సాక్షి, విశాఖ : రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన సూచనలు ఆహ్వానించదగినవని రిటైర్డ్ ఐఏఎస్ ఈఎఎస్ శర్మ అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. జీఎన్ రావు కమిటీ నివేదిక అమలు అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి సమాన అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అసమానతలు తొలగాలంటే రాజధాని పేరుతో ఒక్కచోటే అభివృద్ధి చేయకూడదని శర్మ అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర, దక్షిణ, మధ్య కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి కమిటీ సూచనలు బాగున్నాయని ప్రశంసించారు. ఈ కమిటీ సూచనలు అమలైతే పాలన చేరువ అవుతుందనే భావన ప్రజల్లోకి వస్తుందన్నారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉండటం మంచిదే అని అన్నారు.
‘గత ప్రభుత్వం అమరావతిలోనే అభివృద్ధి చేయాలని చూసి తప్పు చేసింది. అయితే జీఎన్ రావు కమిటీ నివేదికపై ప్రజల్లో చర్చ జరగాలి. గ్రామస్థాయి వరకూ పరిపాలన చేరువ అయితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. విశాఖలో తక్కువ ఖర్చుతోనే రాజధానిని అభివృద్ధి చేయాలి. గత ప్రభుత్వంలో అమరావతి పేరుతో భారీగా అవకతవకలు జరిగాయి. అందుకే మేము మొదటి నుంచి వ్యతిరేకించాం. అలాగే విశాఖలో నీటి సమస్యను అధిగమించాలి’ అని శర్మ పేర్కొన్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment