ప్రపంచ మూడో ర్యాంక్ జంటపై విజయం
చైనా మాస్టర్స్ టోర్నీలో సెమీఫైనల్లోకి
షెన్‌జెన్: పారిస్ ఒలింపిక్స్ తర్వాత పాల్గొంటున్న తొలి టోర్నమెంట్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ అదరగొడుతోంది. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ మూడో ర్యాంక్ ద్వయం కిమ్ అస్‌ట్రుప్–ఆండెర్స్ స్కారప్ రస్‌ముసేన్ (డెన్మార్క్)తో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–16, 21–19తో గెలిచింది.
47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ తొలి గేమ్‌లో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. ఒక్కసారి కూడా స్కోరును సమం కానివ్వలేదు. రెండో గేమ్‌లో మాత్రం గట్టిపోటీనే లభించింది. డెన్మార్క్ జంట తీవ్రంగా పోరాడటంతో పలుమార్లు స్కోరు సమమైంది. చివర్లో స్కోరు 19–19 వద్ద సమంగా ఉన్నపుడు భారత జోడీ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది.
గత ఏడాది ఇదే టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ నేడు జరిగే సెమీఫైనల్లో జిన్ యోంగ్–జే సియో సెయింగ్ (దక్షిణ కొరియా) జోడీతో తలపడుతుంది. గతంలో కిమ్ అస్‌ట్రుప్–స్కారప్‌లతో తొమ్మిదిసార్లు తలపడి, ఆరుసార్లు ఓడిపోయిన భారత జంట ఈ ఏడాది డెన్మార్క్ ద్వయంపై రెండోసారి గెలిచింది. ఇండియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోనూ డెన్మార్క్ జోడీనే సాత్విక్–చిరాగ్ ద్వయం ఓడించింది.
పోరాడి ఓడిన లక్ష్య సేన్
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్‌కు నిరాశ ఎదురైంది. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సన్ (డెన్మార్క్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 18–21, 15–21తో ఓడిపోయాడు. 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్‌లో మూడుసార్లు ఆధిక్యంలోకి వెళ్లి దానిని వృథా చేసుకున్నాడు.
రెండో గేమ్‌లో మాత్రం ఆంటోన్సన్‌దే పైచేయిగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ఓడిపోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న లక్ష్య సేన్... విశ్వ క్రీడల తర్వాత ఆడిన నాలుగు టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్‌ను దాటి ముందుకెళ్లలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment