మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బుధవారం సంచలన ప్రదర్శనలు నమోదయ్యాయి. పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఏకై క ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాలనుకున్న స్పెయిన్ దిగ్గజం, రెండో సీడ్ రాఫెల్ నాదల్ కల చెదిరింది. మహిళల విభాగంలోనూ టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)కి చుక్కెదురైంది. వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్స్‌లోనే ఓడిపోయి ఇంటి దారి పట్టారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 13వ సారి క్వార్టర్స్ చేరిన నాదల్ గెలుపు అంచుల నుంచి ఓటమిని ఆహ్వానించాడు.
4 గంటల 5 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో రెండో సీడ్ నాదల్ 6–3, 6–2, 6–7 (4/7), 4–6, 5–7తో ఐదో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీక్) చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రెండు సెట్‌లను నెగ్గి, నిర్ణాయక మూడో సెట్ టైబ్రేక్‌లో అనవసర తప్పిదాలతో నాదల్ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ టైబ్రేక్ 3/3తో సమమైన దశలో 3 అనవసర తప్పిదాలు చేసిన నాదల్ 4/7తో సెట్‌ను సిట్సిపాస్‌కు కోల్పోయాడు. మరోవైపు అనూహ్యంగా పుంజుకున్న సిట్సిపాస్ జాగ్రత్తగా ఆడుతూ నాలుగో సెట్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 5–4తో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చాడు. అదే జోరులో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 6–4తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు.
హోరాహోరీగా సాగిన ఐదో సెట్‌లో ఓ దశలో ఇద్దరూ 5–5తో సమంగా నిలిచారు. అయితే పదకొండో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సిట్సిపాస్... పన్నెండో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 7–5తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. తద్వారా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నాదల్‌తో మ్యాచ్‌లో తొలి రెండు సెట్లలో వెనుకబడి తర్వాత విజయం సాధించిన రెండో ప్లేయర్‌గా 22 ఏళ్ల సిట్సిపాస్ ఘనత వహించాడు. 2015 యూఎస్ ఓపెన్‌లో ఫాబియో ఫాగ్‌నిని ఇదే తరహాలో నాదల్‌పై గెలుపొందాడు. ఈ మ్యాచ్‌లో సిట్సిపాస్ 18, నాదల్ 15 ఏస్‌లు సంధించారు. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో 2019 యూఎస్ ఓపెన్ రన్నరప్, నాలుగో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 7–5, 6–3, 6–2తో ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)పై గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగే సెమీస్‌లో సిట్సిపాస్‌తో మెద్వెదెవ్ తలపడతాడు.
బార్టీకి షాక్
మహిళల విభాగంలో సొంత మైదానంలో జరిగిన పోరులో టాప్ సీడ్, వరల్డ్ నంబర్‌వన్ యాష్లే బార్టీకి 25వ సీడ్ కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) షాకిచ్చింది. గంటా 7 నిమిషాల పాటు సాగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో బార్టీ 1–6, 6–3, 6–2తో ముచోవా చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో 3 ఏస్‌లు సంధించిన బార్టీ 3 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మరోవైపు 2 ఏస్‌లే సంధించిన ముచోవా... ప్రత్యర్థి సర్వీస్‌ను 4సార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను 3 సార్లు కోల్పోయింది. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా) 4–6, 6–2, 6–1తో జెస్సికా పెగులా (అమెరికా)పై నెగ్గి సెమీస్‌లో అడుగుపెట్టింది. నేడు జరిగే మహిళల తొలి సెమీస్‌లో సెరెనా (అమెరికా)తో నయోమి ఒసాకా (జపాన్), రెండో సెమీస్‌లో జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)తో కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment