
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణకు మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి శాసన నిర్వాహక, విశాఖ కార్యనిర్వాహక, కర్నూలు న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరు స్వాగతించాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ లేఖను విడుదల చేశారు.
ఏపీలో వివిధ ప్రాంతాల అభివృద్ధికై నిపుణుల కమిటీ సిఫార్సులు సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయన్న చిరంజీవి.. గతంలో అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే ఆర్థిక, సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మూడు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో లక్షకోట్ల అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏంటన్న ఆందోళన అందరిలోనూ ఉందన్నారు.
సాగు, తాగు నీరు, ఉపాధి అవకాశాలు లేక ఊర్లు విడిచిపోతున్న వలస కూలీల బిడ్డల భవిష్యత్‌కు, నిరుద్యోగులకు మూడు రాజధానుల ప్రతిపాదన భద్రతనిస్తుందన్నారు. అయితే ఇదే సమయంలో రాజధాని రైతులలో నెలకొన్న భయాందోళనలు, అభద్రతా భావాన్ని తొలగించాలని చిరంజీవి కోరారు. అమరావతి ప్రాంత రైతులు నష్టపోకుండా, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అపోహలు, అపార్థాలు తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలన్నారు. ప్రజల ఆకాంక్షలు, సవాళ్లపై నిపుణుల కమిటీ విస్తృతంగా పరిశీలన చేసినట్లు భావిస్తున్నామని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి రాజధాని సహా అన‍్ని రంగాల్లో అభివృద్ధి కోసం నిపుణుల కమిటీ సూచించిన వ్యూహాన్ని సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తారని, రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందని చిరంజీవి ఆకాంక్షించారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment