Open Grand Slam tennis tournament
-
నాదల్ సరసన జొకోవిచ్
పారిస్: వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో రాఫెల్ నాదల్ ఒక్కడే అత్యధికంగా 14 సార్లు క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నాడు. అయితే నాదల్ రికార్డును టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ సోమవారం సమం చేశాడు. ఈ సెర్బియా స్టార్ కూడా 14వ సారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొని నాదల్ సరసన చేరాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 2016 చాంపియన్ జొకోవిచ్ 6–4, 6–3, 6–3తో 15వ సీడ్ ఖచనోవ్ (రష్యా)ను ఓడించాడు. ఈ టోర్నీలో వరుసగా 11వసారి క్వార్టర్ ఫైనల్ చేరుకునే క్రమంలో జొకోవిచ్ తన ప్రత్యర్థులకు ఒక్కసెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఖచనోవ్‌తో 2 గంటల 23 నిమిషాలపాటు సాగిన పోరులో జొకోవిచ్ ఆరు బ్రేక్ పాయింట్లు సాధించాడు. 28 అనవసర తప్పిదాలు చేసిన ఈ సెర్బియా స్టార్ నెట్ వద్దకు 35 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. ఈసారి జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ గెలిస్తే టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలను (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) రెండుసార్లు చొప్పున సొంతం చేసుకున్న ఏకైక క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పుతాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–3, 7–6 (11/9), 6–2తో 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై, 13వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–7 (4/7), 7–5, 6–4, 7–6 (7/3)తో ఫుచోవిచ్ (హంగేరి)పై గెలిచి తమ కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. క్విటోవా 2012 తర్వాత... మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), అన్‌సీడెడ్ క్రీడాకారిణి లౌరా సిగెముండ్ (జర్మనీ) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. క్విటోవా 6–2, 6–4తో షుయె జాంగ్ (చైనా)పై, లౌరా సిగెముండ్ 7–5, 6–2తో పౌలా బడోసా (స్పెయిన్)పై గెలిచారు. కెరీర్లో 16వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న లౌరా తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది. మరోవైపు క్విటోవా 2012 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 2–6, 6–2, 6–1తో ఫియోనా ఫెరో (ఫ్రాన్స్)పై నెగ్గింది. -
సెరెనా సన్నాహాలు షురూ
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో సత్తా చాటేందుకు అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియర్స్ సన్నద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో ఆమె సహచర ప్లేయర్లంతా టోర్నీలో పాల్గొనడంపై మల్లాగుల్లాలు పడుతుంటే... సెరెనా మాత్రం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళుతోంది. సన్నాహాల్లో భాగంగా ప్రాక్టీస్ నిమిత్తం ఆమె తన ఇంట్లోనే నూతన టెన్నిస్ కోర్టును ఏర్పాటు చేసుకుంది. ఇప్పటివరకు యూఎస్ ఓపెన్ డెకో టర్ఫ్ కోర్టుపై జరుగగా... ఈసారి తొలిసారిగా లేకోల్డ్ కోర్టుపై జరుగనుంది. ఈ నేపథ్యంలో కొత్త కోర్టు స్థితిగతులపై అనుభవం పొందేందుకు స్వయంగా లేకోల్డ్ టెన్నిస్ కోర్టును ఏర్పాటు చేసుకున్న సెరెనా రెండు నెలలుగా అదే ఉపరితలంపై ప్రాక్టీస్ చేస్తోంది. 2018, 2019 యూఎస్ ఓపెన్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచిన విలియమ్స్ ఈ సీజన్లో విజేతగా నిలిచి 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును సమం చేసేందుకు పట్టుదలతో ఉంది. ఆగస్టు 31న యూఎస్ ఓపెన్ మొదలవుతుంది. -
వేచి చూద్దాం!
బార్సిలోనా (స్పెయిన్): కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో... అమెరికాలోని న్యూయార్క్‌నగరం వేదికగా జరగాల్సిన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో తాను పాల్గొనే అవకాశాలు తక్కువగా ఉన్నాయని స్పెయిన్ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ వెల్లడించాడు. ‘న్యూయార్క్‌లో జరిగే టెన్నిస్ టోర్నీలో పాల్గొనేందుకు ఇప్పటికిప్పుడు అమెరికాకు వెళ్తావా అని ఎవరైనా నన్ను అడిగితే... వెళ్లలేను అని సమాధానం చెబుతాను. అయితే రెండు నెలల తర్వాత న్యూయార్క్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేను. మెరుగవుతాయనే ఆశిస్తున్నాను. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో న్యూయార్క్ ఒకటి. ముందైతే యూఎస్ ఓపెన్ టోర్నీ నిర్వాహకుల నుంచి స్పష్టమైన ప్రకటన రానివ్వండి. అప్పటి వరకు వేచి చూద్దాం’ అని యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్‌గా ఉన్న నాదల్ తెలిపాడు. నాదల్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధిస్తే... పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ (20 టైటిల్స్)ను సమం చేస్తాడు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది యూఎస్ ఓపెన్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 14 వరకు జరగాల్సి ఉంది. కరోనా కారణంగా టెన్నిస్ టోర్నీలపై తీవ్ర ప్రభావమే పడింది. మార్చి రెండో వారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ టోర్నీలు ఆగిపోయాయి. కరోనా దెబ్బకు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని రద్దు చేశారు. మే–జూన్లలో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని సెప్టెంబర్ చివరి వారానికి వాయిదా వేశారు. ‘ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, సురక్షితంగా యూఎస్ ఓపెన్ జరిగేలా నిర్వాహకులు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఒకవేళ అలా చేయకుంటే అందులో అర్థం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రేక్షకులు లేకుండా ఆడాల్సి వస్తే దానికి సిద్ధమే. అయితే రాబోయే రెండు నెలల్లో పరిస్థితులు మెరుగుపడి ప్రేక్షకుల సమక్షంలోనే యూఎస్ ఓపెన్ జరగాలని ఆశిస్తున్నాను’ అని ఈ మాజీ నంబర్‌వన్ వ్యాఖ్యానించాడు. రెండు వారాల వ్యవధిలో యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ జరగనున్నందున... రెండింటిలోనూ తాను ఆడే విషయంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనన్నాడు. అంతర్జాతీయంగా అన్ని దేశాల్లోనూ ప్రయాణ ఆంక్షలు ఎత్తివేశాకే టెన్నిస్ టోర్నీలు నిర్వహిస్తే బాగుంటుందని నాదల్ అభిప్రాయపడ్డాడు. -
ప్రజ్నేశ్ ముందంజ
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల మెయిన్ ‘డ్రా’కు భారత నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ అడుగు దూరంలో నిలిచాడు. ఇక్కడ జరుగుతున్న క్వాలిఫయర్స్ టోర్నీలో అతడు ఫైనల్‌కు అర్హత సాధించాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 1–6, 6–2, 6–2తో యానిక్ హంఫ్మాన్ (జర్మనీ)పై గెలుపొందాడు. ఫైనల్లో ఎర్నెస్ట్ గుల్బిస్ (లాత్వియా)తో ప్రజ్నేశ్ తలపడతాడు. మరో భారత సింగిల్స్ ఆటగాడు సుమీత్ నాగల్ 6–7 (2/7), 2–6,తో మొహమ్మద్ సావత్ (ఈజిప్ట్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇతనితో పాటు ఆస్ట్రేలియా ఓపెన్ క్వాలిఫయర్స్ బరిలో దిగిన రామ్‌కుమార్ రామనాథన్ (భారత్), మహిళల విభాగంలో అంకిత రైనా (భారత్) ఇప్పటికే వెనుదిరిగారు. ఈ నెల 20న ఆస్ట్రేలియా ఓపెన్ ఆరంభమవుతుంది. -
క్విటోవా, సఫరోవా శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) అతి కష్టమ్మీద తొలి రౌండ్ అడ్డంకిని దాటింది. ఆదివారం మొదలైన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో పదో సీడ్ క్విటోవా 6-2, 4-6, 7-5తో డాంకా కొవినిచ్ (మోంటెనిగ్రో)పై విజయం సాధించింది. ఏకంగా పది డబుల్ ఫాల్ట్‌లు చేసిన క్విటోవా ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి గట్టెక్కింది. ఇతర మ్యాచ్‌ల్లో 11వ సీడ్ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 6-0, 6-2తో దియాత్‌చెంకో (రష్యా)పై, 24వ సీడ్ పావ్లీచెంకోవా (రష్యా) 6-2, 6-0తో సొరిబెస్ టోర్మో (స్పెయిన్)పై గెలిచారు. పురుషుల సింగిల్స్ విభాగంలో 19వ సీడ్ పెయిర్ (ఫ్రాన్స్) 6-2, 4-6, 6-4, 1-6, 6-4తో అల్బోట్ (మాల్డొవా)పై, 17వ సీడ్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 7-6 (8/6), 7-6 (8/6), 6-4తో చెచినాటో (ఇటలీ)పై గెలిచారు. వర్షం కారణంగా ఇతర మ్యాచ్‌లకు అంతరాయం ఏర్పడింది.