వాంటా (ఫిన్‌లాండ్): ఆర్క్‌టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్ పీవీ సింధు మరో అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 21–11, 21–10తో ప్రపంచ 22వ ర్యాంకర్ వెన్ చి సు (చైనీస్ తైపీ)పై గెలుపొందింది. ఈ ఏడాది వెన్ చి సుపై సింధుకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో వెన్ చి సుపై సింధు వరుస గేముల్లో నెగ్గింది.
నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్ థయ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 1–0తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. కిడాంబి శ్రీకాంత్, కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. శ్రీకాంత్ 15–21, 12–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో... కిరణ్ జార్జి (భారత్) 10–21, 20–22తో లు గ్వాంగ్ జు (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment