
వైష్ణవి శుభారంభం
జాతీయ ఓపెన్ టెన్నిస్
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి పెద్దిరెడ్డి వైష్ణవి శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో ఆరో సీడ్ వైష్ణవి 6-2, 6-0తో శ్వేతా శ్రీహరి (తమిళనాడు)పై గెలిచింది. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి రిషిక సుంకర కూడా ముందంజ వేసింది. తొలి రౌండ్‌లో టాప్ సీడ్ రిషిక 6-3, 6-4తో చామర్తి సాయి సంహిత (తమిళనాడు)ను ఓడించింది.
బాలికల అండర్-18 సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణులు చల్లా హర్షసాయి, మౌళిక రామ్ మూడో రౌండ్‌లోకి ప్రవేశించగా... అమినేని శివాని, ఇస్కా అక్షర ఓడిపోయారు. రెండో రౌండ్‌లో హర్షసాయి 6-1, 7-5తో ఆరుషి కక్కర్ (చండీగఢ్)పై, మౌళిక 7-5, 6-2తో ఇషా బుద్వాల్ (మధ్యప్రదేశ్)పై గెలిచారు. శివాని 1-6, 3-6తో వన్షిక సాహ్ని (ఢిల్లీ) చేతిలో; అక్షర 1-6, 0-6తో అభినిక (తమిళనాడు) చేతిలో ఓడిపోయారు.
పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారులు విఘ్నేశ్, విష్ణువర్ధన్ ముందంజ వేశారు. తొలి రౌండ్‌లో విఘ్నేశ్ 6-3, 6-3తో అజయ్ యాదవ్‌పై, విష్ణువర్ధన్ 7-5, 6-4తో బెరైడ్డి సాయిశరణ్ రెడ్డిపై గెలిచారు. మరో మ్యాచ్‌లో స్కోరు 2-6, 3-0తో ఉన్నదశలో షేక్ అబ్దుల్లా ప్రత్యర్థి ప్రజ్వల్ దేవ్ (కర్ణాటక) గాయం కారణంగా వైదొలిగాడు. బాలుర అండర్-18 విభాగం రెండో రౌండ్‌లో నిఖిల్ సాయి మన్నెపల్లి 1-6, 3-6తో అమర్‌నాథ్ అరోరా (ఢిల్లీ) చేతిలో ఓడిపోయాడు.