లండన్: 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ జర్మనీ టెన్నిస్ క్రీడాకారిణి తాత్యానా మరియా తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 34 ఏళ్ల తాత్యానా మరియా 5–7, 7–5, 7–5తో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 12వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)పై సంచలన విజయం సాధించింది.
2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మరియా తొలి సెట్‌ను కోల్పోయి రెండో సెట్‌లో 4–5 స్కోరు వద్ద తన సర్వీస్‌లో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుంది. మ్యాచ్ మొత్తంలో తొమ్మిది ఏస్‌లు సంధించిన మరియా తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ఒస్టాపెంకో ఏకంగా 57 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. 2007 నుంచి ఇప్పటిదాకా 34 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో పోటీపడిన మరియా మూడో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జూల్ నిమియర్ (జర్మనీ) 6–2, 6–4తో హీతెర్ వాట్సన్ (బ్రిటన్)పై, మేరీ బుజ్కోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–2తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై గెలుపొంది తమ కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించారు.
నాదల్ పదోసారి...
పురుషుల సింగిల్స్‌లో రెండుసార్లు చాంపియన్, స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ పదోసారి వింబుల్డన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6–1, 6–2, 6–4తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై గెలిచాడు.
ఐదో సీడ్ అల్కరాజ్ ఓటమి
మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 1–6, 4–6, 7–6 (10/8), 3–6తో పదో సీడ్ జానిక్ సినెర్ (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ కామెరాన్ నోరీ (బ్రిటన్) 6–4, 7–5, 6–4తో టామీ పాల్ (అమెరికా)పై గెలుపొందాడు.
Comments
Please login to add a commentAdd a comment