తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పు అనంతర పరిస్థితులు, వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న శబరిమల యాత్ర సీజన్ తదితర అంశాలపై చర్చించేందుకు ఆలయ నిర్వహణను పర్యవేక్షించే ట్రావన్‌కోర్ దేవస్ధానం బోర్డు (టీడీబీ) సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఆయా అంశాలపై వివిధ వర్గాలతో చర్చలు జరిపేందుకు ఆలయ కమిటీ పండలం రాయల్ ఫ్యామిలీతో పాటు శబరిమల ఆలయ పూజారులు, పూజారుల సంఘ ప్రతినిధులు, హిందూ సంస్థల ప్రతినిధులను మంగళవారం జరిగే సమావేశానికి ఆహ్వానించింది.
త్రివేండ్రంలోని దేవస్ధానం బోర్డు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుందని టీడీబీ అధ్యక్షుడు ఏ పద్మకుమార్ పేర్కొన్నారు. అన్ని వయసుల స్ర్తీలను ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వుల అమలును వ్యతిరేకిస్తూ పలు హిందూ సంఘాలు, అయ్యప్ప భక్తుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించేందుకు ఈ సమావేశంలో అన్ని వర్గాలకు చెందిన ప్రతినిధులను బోర్డు ఆహ్వానించింది.
మరోవైపు సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయకుండా తీర్పును అమలు చేయాలని సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గతవారం పండలంలో బీజేపీ చేపట్టిన లాంగ్‌మార్చ్ ఆదివారం తిరువనంతపురం చేరుకుంది. సర్వోన్నత న్యాయస్ధాన ఉత్తర్వులను లెఫ్ట్ ప్రభుత్వం అమలుచేస్తే ఈనెల 18న కేరళలో హర్తాళ్ చేపట్టాలని అంతరాష్ర్టీయ హిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా పిలుపు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment