ఆంధ్రాలో రష్యా అణు ప్లాంట్! | rashya nuclear power plant in andhrapradesh | Sakshi
Sakshi News home page

ఆంధ్రాలో రష్యా అణు ప్లాంట్!

Published Tue, Dec 22 2015 7:29 AM | Last Updated on Sun, Sep 3 2017 2:24 PM

కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం (ఫైల్)

కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం (ఫైల్)

 ► కూడంకుళం 5, 6 యూనిట్లకు ఏపీలో భూమి
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/హైదరాబాద్:
శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం వ్యవహారంలో మళ్లీ కదలిక మొదలైంది. రష్యా సహకారంతో నిర్మిస్తున్న కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్‌లో ఐదు, ఆరు యూనిట్ల స్థాపన కోసం ఏపీలో భూమి కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేయనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ చేపట్టనున్న రష్యా పర్యటనలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది. అణు ఇంధన సహకారంపై రష్యా, భారత్ మధ్య ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. దేశంలో మరికొన్ని అణు విద్యుత్ ప్రాజెక్టుల ప్రతిపాదనపై కేంద్రం ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇదిలావుంటే.. అమెరికాకు చెందిన అణు విక్రేత జీఈ-హిటాచి న్యూక్లియర్ ఎనర్జీ సాయంతో ఒక ప్రాజెక్టును నెలకొల్పేందుకు కేంద్రం ఇప్పటికే కొవ్వాడ స్థలాన్ని ఎంపిక చేసింది.  
 
 కార్పొరేట్ సంస్థల లబ్ధికే: కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రంపై స్థానికుల నుంచి వ్యతిరేక వ్యక్తమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కచేయడం లేదు. ఇటీవల జపాన్ ప్రధాని భారత పర్యటన సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాల నేపథ్యంలో గుజరాత్, కొవ్వాడ, మహారాష్ట్ర ప్రాంతాల్లో మూడు అణు విద్యుత్ కేంద్రాలు నెలకొల్పేందుకు ఆర్థిక సాయం చేస్తామని ఆ దేశం హామీ ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమైంది. ప.బెంగాల్‌లో అణువిద్యుత్ ప్లాంట్ నెలకొల్పేందుకు అక్కడి ప్రభుత్వం నిరాకరించడంతో సీఎం చంద్రబాబు ఏపీలో ఎలాగైనా రెండు ప్లాంట్లు ప్రారంభించి కార్పొరేట్ సంస్థలకు లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
 
 అప్పుడలా... ఇప్పుడిలా...
 2010లో చంద్రబాబు కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. తాము అధికారంలోకి వస్తే ఈ ప్రతిపాదనను రద్దు చేస్తామని ప్రకటించారు. అయితే, అధికారంలోకి వచ్చాక మాట మార్చారు.  
 
 రేపటి నుంచి మోదీ రష్యా పర్యటన
 రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాస్కోలో వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాని మోదీ 23, 24 తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. పౌర అణు విద్యుత్ రంగంలో భారత్‌కు రష్యా కీలకమైన భాగస్వామిగా ఉంది. మోదీ, పుతిన్‌ల మధ్య జరిగిన గత శిఖరాగ్ర భేటీలో.. 2035 నాటికి భారత్‌లో కనీసం 12 అణు రియాక్టర్లను రష్యా నెలకొల్పాలని నిర్ణయించారు.
 
 ప్రజలకు ముప్పు తప్పదు
 ‘‘అణు విద్యుత్ ప్లాంట్ల వల్ల ప్రజలకు ముప్పు తప్పదు. వీటిలో విద్యుత్ ఉత్పత్తికి అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. లాభార్జన కోసమే విదేశీ సంస్థలు భారత్‌లో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి.’’  
                                                                              -ఈఏఎస్ శర్మ, మాజీ ఐఏఎస్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement