క్వార్టర్ ఫైనల్లో భారత ద్వయం
సింధు, మాళవిక, అనుపమ నిష్క్రమణ
గాయత్రి–ట్రెసా ద్వయం ఓటమి
షెన్‌జెన్: పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆడుతున్న తొలి టోర్నమెంట్ చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ జోడీగా ఈ టోర్నీలో ఆడుతున్న సాత్విక్–చిరాగ్ ద్వయం కష్టపడి గెలిచి ముందంజ వేసింది.
గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 9వ ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 21–19, 21–15తో ప్రపంచ 15వ ర్యాంక్ ద్వయం రస్‌ముస్ జార్–ఫ్రెడెరిక్ సొగార్డ్ (డెన్మార్క్)పై గెలిచింది. 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీకి గట్టిపోటీనే ఎదురైంది. తొలి గేమ్ చివర్లో సాత్విక్–చిరాగ్ పైచేయి సాధించారు.
రెండో గేమ్‌లో స్కోరు 13–12 వద్ద భారత జంట వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 17–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో రెండో గేమ్‌నూ సొంతం చేసుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ కిమ్ అస్ట్రుప్–ఆండెర్స్ స్కారప్ రస్‌ముసేన్ (డెన్మార్క్)తో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో భారత జంట 3–6తో వెనుకబడి ఉండటం గమనార్హం.
లక్ష్య సేన్ ముందంజ
పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. రస్‌ముస్ గెమ్కే (డెన్మార్క్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–16, 21–18తో అలవోకగా గెలిచాడు. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్‌లో దూకుడుగా ఆడాడు. 13–6తో ఆధిక్యంలోకి వచ్చాడు.
ఆ తర్వాత రస్‌ముస్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి ఆధిక్యాన్ని 13–10కి తగ్గించాడు. ఈ దశలో లక్ష్య సేన్ నిలకడగా రాణించి తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో లక్ష్య సేన్‌కు గట్టిపోటీ ఎదురైంది. పలుమార్లు ఇద్దరి స్కోర్లు సమమయ్యాయి. అయితే కీలకదశలో లక్ష్య సేన్ పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు.
పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆడుతున్న నాలుగో టోరీ్నలో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ చేరుకోవడం గమనార్హం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 3వ ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సన్ (డెన్మార్క్)తో లక్ష్య సేన్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో లక్ష్య సేన్ 2–4తో వెనుకంజలో ఉన్నాడు.
ముగ్గురికీ నిరాశ
మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. భారత స్టార్ పీవీ సింధు, రైజింగ్ స్టార్స్ మాళవిక బన్సోద్, అనుపమ ఉపాధ్యాయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. ప్రపంచ 19వ ర్యాంకర్ సింధు 16–21, 21–17, 21–23తో యో జియా మిన్ (సింగపూర్) చేతిలో పరాజయం చవిచూసింది. గతంలో జియా మిన్‌తో ఆడిన ఐదుసార్లూ నెగ్గిన సింధుకు ఆరోసారి మాత్రం చుక్కెదురైంది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఒకదశలో 13–9తో ఆధిక్యంలో నిలిచింది.
ఈ దశలో జియో మిన్ వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 15–13తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రతి పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు జియా మిన్ కొట్టిన బాడీ స్మాష్‌కు సింధు జవాబివ్వలేకపోవడంతో ఆమె ఓటమి ఖరారైంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మాళవిక 9–21, 9–21తో సుపనిద (థాయ్‌లాండ్) చేతిలో, అనుపమ 7–21, 14–21తో నత్సుకి నిదైరా (జపాన్) చేతిలో ఓడిపోయారు.
మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 16–21, 11–21తో రెండో సీడ్ లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) జోడీకి సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జంట ‘వాకోవర్’ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment