stakeholders
-
సీఎంఎస్ ఇన్ఫోలో తగ్గిన వాటా
న్యూఢిల్లీ: నగదు నిర్వహణ, చెల్లింపుల కంపెనీ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్‌లో ప్రమోటర్ సంస్థ దాదాపు 14 శాతం వాటాను విక్రయించింది. ప్రమోటర్ కంపెనీ సియాన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ 13.7 శాతం వాటాకు సమానమైన 2.12 కోట్ల షేర్లను విక్రయించింది. ఎన్ఎస్ఈ బల్క్ డీల్ వివరాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి 300.23 సగటు ధరలో వాటాను దాదాపు రూ. 638 కోట్లకు అమ్మివేసింది. వేల్యూక్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్స్, ఎస్బీఐ ఎంఎఫ్, ఐఐఎఫ్ఎల్ ఎంఎఫ్, 306 వన్ ఎంఎఫ్, నార్జెస్ బ్యాంక్, అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సీఎంఎస్ షేర్లను కొనుగోలు చేశాయి. ఈ లావాదేవీల తదుపరి సీఎంఎస్ ఇన్ఫోలో సియాన్ ఇన్వెస్ట్మెంట్ వాటా 60.24 శాతం నుంచి 46.54 శాతానికి తగ్గింది. వాటా విక్రయ వార్తలతో సీఎంఎస్ ఇన్ఫో షేరు ఎన్ఎస్ఈలో 6 శాతం పతనమై రూ. 307 వద్ద ముగిసింది. -
వాటాదారులకే ప్రాధాన్యత ఇవ్వాలి
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ సొంత వాటాదారులకే ప్రాధాన్యత ఇవ్వాలని కార్పొరేట్ పాలన పరిశోధన, సలహాదారు సంస్థ ఎస్ఈఎస్ ఒక నివేదికలో పేర్కొంది. గ్రూప్‌పై ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ కంపెనీలలో వాటాదారుకాదని తెలియజేసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల తదుపరి గ్రూప్ మార్కెట్ క్యాప్(విలువ) భారీగా పతనమైన నేపథ్యంలో ఖాతాలపై థర్డ్‌పార్టీ ఆడిట్ ద్వారా వాటాదారుల ఆందోళనలకు చెక్ పెట్టవచ్చని సలహా ఇచ్చింది. గ్రూప్ రుణాలపై అవసరానికి మించి ఆందోళనలు తలెత్తినట్లు అభిప్రాయపడింది. స్వతంత్ర థర్డ్‌పార్టీ ఆడిట్ ద్వారా గ్రూప్ విశ్వాసాన్ని( క్రెడిబిలిటీ) తిరిగి పొందవచ్చని సూచించింది. యూఎస్ షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీలలో అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. దీంతో సుమారు 140 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైంది. అయితే మంగళవారం(28న) ట్రేడింగ్‌లో పలు కౌంటర్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. క్యాష్ ఫ్లోలు ఓకే అదానీ గ్రూప్‌లోని ప్రతీ కంపెనీ రుణ చెల్లింపులకు తగిన క్యాష్ ఫ్లోలు సాధించగలిగే స్థితిలో ఉన్నట్లు ఎస్ఈఎస్ అభిప్రాయపడింది. వెరసి గ్రూప్ రుణభారంపై అధిక స్థాయి ఆందోళనలు సరికాకపోవచ్చని పేర్కొంది. గ్రూప్‌లోని చాలా కంపెనీలు రుణ చెల్లింపులకు తగిన నగదు రాకను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. అదానీ ట్రాన్స్మిషన్ అధిక రుణ–ఈక్విటీ నిష్పత్తిని కలిగి ఉన్నట్లు పేర్కొంది. అయితే విద్యుత్ ప్రసారం బిజినెస్ ద్వారా ఫిక్స్డ్ రిటర్న్ సాధించగలమని కంపెనీ విశ్వసిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఆందోళన లు సరికాదని పేర్కొంది. ఇక అదానీ గ్రీన్ అధిక రు ణ భారాన్ని కలిగి ఉన్నప్పటికీ రుణ చెల్లింపుల్లో ఎ లాంటి సమస్యలనూ ఎదుర్కోలేదని వివరించింది. -
ఆక్వాకు ఉజ్వల భవిత
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆక్వా రంగం మరింత పురోభివృద్ధి సాధించేలా, రైతులకు మేలు కలిగేలా స్టేక్ హోల్డర్స్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ అధ్యక్షతన సోమవారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆక్వా రైతులు, రొయ్యల ఎగుమతిదారులు, ఫీడ్ ఉత్పత్తిదారులు, హేచరీల నిర్వాహకులు పాల్గొన్నారు. ఇప్పుడున్న ఫీడ్ ధర కిలో రూ.2.50 తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రొయ్య పిల్లను 36 పైసలకు విక్రయిస్తుండగా, ఆరు పైసలు తగ్గించి 30 పైసలు చేశారు. రైతులు నష్టపోకుండా నాణ్యమైన రొయ్య సీడ్ ఉత్పత్తికి అత్యంత ఆధునిక లేబొరేటరీలు నిర్వహించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ లేబొరేటరీల ద్వారా రొయ్య సీడ్లో యాంటీబయాటిక్స్ లేకుండా చూడాలని నిర్ణయించారు. ప్రతి నెలా 1, 11, 21 తేదీల్లో ధరలపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. రొయ్యల చెరువుల వద్ద పట్టుబడి జరిగిన తరువాత సాధ్యమైనంత త్వరగా రొయ్యలను ఐస్‌లో వేసి తాజాదనం కోల్పోకుండా చూడాలని, ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఆక్వా రంగంలోని అన్ని వర్గాల వారితో వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయాలు అమలయ్యేటట్టు చూడాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. తక్కువ సాంద్రత కలిగి 25 నుంచి 60 మధ్య కౌంట్ సాధించేలా రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. మెరుగైన ఉత్పాదకత, నాణ్యత కోసం రైతులకు పూర్తి స్థాయిలో సేవలందించే బాధ్యతను మేత తయారీదారులు తీసుకోవాలని సూచించారు. పెట్టుబడి ధరలను సమీక్షించిన అనంతరమే ఫీడ్ ధర ఖరారు చేసేందుకు ఫీడ్ తయారీదారులు ఆమోదం తెలిపారు. విధిగా నెలకోసారి ఆక్వా రైతులు, రొయ్యల ఎగుమతిదారులు, ఫీడ్ ఉత్పత్తిదారులు, హేచరీల నిర్వాహకులు అనుకూలమైన ప్రాంతంలో సమావేశమై, సమస్యల సత్వర పరిష్కారానికి చొరవ తీసుకోవాలని నిర్ణయించారు. ఆక్వా సాగు, రవాణా, కొత్త ట్రెండ్లు, నోటిఫికేషన్లు, ముందస్తు హెచ్చరికలు, దేశీయ మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులు, ఫీడ్ తయారీదారులు, ప్రాసెసింగ్, ఎగుమతిదారులు సమన్వయంతో ముందుకు సాగాలని తీర్మానించారు. ల్యాబ్‌లు ఏర్పాటు, నిర్వహణ విషయంలో హేచరీ యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: మా ‘విడాకులు’ తెగుతున్నాయి) -
రూపాయిపై బ్యాంకర్లతో నేడు ఆర్థిక శాఖ భేటీ
న్యూఢిల్లీ: డాలరు స్థానంలో రూపాయి మారకంలో సీమాంతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు తీసుకోతగిన చర్యలపై చర్చించేందుకు సంబంధిత వర్గాలతో కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం (నేడు) సమావేశం కానుంది. విదేశీ వ్యవహారాల శాఖ, వాణిజ్య శాఖ, ఆర్బీఐ, బ్యాంకింగ్ వర్గాలు ఇందులో పాల్గోనున్నాయి. ఈ సమావేశానికి ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా సారథ్యం వహిస్తారు. ఎగుమతిదారులు వీలైనంత వరకూ రూపాయి మారకంలో వాణిజ్యం జరిపేలా చూడటంపై దృష్టి పెట్టాలంటూ బ్యాంకులకు ఈ భేటీలో సూచించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల దృష్ట్యా ప్రస్తుతం రష్యాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యంలో సింహభాగం రూపాయి మారకంలోనే సెటిల్ అవుతోంది. -
2051 లక్ష్యంగా వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక
సాక్షి, విశాఖపట్నం: 2051 లక్ష్యంగా దృక్పథ ప్రణాళిక సిద్ధం చేయడానికి విశాఖపట్నం మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) కసరత్తు ప్రారంభించింది. గురువారం నిర్వహించిన వీఎంఆర్డీఏ స్టేక్ హోల్డర్స్ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ,అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రమణమూర్తి రాజు,నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, జీవీఎంసీ కమిషనర్ సృజన, విశాఖ నార్త్ కన్వీనర్ కె రాజు పాల్గొన్నారు. వీఎంఆర్డీఏ పరిధిలో సూక్ష్మస్థాయి నుంచి పరిశీలన చేసి అభివృద్ధి చేయడంతో పాటు పాలసీ ఫ్రేమ్ వర్క్‌పై దృష్టి పెట్టానున్నారు. దృక్ఫథ ప్రణాళిక రెండేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. మూడు రీజియన్ల ఫీడ్‌బ్యాక్‌తో ఆర్థిక వృద్ధికి పెద్దపీట,రాష్ట్ర విధానాలకు అనుగుణమైన నిర్మాణాత్మక ప్రణాళిక, సీఆర్‌జెడ్ రెగ్యులేషన్స్ పరిధిలో రెజీలియంట్ టెక్నాలజీలపై సమావేశంలో చర్చించారు. భావనపాడు,నక్కపల్లి, భీమిలిపట్నంలో వచ్చే గ్రీన్‌ఫీల్డ్ పోర్టులపై సమావేశంలో ప్రస్తావన కొచ్చాయి. అధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి నిర్మాణాత్మకమైన సలహాలను, సూచనలను వీఎంఆర్డీఏ స్వీకరించింది. -
శబరిమల తీర్పు : ఆలయ కమిటీ భేటీ
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పు అనంతర పరిస్థితులు, వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న శబరిమల యాత్ర సీజన్ తదితర అంశాలపై చర్చించేందుకు ఆలయ నిర్వహణను పర్యవేక్షించే ట్రావన్‌కోర్ దేవస్ధానం బోర్డు (టీడీబీ) సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఆయా అంశాలపై వివిధ వర్గాలతో చర్చలు జరిపేందుకు ఆలయ కమిటీ పండలం రాయల్ ఫ్యామిలీతో పాటు శబరిమల ఆలయ పూజారులు, పూజారుల సంఘ ప్రతినిధులు, హిందూ సంస్థల ప్రతినిధులను మంగళవారం జరిగే సమావేశానికి ఆహ్వానించింది. త్రివేండ్రంలోని దేవస్ధానం బోర్డు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుందని టీడీబీ అధ్యక్షుడు ఏ పద్మకుమార్ పేర్కొన్నారు. అన్ని వయసుల స్ర్తీలను ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వుల అమలును వ్యతిరేకిస్తూ పలు హిందూ సంఘాలు, అయ్యప్ప భక్తుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించేందుకు ఈ సమావేశంలో అన్ని వర్గాలకు చెందిన ప్రతినిధులను బోర్డు ఆహ్వానించింది. మరోవైపు సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయకుండా తీర్పును అమలు చేయాలని సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గతవారం పండలంలో బీజేపీ చేపట్టిన లాంగ్‌మార్చ్ ఆదివారం తిరువనంతపురం చేరుకుంది. సర్వోన్నత న్యాయస్ధాన ఉత్తర్వులను లెఫ్ట్ ప్రభుత్వం అమలుచేస్తే ఈనెల 18న కేరళలో హర్తాళ్ చేపట్టాలని అంతరాష్ర్టీయ హిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా పిలుపు ఇచ్చారు. -
పెట్టుబడిదారులపైనే పాలకుల ప్రేమ
మహారాణిపేట (విశాఖపట్నం): పెట్టుబడిదారులు, మాఫియాదారులే ప్రభుత్వాలకు మూలస్తంభాలుగా మారారని, అలాంటి వారి వ్యాపారాల కోసం పాలకులు ప్రజల భూములను లాక్కుంటున్నారని కేంద్ర ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఇ.ఎ.ఎస్.శర్మ విమర్శించారు. మాఫియాదారుల వ్యాపార లావాదేవీల కోసం పచ్చని పంటలు పండే రైతుల భూములను పణంగా పెడుతున్న పాలకుల తీరుపై ఆయన ధ్వజమెత్తారు. మానవహక్కుల వేదిక విశాఖ జిల్లా 5వ మహాసభల సందర్భంగా సిరిపురం బిల్డర్స్ అసోషియేషన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో శర్మ ప్రసంగించారు. అమరావతిలో ప్రభుత్వం కడుతున్న రాజధాని కార్పొరేట్ రాజధానా.. ప్రజా రాజధానా పాలకులు చెప్పాలని ప్రశ్నించారు. రూ.లక్షల కోట్లతో వేల ఎకరాల్లో కడుతున్న రాజధానిలో సామాన్య ప్రజల జీవనానికి ఎంతవరకూ చోటుంటుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇద్దరూ ఎన్ఆర్ఐలేనని శర్మ వ్యంగ్యంగా అన్నారు. వీరిద్దరు డబ్బులు దండుకోవడానికి మాత్రమే విదేశాల్లో ఎన్ఆర్ఐలు, ఆ దేశ ప్రతినిధుల చుట్టూ చెక్కర్లు కొడుతున్నారన్నారు. అక్కడకు వెళ్లి స్మార్ట్‌సిటీ, వైఫై అంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా వారు చేస్తున్నారా అని ప్రశ్నించారు. విదేశాలకు వెళ్లినపుడు పేదప్రజలకు ఇబ్బందులు కలిగించే పర్యావరణ విధ్వంసం, ఉపాధి వంటి సమస్యలు ప్రస్తావించిన దాఖలాలు ఎక్కడాలేవన్నారు. హుద్‌హుద్ తుపాను వెళ్లి తొమ్మిది నెలలు గడుస్తున్నా విశాఖనగరంలో ఇంతవర కు 15శాతం లబ్ధిదారులకు మాత్రమే రూ.5వేల చొప్పున నష్టపరిహారం ఇచ్చారని, మిగతా 85 శాతం మంది ఇంకా అధికారులు వచ్చి తమ పేర్లు నమోదు చేయించుకుంటారని ఎదురు చూస్తున్నారని తెలిపారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల ఉపాధ్యక్షుడు ఎ.చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. సమావేశంలో మానవహక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు ఎం.శరత్, పలువురు ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.