్షగా ఉంది. కొంతకాలంగా మంచి ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరు ఆ కొరత తీర్చుకునేదిశగా మరో అడుగు ముందుకేశారు. ఆసియా క్రీడల్లో భాగంగా సింధు, సైనా మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 21–12, 21–15తో గ్రెగోరియా టున్‌జుంగ్ (ఇండోనేసియా)పై... సైనా 21–6, 21–14తో ఫిత్రియాని (ఇండోనేసియా)పై గెలుపొందారు. నేడు జరిగే క్వార్టర్లో రచనోక్ (థాయ్ లాండ్)తో సైనా; జిందాపోల్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడతారు. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే పతకాలు ఖాయమవుతాయి. పోరాడి ఓడిన సుమీత్ జంట... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట క్వార్టర్ ఫైనల్లో... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; సుమీత్ రెడ్డి–మనూ అత్రి జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాయి. సిక్కి–అశ్విని ద్వయం 11–21, 22–24తో మూడో సీడ్ చెన్ కింగ్‌చెన్–జియా యిఫాన్ జంట చేతిలో ఓడిపోయింది. సాత్విక్–చిరాగ్ 17–21, 21–19, 17–21తో చోయ్ సొల్గు–మిన్ హుక్ కాంగ్ (కొరియా) చేతిలో... సుమీత్–మనూ అత్రి 13–21, 21–17, 23–25తో రెండో సీడ్ లి జున్హుయ్–లియు యుచెన్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయారు. సుమీత్ జంట నిర్ణాయక మూడో గేమ్‌లో ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను వదులుకోవడం గమనార్హం. -
క్రొయేషియా కొట్టేసింది
పోరు చివరిదాకా రసవత్తరంగా జరిగింది. ఆతిథ్య జట్టు ఆడుతుంది కాబట్టి ఫిష్ట్ స్టేడియం హోరెత్తింది. ఇరు జట్లు రెండు సార్లు సమవుజ్జీగా నిలిచాయి. నిర్ణీత సమయంలో రష్యా, క్రొయేషియా చెరో గోల్ చేశాయి. అదనపు సమయంలోనూ ఒక్కో గోల్ చేశాయి. 2–2తో స్కోరు సమం కావడంతో షూటౌట్ తప్పలేదు. రష్యా ఆటగాళ్లు వెనుకబడితే క్రొయేషియా 4–3తో మ్యాచ్‌ను, సెమీస్ చాన్స్‌నూ కొట్టేసింది. సొచి: రష్యా ఆడినంతసేపూ బాగా ఆడింది. ఈ క్వార్టర్ ఫైనల్లో క్రొయేషియా కంటే ముందే గోల్ చేసింది. అదనపు సమయం దాకా దీటుగా బదులిచ్చింది. అదనపు సమయం ఒక దశలో 2–1తో గెలుస్తుందనుకున్న క్రొయేషియాను చివరి నిమిషాల్లో గోల్ చేసి 2–2తో మళ్లీ నిలువరించింది. కానీ షూటౌటే ఆతిథ్య జట్టు కొంపముంచింది. ఇద్దరు ఆటగాళ్లు షూటౌట్ ఒత్తిడిలో చిత్తవడంతో చివరకు క్రొయేషియా 4–3తో విజయం సాధించింది. రష్యా తరఫున డెనిస్ చెరిషెవ్ (31వ ని.), మరియో ఫెర్నాండెస్ (115వ ని.) చెరో గోల్ చేయగా... క్రొయేషియా తరఫున అండ్రెజ్ క్రామరిక్ (39వ ని.), డొమగొజ్ విదా (100వ ని.) గోల్ చేశారు. అయితే షూటౌట్లో రష్యా జట్టులో స్మొలొవ్తో పాటు ఫెర్నాండెస్ విఫలం కాగా జగొయెవ్, ఇగ్నాషెవిచ్, కుజియయెవ్ గోల్ సాధించారు. క్రొయేషియాలో మటే కొవసిక్ మినహా బ్రొజొవిక్, మోడ్రిక్, విదా, రకిటిక్ గోల్ చేయడంతో ఆ జట్టు సెమీస్ చేరింది. బుధవారం జరిగే సెమీఫైనల్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌తో క్రొయేషియా తలపడుతుంది. ప్రపంచకప్‌లో క్రొయేషియా సెమీస్ చేరడం ఇది రెండోసారి. 1998లో తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఆరంభం నుంచి రష్యా జాగ్రత్తగా ఆడింది. క్రొయేషియా స్ట్రయికర్లను నిలువరిస్తూ కదంతొక్కింది. బంతి చాలావరకు క్రొయేషియా ఆధీనంలోనే ఉన్నా... వారి దాడుల్ని గోల్పోస్ట్దాకా రానివ్వకుండా రష్యా అడ్డుకుంది. దీంతో అరగంట దాకా ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఆ మరుసటి నిమిషంలో రష్యా మిడ్‌ఫీల్డర్ చెరిషెవ్ (31వ ని.) పెనాల్టీ బాక్స్‌కు సమీపంలో 25 గజాల దూరం నుంచి కొట్టిన షాట్ గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. కానీ 8 నిమిషాల వ్యవధిలోనే క్రొయేషియా స్కోరు సమం చేసింది.రష్యా డిఫెండర్లను ఛేదిస్తూ మడ్జుకిచ్ ఇచ్చిన పాస్‌ను మిడ్‌ఫీల్డర్ క్రామరిక్ (39వ ని.) హెడర్ గోల్‌గా మలిచాడు. ద్వితీయార్ధంలో ఇరు జట్లు తమ దాడులకు పదును పెట్టినప్పటికీ ఎవరు సఫలం కాలేదు. బంతి పదేపదే క్రొయేషియా ఆధీనంలోకి వెళ్లినా... ప్రత్యర్థి లక్ష్యంపై గురిపెట్టడంలో రష్యా ఆటగాళ్లు కూడా ఆకట్టుకున్నారు. 13 షాట్లు ఆడిన రష్యా ఐదు సార్లు లక్ష్యంపై గురిపెట్టగా... క్రొయేషియా 18 షాట్లలో కేవలం మూడు సార్లు లక్ష్యం దిశగా ఆడింది. అదనపు సమయం మొదలైన పది నిమిషాలకు క్రొయేషియా తరఫున విదా (100వ ని.) హెడర్ గోల్ చేయగా, ఇక మ్యాచ్ ముగిసే చివరి క్షణాల్లో ఫెర్నాండెస్ (115వ ని.) కూడా హెడర్తోనే గోల్ చేసి రష్యాకు ఊపిరి పోశాడు. దీంతో 2–2తో స్కోరు సమం కావడంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. -
సౌరాష్ట్రను గెలిపించిన జడేజా
సాక్షి, హైదరాబాద్: జాతీయ జట్టులో చోటు కోల్పోయిన స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా విజయ్ హజారే ట్రోఫీలో చెలరేగాడు. గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జార్ఖండ్‌తో జింఖానా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో జడేజా (116 బంతుల్లో 113 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో సౌరాష్ట్రను గెలిపించాడు. 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 48.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 333 పరుగులు చేసి విజయం సాధించింది. సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప (17 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), చతేశ్వర్ పుజారా (44; 6 ఫోర్లు), చిరాగ్ (46 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా రాణించారు. ఐదో వికెట్‌కు చిరాగ్‌తో కలిసి జడేజా 114 పరుగులు జతచేశాడు. అంతకుముందు జార్ఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 329 పరుగులు సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (93; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీని చేజార్చుకున్నాడు. సౌరాష్ట్ర బౌలర్లలో జైదేవ్ ఉనాద్కట్, చిరాగ్, శౌర్య రెండేసి వికెట్లు తీశారు. గ్రూప్ ‘డి’లోనే భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్ 45 పరుగులతో విదర్భపై, జమ్మూ కశ్మీర్ ఐదు వికెట్లతో సర్వీసెస్‌పై గెలుపొందాయి. -
ఆంధ్ర అదిరే ఆట
చెన్నై: రంజీ ట్రోఫీలో నాకౌట్ దశకు చేరే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయిన ఆంధ్ర క్రికెట్ జట్టు దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం జోరు మీదుంది. పటిష్టమైన తమిళనాడుతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర 29 పరుగుల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో ఆంధ్రకిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. తాజా గెలుపుతో ఆంధ్ర 16 పాయింట్లతో గ్రూప్ ‘సి’లో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 276 పరుగులు చేసింది. ఓపెనర్ శ్రీకర్ భరత్ (85 బంతుల్లో 82; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), రికీ భుయ్ (51 బంతుల్లో 52; ఒక ఫోర్, 3 సిక్స్‌లు), బోడపాటి సుమంత్ (67 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. అశ్విన్ హెబర్ (38; 4 ఫోర్లు, ఒక సిక్స్)తో కలిసి తొలి వికెట్‌కు భరత్ 87 పరుగులు జోడించాడు. అనంతరం 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు 48.5 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. ఆంధ్ర బౌలర్లలో శివ కుమార్ (2/53), అయ్యప్ప (2/37), భార్గవ్ భట్ (2/46), విహారి (2/41) రెండేసి వికెట్లు తీశారు. సోమవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌తో ఆంధ్ర తలపడుతుంది. -
రంజీ ట్రోఫీ క్వార్టర్స్‌లో ముంబై
ముంబై: త్రిపురతో జరిగిన గ్రూప్ ‘సి’ రంజీ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై 10 వికెట్ల తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 63 పరుగుల విజయలక్ష్యాన్ని ముంబై 6.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా అధిగమించింది. పృథ్వీ షా (26 బంతుల్లో 50 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఈ గ్రూప్‌లో ముంబై 21 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు ఇదే గ్రూప్‌లో ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ గెలిస్తే 21 పాయింట్లతో రెండో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంటుంది. ‘డ్రా’గా ముగిస్తే మాత్రం ఆంధ్ర జట్టు (19 పాయింట్లు) ముందంజ వేస్తుంది. మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో మూడో రోజు తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 237 పరుగులు చేసిన ఒడిశా ఇంకా నాలుగు పరుగులు వెనుకంజలో ఉంది. ఆట చివరి రోజు మధ్యప్రదేశ్‌కు కీలకం కానుంది. -
సింధు క్వార్టర్స్‌కు... సైనా ఇంటికి
కౌలూన్ (హాంకాంగ్): ఈ ఏడాది తన ఖాతాలో మరో సూపర్ సిరీస్ టైటిల్ జమ చేసుకునే దిశగా భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో అడుగు ముందుకు వేసింది. సీజన్ చివరి సూపర్ సిరీస్ టోర్నీ హాంకాంగ్ ఓపెన్‌లో ఈ తెలుగు తేజం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–14, 21–17తో అయా ఒహోరి (జపాన్)పై గెలిచింది. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు ఆద్యంతం ఆధిపత్యం చలా యించింది. తొలి గేమ్‌లో మొదటి రెండు పాయింట్లు ఒహోరి సాధించగా... ఆ వెంటనే సింధు స్కోరును సమం చేసింది. స్కోరు 4–5 వద్ద సింధు వరుసగా ఐదు పాయిం ట్లు గెలిచి 9–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి దాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న సింధు తొలి గేమ్‌ను దక్కించుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ మొదటి పాయింట్ ఒహోరినే సాధించింది. ఈసారి సింధు వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి ముందంజ వేసింది. అనంతరం సింధు మరింత జోరు పెంచడంతో ఒహోరి తేరుకోలేకపోయింది. ఈ ఏడాది సింధు సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్, ఇండియా ఓపెన్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ గెలవడంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు మాజీ చాంపియన్ సైనా నెహ్వాల్ 21–18, 19–21, 10–21తో ఎనిమిదో సీడ్ చెన్ యుఫె (చైనా) చేతిలో... పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–11, 10–21, 15–21తో సకాయ్ (జపాన్) చేతిలో ఓడిపోయారు. చెన్ యుఫెతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 7–10 వద్ద సైనా వరుసగా 10 పాయింట్లు కోల్పోవడం గమనార్హం. 7–20తో వెనుకబడిన దశలో సైనా వరుసగా మూడు పాయింట్లు గెలిచి, ఆ తర్వాత పాయింట్ సమర్పించుకొని ఓడిపోయింది. -
క్వార్టర్ ఫైనల్లో హరీందర్ పాల్ సంధూ
ముంబై: జేఎస్‌డబ్ల్యూ ఇండియా స్క్వాష్ సర్క్యూట్ ఓపెన్ టోర్నమెంట్లో జాతీయ మాజీ చాంపియన్ హరీందర్ పాల్ సింగ్ సంధూ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో హరీందర్ పాల్ 4–11, 11–6, 11–2, 11–3తో ఏడో సీడ్ ఇవాన్ యువెన్ (మలేసియా)పై సంచలన విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో ‘వైల్డ్ కార్డు’తో మెయిన్ ‘డ్రా’లో ఆడుతున్న రమిత్ టాండన్ (భారత్) 11–7, 4–11, 11–4, 11–3తో ఎనిమిదో సీడ్ అబ్దుల్లా తమిమీ (ఖతర్)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ సంపాదించాడు. -
క్వార్టర్స్‌లో భారత్
యోగ్‌జకార్తా (ఇండోనేసియా): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–2తో స్వీడన్‌ను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–మిథుల ద్వయం 21–16, 16–21, 21–15తో టిల్డా సజూ–కార్ల్ హర్‌బాకా జంటపై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ 21–11, 21–9తో కొలిన్ హమర్‌బర్గ్‌ను ఓడించి భారత్‌కు 2–0తో ఆధిక్యాన్ని అందించాడు. మహిళల సింగిల్స్‌లో అష్మిత చలిహా 21–8, 21–14తో అశ్వతిపై గెలిచి భారత్‌కు 3–0తో విజయాన్ని ఖాయం చేసింది. నామమాత్రమైన పురుషుల డబుల్స్‌లో గారగ కృష్ణప్రసాద్–ధ్రువ్ కపలి ద్వయం... మహిళల డబుల్స్‌లో రితూపర్ణ–మిథుల జంట ఓడిపోయాయి. ఐదు జట్లున్న గ్రూప్ ‘డి’లో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇంతకుముందు జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో భారత్ 5–0తో అమెరికా, హంగేరి, ఆస్ట్రేలియాపై గెలిచింది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో మలేసియాతో భారత్ తలపడుతుంది. -
క్వార్టర్స్‌లో బోపన్న జోడి
మోంటెకార్లో (మొనాకో): మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో భారత ఆటగాడు రోహన్ బోపన్న క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బోపన్న–పాల్బో క్యువాన్ (ఉరుగ్వే) జోడి 6–7, 6–4, 10–6 స్కోరుతో రాజీవ్ రామ్ (అమెరికా) – రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జంటపై నెగ్గింది.