Rio Games
-
క్వార్టర్ ఫైనల్లో వికాస్
రియో డి జనీరో: ఇంకొక్క విజయం సాధిస్తే భారత బాక్సర్ వికాస్ క్రిషన్ యాదవ్ రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని ఖాయం చేసుకుంటాడు. శనివారం జరిగిన పురుషుల మిడిల్ వెయిట్ (75 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లో వికాస్ 3-0తో (30-27, 29-28, 29-28) సిపాల్ ఒండెర్ (టర్కీ)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బాక్సింగ్‌లో సెమీఫైనల్‌కు చేరిన వారికి కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. మూడు రౌండ్లపాటు జరిగిన ప్రిక్వార్టర్స్ బౌట్లో 24 ఏళ్ల వికాస్ ఆధిపత్యం కనబరిచాడు. దూకుడుగా ఆడుతూ తన ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించాడు. మూడో రౌండ్లో వికాస్ పంచ్‌లకు తట్టుకోలేక రక్తం కారుతున్న తన కంటికి చికిత్స చేయించుకునేందుకు సిపాల్ విరామం తీసుకోవడం గమనార్హం. సోమవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో 20 ఏళ్ల బెక్తెమిర్ మెలికుజియెవ్ (ఉజ్బెకిస్తాన్)తో వికాస్ తలపడతాడు. బెక్తెమిర్ 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం, ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2014 యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు. ‘నా గ్రూప్‌లో బెక్తెమిర్ క్లిష్టమైన ప్రత్యర్థి. క్వార్టర్స్‌లో అతణ్ని ఓడిస్తే నేను స్వర్ణంతోనే తిరిగి వస్తాను. గత ఆసియా చాంపియన్‌షిప్ ఫైనల్లో నేను సరైన ఫామ్‌లో లేనందున బెక్తెమిర్ చేతిలో ఓడిపోయాను. ఈసారి అతణ్ని ఓడిస్తాననే నమ్మకం ఉంది’ అని వికాస్ వ్యాఖ్యానించాడు. -
కొడుకు మ్యాచ్‌ను చూడాలని...
* అవతార్ తల్లిదండ్రుల తపన * ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు న్యూఢిల్లీ: క్రీడల్లో ప్రవేశమున్న తమ పిల్లల మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అయితే ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్న ఆ తండ్రి ఇప్పటిదాకా తన కొడుకు ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకించింది లేదు. తమ పిల్లాడి అద్భుత నైపుణ్యాన్ని టీవీల్లో చూసే మురిసిపోయేవాడు. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా కనులారా వీక్షించాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే అతడి కుమారుడు ఈసారి పాల్గొనేది ప్రపంచ క్రీడల్లోనే అత్యున్నత వేదికైన ఒలింపిక్స్‌లో మరి. భారత్ తరఫున రియో గేమ్స్‌లో పాల్గొంటున్న ఏకైక జూడో క్రీడాకారుడు అవతార్ సింగ్ కుటుంబ పరిస్థితి ఇది. అవతార్ తండ్రి షింగర సింగ్ స్థానిక ఆస్పత్రిలో చిన్నస్థాయి ఉద్యోగి. తల్లి గృహిణి. వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఇప్పటిదాకా కుమారుడి విదేశీ ప్రయాణాల ఖర్చులకు అప్పు చేసి మరీ డబ్బు అందించాడు. అయితే ఈసారి కొడుకును ప్రభుత్వమే పంపిస్తున్నా తాము మాత్రం బ్రెజిల్‌కు వెళ్లాలంటే లక్షల్లో డబ్బులు కావాలి. అందుకే ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అదృష్టవశాత్తు వీరికి చేయూత నందించేందుకు మిలాప్.ఓఆర్జీ వెబ్సైట్ ముందుకు వచ్చింది. అవతార్ తల్లిదండ్రులకు ఈ పర్యటనకయ్యే ఖర్చు రూ.8 లక్షల కోసం విరాళాలను సేకరించాలని నిర్ణయించింది. 90కేజీల విభాగంలో తలపడే అవతార్ మ్యాచ్ వచ్చే నెల 10న ఉంటుంది. ఈనెల 31 వరకు సరిపోయేంత విరాళాలు అందుతాయని ఆశిస్తున్నారు.