లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్‌లో ఫ్రాన్స్ అన్‌సీడెడ్ ప్లేయర్ అలైజ్ కార్నెట్ మహిళల సింగిల్స్‌లో పెను సంచలనం సృష్టించింది. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్)ను మూడో రౌండ్లోనే కంగు తినిపించింది. వరుసగా 37 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని టాప్‌సీడ్, టోర్నీ హాట్ ఫేవరెట్ జైత్రయాత్రకు ప్రపంచ 37వ ర్యాంకర్ కార్నెట్ బ్రేకులేసింది. శనివారం జరిగిన పోరులో ఆమె 6–4, 6–2తో అలవోక విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2005 నుంచి గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను కొనసాగిస్తున్న ఫ్రాన్స్ వెటరన్ స్టార్ 2014లో కూడా ఇలాదే సెరెనా విలియమ్స్‌కు షాక్ ఇచ్చింది. అప్పటికే 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన టాప్‌సీడ్ సెరెనాను కార్నెట్ మూడో రౌండ్లో ఓడించింది.
తాజా సంచలనంపై ఆమె మాట్లాడుతూ సెరెనా మ్యాచే గుర్తుకొచ్చిందని పేర్కొంది. మిగతా మ్యాచ్‌ల్లో 2018 వింబుల్డన్ చాంపియన్, 15వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 4–6, 5–7తో ఎలిస్ మెర్టెన్స్ (బెల్జియం) చేతిలో ఓడగా, నాలుగో సీడ్ బడొసా (స్పెయిన్) 7–5, 7–6 (7/4)తో 25వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. 11వ సీడ్ కొకొ గాఫ్ (అమెరికా)కు 6–7 (4/7), 6–2, 6–1తో 20వ సీడ్ అనిసిమోవా (అమెరికా) చేతిలో చుక్కెదురైంది. 16వ సీడ్ హలెప్ (రొమేనియా) 6–4, 6–1తో మగ్దలిన ఫ్రెచ్ (పోలండ్)పై నెగ్గింది. సెరెనాకు తొలిరౌండ్లోనే ఇంటిదారి చూపించిన హర్మొని టన్ (ఫ్రాన్స్) 6–1, 6–1తో బౌల్టర్ (ఇంగ్లండ్)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment