
మనీలా (ఫిలిప్పీన్స్): ఎనిమిదేళ్ల తర్వాత ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రెండో పతకం ఖరారు చేసుకోవడానికి భారత స్టార్ పీవీ సింధు విజయం దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ 100వ ర్యాంకర్ యు యాన్ జస్లిన్ హుయ్ (సింగపూర్)తో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21–16, 21–16తో విజయం సాధించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్ జియావో (చైనా)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 7–9తో వెనుకబడి ఉంది.
సైనా, శ్రీకాంత్ పరాజయం
భారత మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. వాంగ్ జి యి (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సైనా 21–12, 7–21, 13–21తో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ 16–21, 21–17, 17–21తో ప్రపంచ 81వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు.
పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–17, 21–15తో అకీరా కోగా –తైచి సైటో (జపాన్) ద్వయంపై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో (భారత్) జోడీ 18–21, 18–21తో తాన్ కియాన్ మెంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment