భువనేశ్వర్: డిఫెండింగ్ చాంపియన్ భారత్ జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో టైటిల్ నిలబెట్టుకునేందుకు మరో అడుగు ముందుకు వేసింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జూనియర్ జట్టు 1–0తో బెల్జియంపై గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను శారదానంద్ తివారి సాధించాడు. ఆట 21వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను శారదానంద్ ఎలాంటి పొరపాటు చేయకుండా నేర్పుగా గోల్‌పోస్ట్‌లోకి పంపాడు.
దీంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీన్ని తుదిదాకా కాపాడుకొని విజయం సాధించింది. మ్యాచ్ మొదలవగానే బెల్జియం దూకుడు పెంచింది. పదేపదే భారత రక్షణపంక్తిని ఛేదించుకుంటూ దాడులకు పదునుపెట్టింది. అయితే గోల్‌కీపర్ పవన్ చక్కని సమయస్ఫూర్తితో వారి ప్రయత్నాల్ని నీరుగార్చాడు.
ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో జర్మనీ పెనాల్టీ షూటౌట్‌లో 3–1తో స్పెయిన్‌పై, అర్జెంటీనా 2–1 తో నెదర్లాండ్స్‌పై, ఫ్రాన్స్ 4–0తో మలేసియాపై గెలిచాయి. రేపు జరిగే సెమీఫైనల్స్‌లో అర్జెంటీనా తో ఫ్రాన్స్; జర్మనీతో భారత్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment