క్వార్టర్ ఫైనల్లో వికాస్
రియో డి జనీరో: ఇంకొక్క విజయం సాధిస్తే భారత బాక్సర్ వికాస్ క్రిషన్ యాదవ్ రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని ఖాయం చేసుకుంటాడు. శనివారం జరిగిన పురుషుల మిడిల్ వెయిట్ (75 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్‌లో వికాస్ 3-0తో (30-27, 29-28, 29-28) సిపాల్ ఒండెర్ (టర్కీ)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బాక్సింగ్‌లో సెమీఫైనల్‌కు చేరిన వారికి కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి.
మూడు రౌండ్‌లపాటు జరిగిన ప్రిక్వార్టర్స్ బౌట్‌లో 24 ఏళ్ల వికాస్ ఆధిపత్యం కనబరిచాడు. దూకుడుగా ఆడుతూ తన ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించాడు. మూడో రౌండ్‌లో వికాస్ పంచ్‌లకు తట్టుకోలేక రక్తం కారుతున్న తన కంటికి చికిత్స చేయించుకునేందుకు సిపాల్ విరామం తీసుకోవడం గమనార్హం. సోమవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో 20 ఏళ్ల బెక్తెమిర్ మెలికుజియెవ్ (ఉజ్బెకిస్తాన్)తో వికాస్ తలపడతాడు.
బెక్తెమిర్ 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం, ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2014 యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు. ‘నా గ్రూప్‌లో బెక్తెమిర్ క్లిష్టమైన ప్రత్యర్థి. క్వార్టర్స్‌లో అతణ్ని ఓడిస్తే నేను స్వర్ణంతోనే తిరిగి వస్తాను. గత ఆసియా చాంపియన్‌షిప్ ఫైనల్లో నేను సరైన ఫామ్‌లో లేనందున బెక్తెమిర్ చేతిలో ఓడిపోయాను. ఈసారి అతణ్ని ఓడిస్తాననే నమ్మకం ఉంది’ అని వికాస్ వ్యాఖ్యానించాడు.