
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీఎం చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు గర్హనీయమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఈసీకి లేఖ రాశారు. చంద్రబాబు.. ఎల్వీని సహ నిందితుడిగా, కోవర్టుగా పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల సంఘం పునేఠాను తప్పించి ఎల్వీని సీఎస్‌గా నియమించిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఈసీపై చేసినట్టుగానే భావించాలన్నారు.
సీఎం వ్యాఖ్యలతో ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు ఐఏఎస్‌ల ప్రతిష్టకు భంగం కలిగిందని లేఖలో పేర్కొన్నారు.రాజ్యాంగంలోని ఆర్టికల్– 324 ప్రకారం ఈసీకి సంక్రమించిన అధికా రాలను అవహేళన చేసిన ట్టేనన్నారు. ఎన్నికల సంఘం అధికారాలను అంగీకరించనట్టయితే భవిç ష్యత్తులో చట్టబద్ధంగా ఈసీ తీసుకునే నిర్ణయాలను రాజకీయ నేతలు, పార్టీలు ఇష్టపడరని వివరించారు. ఎన్నికల వేళ ఈసీ నిర్ణయాలు, ఆదేశాలను పదేపదే వ్యతిరేకించే అవకాశమూ ఉంటుందన్నారు. ఈసీ ఆదేశాలను పాటించిన ప్రభుత్వోద్యోగులు చంద్రబా బులాంటి వారి చేతుల్లో బాధితులయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఈసీ తక్షణమే బాబుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని శర్మ తన లేఖలో కోరారు.