బర్మింగ్‌హామ్ : ఎంతోకాలంగా భారత మహిళా క్రీడాకారిణులకు అందని ద్రాక్షగా ఉన్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను సాధించే దిశగా తెలుగు తేజం పీవీ సింధు మరో అడుగు వేసింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఈ హైదరాబాద్ అమ్మాయి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–13, 13–21, 21–18తో ప్రపంచ 11వ ర్యాంకర్ నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)పై కష్టపడి గెలిచింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు ఆటతీరులో నిలకడ లోపించింది. అయితే కీలకదశలో తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి విజయాన్ని దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో సింధు 12–16తో నాలుగు పాయింట్లు వెనుకబడింది. కానీ కళ్లు చెదిరే స్మాష్‌లతో విరుచుకుపడి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 17–16తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో జిందాపోల్ రెండు పాయింట్లు నెగ్గి 18–17తో ముందంజ వేసింది. కానీ సంయమనం కోల్పోకుండా ఆడిన సింధు ఈసారి వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 21–18తో మూడో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకుంది. పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో బుధవారం జరిగిన తొలి రౌండ్‌లోనూ సింధు మూడు గేముల్లో గెలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు తలపడుతుంది.
బుధవారం ఆలస్యంగా ముగిసిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ (భారత్) 9–21, 21–18, 21–18తో ఎనిమిదో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–19, 21–18తో యుగో కొబయాషి–హోకి టకురో (జపాన్) జంటను ఓడించింది.
రెండో స్థానానికి శ్రీకాంత్
గురువారం విడుదలైన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ శ్రీకాంత్ రెండోసారి కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్ రెండో స్థానానికి చేరుకున్నాడు. గతవారం మూడో స్థానంలో నిలిచిన శ్రీకాంత్ ఈసారి ఒక స్థానం మెరుగుపర్చుకున్నాడు. గత నవంబర్‌లో తొలిసారి రెండో ర్యాంక్ చేరిన శ్రీకాంత్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో విజేతగా నిలిస్తే ప్రపంచ నంబర్‌వన్ అవుతాడు. భారత్‌కే చెందిన సాయిప్రణీత్ రెండు స్థానాలు పురోగతి సాధించి 12వ ర్యాంక్‌కు చేరాడు. మహిళల సింగిల్స్‌లో సింధు మూడో ర్యాంక్‌లో, సైనా 12వ ర్యాంక్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment