Kudankulam
-
ఆంధ్రాలో రష్యా అణు ప్లాంట్!
► కూడంకుళం 5, 6 యూనిట్లకు ఏపీలో భూమి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం వ్యవహారంలో మళ్లీ కదలిక మొదలైంది. రష్యా సహకారంతో నిర్మిస్తున్న కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్‌లో ఐదు, ఆరు యూనిట్ల స్థాపన కోసం ఏపీలో భూమి కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేయనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ చేపట్టనున్న రష్యా పర్యటనలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది. అణు ఇంధన సహకారంపై రష్యా, భారత్ మధ్య ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. దేశంలో మరికొన్ని అణు విద్యుత్ ప్రాజెక్టుల ప్రతిపాదనపై కేంద్రం ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇదిలావుంటే.. అమెరికాకు చెందిన అణు విక్రేత జీఈ-హిటాచి న్యూక్లియర్ ఎనర్జీ సాయంతో ఒక ప్రాజెక్టును నెలకొల్పేందుకు కేంద్రం ఇప్పటికే కొవ్వాడ స్థలాన్ని ఎంపిక చేసింది. కార్పొరేట్ సంస్థల లబ్ధికే: కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రంపై స్థానికుల నుంచి వ్యతిరేక వ్యక్తమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కచేయడం లేదు. ఇటీవల జపాన్ ప్రధాని భారత పర్యటన సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాల నేపథ్యంలో గుజరాత్, కొవ్వాడ, మహారాష్ట్ర ప్రాంతాల్లో మూడు అణు విద్యుత్ కేంద్రాలు నెలకొల్పేందుకు ఆర్థిక సాయం చేస్తామని ఆ దేశం హామీ ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమైంది. ప.బెంగాల్లో అణువిద్యుత్ ప్లాంట్ నెలకొల్పేందుకు అక్కడి ప్రభుత్వం నిరాకరించడంతో సీఎం చంద్రబాబు ఏపీలో ఎలాగైనా రెండు ప్లాంట్లు ప్రారంభించి కార్పొరేట్ సంస్థలకు లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అప్పుడలా... ఇప్పుడిలా... 2010లో చంద్రబాబు కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. తాము అధికారంలోకి వస్తే ఈ ప్రతిపాదనను రద్దు చేస్తామని ప్రకటించారు. అయితే, అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. రేపటి నుంచి మోదీ రష్యా పర్యటన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాస్కోలో వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాని మోదీ 23, 24 తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. పౌర అణు విద్యుత్ రంగంలో భారత్‌కు రష్యా కీలకమైన భాగస్వామిగా ఉంది. మోదీ, పుతిన్‌ల మధ్య జరిగిన గత శిఖరాగ్ర భేటీలో.. 2035 నాటికి భారత్‌లో కనీసం 12 అణు రియాక్టర్లను రష్యా నెలకొల్పాలని నిర్ణయించారు. ప్రజలకు ముప్పు తప్పదు ‘‘అణు విద్యుత్ ప్లాంట్ల వల్ల ప్రజలకు ముప్పు తప్పదు. వీటిలో విద్యుత్ ఉత్పత్తికి అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. లాభార్జన కోసమే విదేశీ సంస్థలు భారత్‌లో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి.’’ -ఈఏఎస్ శర్మ, మాజీ ఐఏఎస్ -
మీరు రండి.. మా కూడంకుళం చూడండి
భారతదేశానికి రష్యాతో ఉన్న సంబంధం ఈనాటిది కాదు. ఎప్పటినుంచో ఈ రెండు దేశాల మధ్య మైత్రీ సంబంధాలు పటిష్ఠంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. అణు, రక్షణ, ఇంధన రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయాలనుకుంటున్నట్లు ఆయనకు తెలిపారు. ఒకసారి వచ్చి కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు చూడాల్సిందిగా పిలిచారు. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో దాదాపు 40 నిమిషాల పాటు ఈ దేశాధినేతలిద్దరూ చర్చించుకున్నారు. ముందుగా సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన విజయానికి మోడీని పుతిన్ అభినందించారు. 2001లో కూడా ఒకసారి మోడీ-పుతిన్‌ల భేటీ మాస్కోలో జరిగింది. భారతదేశంలో చిన్న పిల్లాడినైనా సరే మన దేశానికి మంచి మిత్రుడు ఎవరని అడిగితే రష్యా అని చెబుతాడని ఈ సందర్భంగా మోడీ అన్నారు. -
అదనపు విద్యుత్
- త్వరలో రెండో యూనిట్ ఉత్పత్తి - కల్పాకంలో రెండు అణు యూనిట్లు సాక్షి, చెన్నై: రాష్ట్రానికి కూడంకుళం నుంచి అదనపు విద్యుత్ అందనుంది. త్వరలో అక్కడి రెండో యూనిట్ ఉత్పత్తి ప్రక్రియ ఆరంభం కానుంది. కల్పాకంలో రెండు అణు విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల పనులకు శ్రీకారం చుట్టినట్లు అణు విద్యుత్ బోర్డు సభ్యుడు శేఖర్ బాసు వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి ఆశాజనకంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల్లో జల విద్యుత్ నిరాశ పరిచినా, పవన, థర్మల్, అణు విద్యుత్ ఉత్పత్తి వేగం పెరుగుతోంది. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం నుంచి సుమారు 550 మెగావాట్ల వరకు తమిళనాడుకు అందిస్తున్నారు. దీంతో విద్యుత్ సంక్షోభం గండం నుంచి గట్టెక్కిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కు ఆశాజనకంగానే విద్యుత్ సరఫరా చేస్తోంది. అదే సమయంలో మరి కొన్ని కొత్త ప్రాజెక్టులు చేతికి అంది వచ్చిన పక్షంలో ఉత్పత్తి మరింత మెరుగు పడటం ఖాయం. ఈ పరిస్థితుల్లో కేం ద్ర ప్రభుత్వ పరిధిలోని అణు విద్యుత్ ప్రాజెక్టు ల ద్వారా రాష్ట్రానికి వాటాగా విద్యుత్ సరఫరా పెరగనుంది. అటు కూడంకుళం, ఇటు కల్పాకంల నుంచి ఈ విద్యుత్ తమిళనాడుకు అందబోతున్న దృష్ట్యా, సీఎం జయలలిత ఆశిస్తున్న నిరంతర విద్యుత్ సరఫరా నినాదానికి బలాన్ని చేకూర్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. కూడంకుళంలో తొలి యూనిట్ ద్వారా ఇప్పటికే నిర్ణీత వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి అవుతోంది. ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతున్న తొలి యూనిట్ నుంచి రాష్ట్రానికి వాటాగా మరింత విద్యుత్ అందనుంది. శుక్రవారం ఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చిన అణు విద్యుత్ బోర్డు కమిషన్ సభ్యుడు శేఖర్ బాసు మీనంబాక్కం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. కూడంకుళం తొలి యూనిట్ ఉత్పత్తి నిర్విరామంగా సాగుతోందని వివరించారు. రోజుకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుతోందన్నారు. ఇక రెండో యూనిట్ పనులు ముగింపు దశకు చేరాయన్నారు. గత ఏడాది చివర్లో అన్ని పనులు ముగించాల్సి ఉన్నా, చిన్న చిన్న సాంకేతిక సమస్యలతో జాప్యం తప్పలేదన్నారు. ప్రస్తుతం అన్ని సమస్యల్ని అధిగమించామని, ఈ ఏడాది ఆఖర్లో రెండో యూనిట్ ద్వారా ఉత్పత్తికి శ్రీకారం చుట్టడం తథ్యమన్నారు. కల్పాకం:కల్పాకంలో ఉన్న అణువిద్యుత్ యూ నిట్ల ద్వారా ఉత్పత్తి ఆశాజనకంగా ఉందని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడి విద్యుత్ వాటాను తమిళనాడుకు అందిస్తున్నట్లు చెప్పా రు. ప్రస్తుతం ఇక్కడ అదనంగా రెండు యూ నిట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు తగ్గ పనులు ఆరంభం అయ్యాయని, త్వరలో ఆ రెండు యూనిట్ల ద్వారా ఉత్పత్తి ప్రక్రియకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందన్నారు. తమిళనాడుకు కూడకుళం, కల్పాకంల రూపంలో అదనపు విద్యుత్ అందనుందని చెప్పారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను కేంద్ర గ్రిడ్‌కు పంపి, అక్కడి నుంచి వాటాల విభజనతో విద్యుత్ అందుతుందని స్పష్టం చేశారు. -
మెగా అణువిద్యుత్ ప్లాంట్: రికార్డుస్థాయి ఉత్పత్తి
చెన్నై: తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం(కేఎన్‌పీపీ) పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేసి రికార్డు సష్టించింది. రష్యన్ ఫెడరేషన్ సాంకేతిక సహకారంతో దీనిని నిర్మించారు. దేశంలో 21వ అణువిద్యుత్ కేంద్రం అయిన ఈ కేఎన్‌పీపీలోని 1వ యూనిట్లో శనివారం వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. దేశంలో ఒక అణువిద్యుత్ కేంద్రం వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి అని ప్లాంటు డెరైక్టర్ ఆర్ఎస్ సుందర్ వెల్లడించారు. కేఎన్‌పీపీ 1వ యూనిట్ శనివారం మధ్యాహ్నం 1.20 గంటల నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో పనిచేయడం ప్రారంభించిందని ఆయన తెలిపారు. అణు శక్తి నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం కొన్ని పరీక్షలు చేయాల్సి ఉన్నందున, దీనిని కొంత కాలవ్యవధి వరకూ పనిచేయించి తర్వాత ఆపివేస్తామని చెప్పారు. దేశంలోని ఇతర అణువిద్యుత్ కేంద్రాలు ఇంత వరకూ 540 మెగావాట్లు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు 680 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో మాత్రమే పనిచేశాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విద్యుత్ కేంద్రాల సామర్థ్యం కూడా 700 మెగావాట్లేనని సుందర్ తెలిపారు. -
‘కూడంకుళం’ 3, 4 యూనిట్లకు పచ్చజెండా
న్యూఢిల్లీ: కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు మూడు, నాలుగో యూనిట్ల నిర్మాణంపై కొన్నేళ్లుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించుతూ భారత్, రష్యా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అణు ప్రమాదం సంభవించినప్పుడు పౌర నష్టపరిహారం పొందడంపై కేంద్రం 2010లో రూపొందించిన పౌర పరిహార అణు ప్రమాద చట్టంలోని నిబంధనపై రష్యా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ ఒప్పందం కార్యరూపం దాల్చలేదు. ప్రధాని మన్మోహన్ గత ఏడాది రష్యా పర్యటనలో ఈ అంశంపై జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. తాజాగా అణు ఇంధన విభాగం కార్యదర్శి ఆర్.కె. సింగ్ గత నెల రష్యా అధికారులతో ఇక్కడ జరిపిన చర్చల్లో ఈ వ్యవహారం కొలిక్కి వచ్చింది. రూ. 33 వేల కోట్లతో ఈ యూనిట్లను నిర్మించేందుకు రష్యాతో భారత అణు విద్యుత్ కార్పొరేషన్ లిమిటెడ్ గురువారం ఒప్పందం చేసుకున్నట్లు అధికార వర్గాలు శుక్రవారం ఢిల్లీలో పేర్కొన్నాయి. -
కూడంకుళం సమీపంలో నాటుబాంబులు పేలి ఐదుగురు మృతి
చెన్నై: నగరంలో కూడంకుళం వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న కమిటీ నివాసాల్లో మంగళవారం భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. మృతుల్లో మహిళ, ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడులోని కూడంకుళం సమీపంలోని ఇదింతకారి గ్రామంలో నాటుబాంబులు పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన న్యూక్లియర్ పవర్ ప్లాంటుకు సమీప గ్రామంలో సంభవించింది. అయితే కూడంకుళం నివాసాల్లో నాటుబాంబులు పేలడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, క్షతగాత్రుల పరిస్థితి విషమించడంతో చికిత్స మేరకు సమీప ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
ఉభయ భ్రష్టత్వం
మసకబారిన యూపీఏ ప్రభుత్వపు పరువు ప్రతిష్టల నీలి నీడలు మన విదేశాంగ విధానంపైన కూడా కమ్ముకుంటున్నాయి. గత నెలలో అమెరికాలో పర్యటించిన ప్రధాని మన్మోహన్సింగ్ ప్రస్తుతం రష్యా పర్యటన ముగించి, చైనాలో పర్యటిస్తున్నారు. వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో ప్రధాన శక్తులుగా ఉన్న మూడు దేశాలలోనూ వరుసగా ఆయన చేపట్టిన ఈ పర్యటనల లక్ష్యాలు ఘనమైనవే అయినా లాంఛనప్రాయమైననిగానే ముగిసిపోతున్నాయి. పదవీ విరమణ చేస్తున్న భారత ప్రధానికి ఘనమైన వీడ్కోలు సత్కారంలాగా మన్మోహన్ అమెరికా పర్యటన ముగిసింది. నేటి రష్యా, చైనా పర్యటనలు కూడా అలాగే సాగుతున్నాయి. మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మిత్రులన్నవారే లేక ఒంటరిగా మిగిలినప్పుడు రష్యా నమ్మకమైన మిత్రునిగా నిలిచిందంటూ మన్మోహన్... ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాల గత వైభవాన్ని నెమరు వేయడానికి మించి సత్సంబంధాల పురుద్ధరణ దిశగా సాధించింది ఏమీ లేదు. గతి తప్పిన సంబంధాలకు కొండ గుర్తులా ‘కూడంకుళం ప్రతిష్టంభన’ నిలిచే ఉంది. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉండగా 1988లో నాటి సోవియట్ యూనియన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ఫలితం. ఆ విద్యుత్ కేంద్రపు ఒకటి, రెండు రియాక్టర్ల నిర్మాణం 2002లో మొదలైంది. మొదటి రియాక్టర్ మంగళవారం నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది. మరో రెండు రియాక్టర్లను కూడా రష్యా నిర్మించాల్సి ఉంది. కానీ అది కొత్త ఒప్పందం కోసం పట్టుబడుతోంది. కూడంకుళం అణు కర్మాగారానికి ‘ఆపరేటర్’ అయిన జాతీయ అణు శక్తి కార్పొరేషనే (ఎన్పీసీఐఎల్) ప్రమాదం జరిగిన సందర్భాల్లో నష్టపరిహారాన్ని చెల్లించేలా ఒప్పందాన్ని సవరించాలని కోరుతోంది. రష్యా మడత పేచీలాగా కనిపిస్తున్న ఈ వివాదంలో దాని వాదన తార్కికంగా సమంజసమైనదే అవుతుంది. 2008లో యూపీఏ ప్రభుత్వాన్ని అగ్నిపరీక్షకు గురిచేసి మరీ మన్మోహన్ అమెరికాతో అణు సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అది అమల్లోకి రావడం కోసం 2010లో పార్లమెంటు అణు పరిహార చట్టాన్ని చేసింది. అమెరికా ఒత్తిడితో తయారైన ఆ తప్పుల తడక చట్టం పరిహార బాధ్యతను ‘ఆపరేటర్’పై ఉంచింది. మన అణు విద్యుత్ కేంద్రాలన్నిటికీ ఆపరేటర్ ఎన్పీసీఐఎల్. విదేశీ సర ఫరాదారులతో అది కుదుర్చుకునే ఒప్పందాలకు లోబడి ఆ కంపెనీల నుంచి గరిష్టంగా రూ.1,500 కోట్లకు మించకుండా పరిహారం వసూలు చేసే అవకాశాన్ని అది కల్పిస్తోంది. ఆ చట్టం ప్రాతిపదికపైనే రష్యా కొత్త ఒప్పందాన్ని కోరుతోంది. ‘జనరల్ ఎలక్ట్రిక్’, ‘వెస్టింగ్‌హౌస్’ వంటి అణు కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా అమెరికా పట్టుబట్టి ఈ పరిహార చట్టాన్ని చేయించింది. అయినా నేటి వరకు ఒక్క అమెరికా కంపెనీ కూడా మన దేశంలో విద్యుత్ కేంద్ర స్థాపనకు ముందుకు రాలేదు. పైగా 2010 నాటి రష్యా అణు ఒప్పందం ప్రకారం నిర్మాణం జరగాల్సి ఉన్న పదమూడు రియాక్టర్లతోపాటూ, ఇతర దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు సైతం మూలనబడ్డాయి. స్వదేశీ చట్టాలకు లోబడి పరిష్కరించాల్సిన ప్రమాద పరిహారం సమస్యను... విదేశీ కంపెనీలు తమపై ఏ బాధ్యతా లేకుండే ఒప్పందాల కోసం పట్టుబట్టే పరిస్థితికి అవకాశం కల్పించినది మన పరిహార చట్టమే. దాని ఫలితంగానే 2020 నాటికి 20,000 మెగావాట్లు, 2032 నాటికి 63,000 మెగావాట్ల అణు విద్యుదుత్పత్తి సామర్థ్యానికి మన్మో హన్ సర్కారు రచించిన ఆర్భాటపు పథకాలు పగటి కలలుగానే మిగిలిపోయాయి. ఒకప్పటి మన నమ్మకమైన మిత్ర దేశం రష్యా మన పరిహార చట్టం లొసుగులను ఆసరా చేసుకొని పేచీకి దిగే పరిస్థితికి చేరడం మన్మోహన్ విదేశాంగ విధాన వైఫల్యమే. మౌలిక మార్పులకు గురవుతున్న అంతర్జాతీయ బలాబలాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఆయన అమెరికా అండతో భారత్‌ను ప్రాంతీయ శక్తిగా, ప్రపంచ శక్తిగా మార్చగలనని విశ్వసించారు. అమెరికా నేతృత్వంలోని ఏక కేంద్రక ప్రపంచం విచ్ఛిన్నమవుతూ బహు కేంద్రక ప్రపంచం ఆవిర్భవిస్తున్న కాలంలో ఆయన మన విధానాన్ని అమెరికా అనుకూలమైనదిగా చేయడానికి యత్నించారు. కొత్త, పాత అధిపత్యవాద శక్తులకు సమదూరం పాటించే అలీన విధానాన్ని అనుసరించాల్సిన సమయంలో చేసిన ఈ చారిత్రక తప్పిదం అంత తేలికగా సరిదిద్దుకోలేనిది. అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా నిష్ర్కమించనున్న నేపథ్యంలో ప్రాంతీయంగా భారత్‌పై నమ్మకం ఉంచలేని రష్యా పాకిస్థాన్‌తో చెలిమి చేస్తోంది. మునుపెన్నటికన్నా బలహీనపడ్డ అమెరికా నేతృత్వంలోని ఆసియా-పసిఫిక్ కూటమిలో భారత్ భాగస్వామి అయ్యే అవకాశాలున్నట్టు చైనా భావిస్తోంది. దీంతో అది రష్యా, పాక్‌లతో కలిసి వ్యూహాత్మక కూటమిని నిర్మించే ప్రయత్నాల్లో ఉంది. అమెరికా మనకు ఎంత ‘నమ్మకమైన’ మిత్ర దేశంగా నిలవగలదో దానితో కుదుర్చుకున్న అణు ఒప్పందం అమలు తీరే చెబుతోంది. ఇక పాక్ సీమాంతర ఉగ్రవాదంపై అది అనుసరిస్తున్న అవకాశవాద వైఖరి గురించి చెప్పనవసరం లేదు. నిజానికి నేడు మనం ‘మిత్రులన్నవారే లేక ఒంటరిగా మిగిలిన’ స్థితికి చేరువవుతున్నాం. ఆ బలహీనతను బాగా ఎరిగిన చైనా ప్రధాని లీ కియాంగ్ సరిహద్దు వివాదం, జల వివాదాలు వంటి కీలక సమస్యలపై నామమాత్రపు చర్చలకు పరిమితమై తమకు ప్రాధాన్యాంశమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలకే పరిమితం కావాలన్న తమ దౌత్య వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. అందుకే ఇరు దేశాల ప్రధానులు బుధవారం కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం లాంఛనప్రాయమైన పునరుద్ఘాటనలకే పరిమితమైంది. రష్యాలాగే చైనా కూడా మన్మోహన్‌ను కొన్ని మాసాల ప్రధానిగానే పరిగణిస్తోంది. కొత్త ప్రభుత్వంతోనే అర్థవంతమైన చర్చలు సాధ్యమని భావిస్తోంది. ఆ వచ్చే ప్రభుత్వమైనా అన్ని ఆధిపత్య శక్తులకు సమదూరం పాటించే అలీన విధానానికి మరలుతుందని ఆశిద్ధాం. -
కూడంకుళంలో అణు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
కూడంకుళం అణు విద్యుత్తు ప్రాజెక్టు (కేఎన్‌పీపీ) మొదటి యూనిట్లో 75 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) మంగళవారం నాడు శ్రీకారం చుట్టింది. పవర్ గ్రిడ్‌తో మొదటి యూనిట్ అనుసంధానం మంగళవారం తెల్లవారుజామున 2.45 గంటలకు ప్రారంభమైందని, అప్పటినుంచి 75 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామని కేఎన్‌పీపీ సైట్ డైరెక్టర్ ఆర్ఎస్ సుందర్ తెలిపారు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో గల కూడంకుళంలో వెయ్యేసి మెగావాట్ల రెండు రష్యన్ రియాక్టర్లను ఎన్పీసీఐఎల్ ఏర్పాటు చేస్తోంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 17వేల కోట్లు. భారతదేశంలో మొట్టమొదటి ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ కేఎన్పీపీయే. ఇది లైట్ వాటర్ రియాక్టర్ విభాగంలోకి వస్తుంది. మొదటి యూనిట్ క్రిటికల్ దశను ఇప్పటికే దాటింది. కేఎన్‌పీపీ తన రియాక్టర్ పవర్ స్థాయిని 50 శాతానికి పెంచి, గ్రిడ్‌తో అనుసంధానం చేసేందుకు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (ఏఈఆర్బీ) గత ఆగస్టులో అనుమతి తెలిపింది. ఆగస్టు నెలాఖరు నాటికే 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో అనుసంధానం పూర్తవుతుందని భావించినా, కండెన్సర్ వాల్వులలో సమస్యలు ఎదురవడంతో కొంత ఆలస్యమైంది. క్రమంగా విద్యుత్తు ఉత్పత్తిని పెంచుతామని అధికారులు అంటున్నారు. -
కూడంకుళం అణు విద్యుత్ ఉత్పత్తి వాయిదా
కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. మొదటి విడత వెయ్యి మెగావాట్ల యూనిట్ ప్రారంభించాలని భారత అణు విద్యుత్ కార్పొరేషన్ (ఎన్పీసీఐఎల్) అంచనా వేస్తోంది. వచ్చే నెలలో సాకారం కావచ్చని భావిస్తోంది. గత జూన్‌లోనే యూనిట్‌ను ఆరంభించినా రెండు కండెన్సర్లలో సమస్యలు తలెత్తడంతో ఆగిపోయింది. యూనిట్ నిర్మాణం పనులు గత సెప్టెంబర్ నాటికి 99.76 శాతం పూర్తయ్యాయని ఎన్పీసీఐఎల్ అధికారులు తెలిపారు. నవంబర్‌కు ప్రక్రియ మొదలవుతుందని అంచనా వేసింది. తిరునెల్వేలి జిల్లాలోని కూడంకుళం వద్ద వెయ్యి మెగావాట్ల రష్యా రియాక్టర్లు రెండింటిని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 17000 కోట్ల రూపాయలు. -
500 మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తికి అనుమతి
సాక్షి, చెన్నై : కూడంకులంలో అధికారికంగా అణు విద్యుత్ ఉత్పత్తికి అణుశక్తి క్రమబద్ధీకరణ కమిషన్ అనుమతి ఇచ్చింది. తొలి విడతగా 500ల మెగావాట్ల ఉత్పత్తికి పచ్చ జెండా ఊపింది. దీంతో అణు రియాక్టర్లలో వేడిమి పెంచే పనిలో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా సింధు రక్ష క్ నినాదంతో ‘మమ్మల్ని రక్షించు దేవుడా’ అని అణు వ్యతి రేక ఉద్యమకారులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తిరునల్వేలి జిల్లా కూడంకులంలోని అణు విద్యుత్ కేంద్రంలో తొలి యూనిట్ పనులు ముగి యగా, రెండో యూనిట్ పనులు ముగింపు దశకు చేరాయి. ఈ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమకారులు ఉద్యమిస్తున్నా వాటిని లెక్కచేయకుండా విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా కేంద్రం, అణు విద్యుత్ బోర్డు వర్గాలు దూసుకెళుతున్నాయి. గత నెల 13 నుంచి తొలి యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి పనులు ప్రారంభమయ్యాయి. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఉత్పత్తి విజయవంతమైంది. దీంతో ఉత్పత్తి ప్రక్రియను అధికారికంగా వేగవంతం చేయడానికి అణుశక్తి క్రమబద్ధీకరణ కమిషన్ అనుమతి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆ కమిషన్ అధికారులు ఇటీవల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించి వెళ్లారు. అధికారిక అనుమతికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు వెలువరించలేదు. ఆ కమిషన్ ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని విద్యుత్ కేం ద్రం అధికారులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఉత్కం ఠతో ఎదురు చూశారు. ఈ పరిస్థితుల్లో బుధవారం అర్ధరాత్రి అధికారిక ఉత్పత్తికి పచ్చ జెండా ఊపుతూ ఆదేశాలు వెలువడ్డాయి. అణు కేంద్రం సురక్షితం అణు విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన ఆ కమిషన్ అధికారులు భద్రతా పరంగా కూడంకులం సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. ఆ కేంద్రంలో అధికారికంగా ఉత్పత్తి ప్రక్రియకు శ్రీకారం చుట్టవచ్చని ఆదేశించారు. తొలి విడతగా 500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయాలని సూచించారు. ఈ విషయంగా అణు విద్యుత్ కేంద్రం డెరైక్టర్ సుందర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ అణుశక్తి క్రమబద్ధీకరణ కమిషన్ అనుమతి కోసం ఇన్నాళ్లు వేచి చూశామన్నారు. కమిషన్ పచ్చ జెండా ఊపడంతో ఉత్పత్తి పనుల్ని వేగవంతం చేశామన్నారు. అణు రియాక్టర్లలో వేడిమి పెంచే పనుల్లో నిమగ్నమయ్యామన్నారు. ఆ వేడిమి 1200 కిలోవాట్స్ రాగానే ఉత్పత్తి పుంజుకుంటుందని వివరించారు. తొలి విడతగా 500 మెగావాట్లకు మాత్రమే అనుమతి లభించిందని, సెప్టెంబర్ మొదటి వారంలోపు ఈ మొత్తం ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ మొత్తాన్ని కేంద్రం వాటాకు పంపనున్నామన్నారు. పదిహేను రోజుల్లో 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగవచ్చని భావిస్తున్నామన్నారు. మరో మారు అణుశక్తి కమిషన్ పరిశీలనల అనంతరం అదనంగా 500 మెగావాట్లకు అనుమతి దక్కవచ్చన్నారు. అప్పుడు పూర్తి స్థాయిలో తొలి యూనిట్ ద్వారా 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు. సింధు రక్షక్: అధికారిక ఉత్పత్తి పనులు ఓ వైపు వేగవంతమయ్యాయి. మరో వైపు తమను రక్షించు దేవుడా అని అణు విద్యుత్ కేంద్రం వ్యతిరేక ఉద్యమకారులు ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు. గురువారం కూడంకులం పరిసర 18 గ్రామాల ప్రజలు సింధు రక్షక్ నినాదంతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిలు, రోడ్లలో మోకాళ్ల మీద కూర్చుని ఎక్కడిక్కడ ప్రార్థనల్లో లీనమయ్యారు. -
అణు విద్యుత్ కేంద్రం మూసేయూల్సిందే :వైగో
కూడంకులం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో మరోమారు గళమెత్తారు. అణు విద్యుత్ కేంద్రాన్ని మూసేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యుత్ వాటాలపై అధికారులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: అణు విద్యుత్ కేంద్ర వ్యతిరేక సంఘం ఆధ్వర్యంలో శనివారం చెన్నైలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసనకారులు ర్యాలీగా చెన్నై కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైగో మాట్లాడారు. అణువిద్యుత్ కేంద్రం నుంచి వెలువడే విషవాయువులతో పరిసర ప్రాంతాలు, వ్యర్థాలతో సముద్రపు నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. నీరు కలుషితమైతే దీనిపై ఆధారపడి బతికే జాలర్లు జీవనాధారం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంకతో భారత్ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడం వల్ల ఇప్పటికే తమిళ జాలర్లు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. తగిన భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే అణువిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించాలన్న సుప్రీంకోర్టు సూచనలు అమలు కావడం లేదని ఆరోపించారు. అలాగే ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్న సుప్రీం ఆదేశాలు అమలుకు నోచుకోలేదని తెలిపారు. ఇది పూర్తిగా కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని స్పష్టం చేశారు. దక్కేది 140 మెగావాట్లే అణువిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తయ్యే 2000 మెగావాట్లలో 900 మెగావాట్లు తమిళనాడుకు కేటాయిస్తామని అధికారులు అబద్ధాలు ఆడుతున్నారని వైగో తెలిపారు. వాస్తవానికి రాష్ట్రానికి దక్కేది 140 మెగావాట్లు మాత్రమేనని పేర్కొన్నారు. ఇన్ని రకాలుగా తమిళ ప్రజలను వంచిస్తూ సాగే అణువిద్యుత్ కేంద్రాన్ని అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ కేంద్రాన్ని మూసివేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. -
అణు విద్యుత్ కేంద్రం మూసేయూల్సిందే :వైగో
కూడంకులం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో మరోమారు గళమెత్తారు. అణు విద్యుత్ కేంద్రాన్ని మూసేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యుత్ వాటాలపై అధికారులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: అణు విద్యుత్ కేంద్ర వ్యతిరేక సంఘం ఆధ్వర్యంలో శనివారం చెన్నైలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసనకారులు ర్యాలీగా చెన్నై కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైగో మాట్లాడారు. అణువిద్యుత్ కేంద్రం నుంచి వెలువడే విషవాయువులతో పరిసర ప్రాంతాలు, వ్యర్థాలతో సముద్రపు నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. నీరు కలుషితమైతే దీనిపై ఆధారపడి బతికే జాలర్లు జీవనాధారం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంకతో భారత్ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడం వల్ల ఇప్పటికే తమిళ జాలర్లు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. తగిన భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే అణువిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించాలన్న సుప్రీంకోర్టు సూచనలు అమలు కావడం లేదని ఆరోపించారు. అలాగే ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్న సుప్రీం ఆదేశాలు అమలుకు నోచుకోలేదని తెలిపారు. ఇది పూర్తిగా కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని స్పష్టం చేశారు. దక్కేది 140 మెగావాట్లే అణువిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తయ్యే 2000 మెగావాట్లలో 900 మెగావాట్లు తమిళనాడుకు కేటాయిస్తామని అధికారులు అబద్ధాలు ఆడుతున్నారని వైగో తెలిపారు. వాస్తవానికి రాష్ట్రానికి దక్కేది 140 మెగావాట్లు మాత్రమేనని పేర్కొన్నారు. ఇన్ని రకాలుగా తమిళ ప్రజలను వంచిస్తూ సాగే అణువిద్యుత్ కేంద్రాన్ని అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ కేంద్రాన్ని మూసివేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు.