మహారాణిపేట (విశాఖపట్నం): పెట్టుబడిదారులు, మాఫియాదారులే ప్రభుత్వాలకు మూలస్తంభాలుగా మారారని, అలాంటి వారి వ్యాపారాల కోసం పాలకులు ప్రజల భూములను లాక్కుంటున్నారని కేంద్ర ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఇ.ఎ.ఎస్.శర్మ విమర్శించారు. మాఫియాదారుల వ్యాపార లావాదేవీల కోసం పచ్చని పంటలు పండే రైతుల భూములను పణంగా పెడుతున్న పాలకుల తీరుపై ఆయన ధ్వజమెత్తారు. మానవహక్కుల వేదిక విశాఖ జిల్లా 5వ మహాసభల సందర్భంగా సిరిపురం బిల్డర్స్ అసోషియేషన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో శర్మ ప్రసంగించారు.
అమరావతిలో ప్రభుత్వం కడుతున్న రాజధాని కార్పొరేట్ రాజధానా.. ప్రజా రాజధానా పాలకులు చెప్పాలని ప్రశ్నించారు. రూ.లక్షల కోట్లతో వేల ఎకరాల్లో కడుతున్న రాజధానిలో సామాన్య ప్రజల జీవనానికి ఎంతవరకూ చోటుంటుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇద్దరూ ఎన్‌ఆర్‌ఐలేనని శర్మ వ్యంగ్యంగా అన్నారు. వీరిద్దరు డబ్బులు దండుకోవడానికి మాత్రమే విదేశాల్లో ఎన్‌ఆర్‌ఐలు, ఆ దేశ ప్రతినిధుల చుట్టూ చెక్కర్లు కొడుతున్నారన్నారు. అక్కడకు వెళ్లి స్మార్ట్‌సిటీ, వైఫై అంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా వారు చేస్తున్నారా అని ప్రశ్నించారు.
విదేశాలకు వెళ్లినపుడు పేదప్రజలకు ఇబ్బందులు కలిగించే పర్యావరణ విధ్వంసం, ఉపాధి వంటి సమస్యలు ప్రస్తావించిన దాఖలాలు ఎక్కడాలేవన్నారు. హుద్‌హుద్ తుపాను వెళ్లి తొమ్మిది నెలలు గడుస్తున్నా విశాఖనగరంలో ఇంతవర కు 15శాతం లబ్ధిదారులకు మాత్రమే రూ.5వేల చొప్పున నష్టపరిహారం ఇచ్చారని, మిగతా 85 శాతం మంది ఇంకా అధికారులు వచ్చి తమ పేర్లు నమోదు చేయించుకుంటారని ఎదురు చూస్తున్నారని తెలిపారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల ఉపాధ్యక్షుడు ఎ.చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. సమావేశంలో మానవహక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు ఎం.శరత్, పలువురు ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
పెట్టుబడిదారులపైనే పాలకుల ప్రేమ
Published Mon, Jul 13 2015 9:15 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM
Advertisement