
పారిస్: ఈ ఏడాది వరుసగా రెండుసార్లు బీవెన్ జాంగ్ చేతిలో ఓడిపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మూడోసారి మాత్రం పైచేయి సాధించింది. మంగళవారం మొదలైన ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–17, 21–8తో ప్రపంచ 11వ ర్యాంకర్, చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్‌పై గెలిచింది.
కేవలం 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సింధుకు కాస్త పోటీ ఇచ్చిన జాంగ్ రెండో గేమ్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఈ ఏడాది ఇండియా ఓపెన్ ఫైనల్లో, గత వారం డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్‌లో సింధుపై నెగ్గిన జాంగ్ ఈసారి మాత్రం ఓటమి రుచి చూసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ (భారత్) జంట 14–21, 17–21తో లీ జున్‌హుయ్–లియు యుచెన్ (చైనా) జోడీ చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment