జకార్తా: థాయ్‌లాండ్ ఓపెన్, సింగపూర్ ఓపెన్ టోర్నీలలో తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు... ప్రతిషాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో మాత్రం తొలి రౌండ్ అడ్డంకిని దాటింది. ఇండోనేసియా క్రీడాకారిణి, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్‌పై సింధు వరుస గేముల్లో గెలిచింది.
మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు 21–19, 21–15తో మరిస్కాను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీ లభించింది. ఆధిక్యం పలుమార్లు ఇద్దరితో దోబూచులాడింది. అయితే కీలకదశలో సింధు పైచేయి సాధించి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ ఆరంభంలోనూ ఇద్దరూ ప్రతి పాయింట్‌కు హోరాహోరీగా పోరాడారు.
సింధు స్కోరు 7–6 వద్ద మూడు పాయింట్లు నెగ్గి 10–6తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఒక పాయింట్ కోల్పోయిన సింధు మళ్లీ చెలరేగి ఈసారి వరుసగా ఆరు పాయింట్లు గెలుపొంది 16–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని సింధు విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ ఏడాది మరిస్కా చేతిలో స్పెయిన్ మాస్టర్స్, మలేసియా మాస్టర్స్ టోర్నీలలో ఓడిపోయిన సింధు ఆమెను ఈ సీజన్‌లో తొలిసారి ఓడించడం గమనార్హం.
ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధుకు అగ్ని పరీక్ష ఎదురుకానుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడనుంది. తై జు యింగ్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 5–18తో వెనుకబడి ఉంది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చివరిసారి తై జు యింగ్‌ను ఓడించిన సింధు ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ ప్లేయర్‌తో ఆడిన ఎనిమిది వరుస మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్‌లో ప్రణయ్ 50 నిమిషాల్లో 21–16, 21–14తో కెంటా నిషిమోటో (జపాన్)పై గెలుపొందాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో ప్రణయ్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో ప్రణయ్, అంగుస్ 5–5తో సమఉజ్జీగా ఉన్నారు.
సాత్విక్ జోడీ ముందంజ
డబుల్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా... పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ 16వ ర్యాంక్ జంట గాయత్రి–ట్రెసా జాలీ 22–20, 12–21, 16–21తో ప్రపంచ 18వ ర్యాంక్ జోడీ రిన్ ఇవనాగ–కి నకనిషి (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది.
క్రిస్టో పొపోవ్–తోమా పొపోవ్ (ఫ్రాన్స్)లతో జరిగిన మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి తొలి గేమ్‌ను 21–12తో నెగ్గి రెండో గేమ్‌లో 11–7తో ఆధిక్యంలో ఉన్న దశలో పొపోవ్ బ్రదర్స్ గాయం కారణంగా వైదొలిగారు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–ఎంఆర్ అర్జున్ (భారత్) ద్వయం 21–12, 6–21, 20–22తో ఎనిమిదో సీడ్ ఒన్జ్ యె సిన్–తియో ఈ యి (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment