అదనపు విద్యుత్
- త్వరలో రెండో యూనిట్ ఉత్పత్తి
- కల్పాకంలో రెండు అణు యూనిట్లు
సాక్షి, చెన్నై: రాష్ట్రానికి కూడంకుళం నుంచి అదనపు విద్యుత్ అందనుంది. త్వరలో అక్కడి రెండో యూనిట్ ఉత్పత్తి ప్రక్రియ ఆరంభం కానుంది. కల్పాకంలో రెండు అణు విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల పనులకు శ్రీకారం చుట్టినట్లు అణు విద్యుత్ బోర్డు సభ్యుడు శేఖర్ బాసు వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి ఆశాజనకంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల్లో జల విద్యుత్ నిరాశ పరిచినా, పవన, థర్మల్, అణు విద్యుత్ ఉత్పత్తి వేగం పెరుగుతోంది.
కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం నుంచి సుమారు 550 మెగావాట్ల వరకు తమిళనాడుకు అందిస్తున్నారు. దీంతో విద్యుత్ సంక్షోభం గండం నుంచి గట్టెక్కిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కు ఆశాజనకంగానే విద్యుత్ సరఫరా చేస్తోంది. అదే సమయంలో మరి కొన్ని కొత్త ప్రాజెక్టులు చేతికి అంది వచ్చిన పక్షంలో ఉత్పత్తి మరింత మెరుగు పడటం ఖాయం. ఈ పరిస్థితుల్లో కేం ద్ర ప్రభుత్వ పరిధిలోని అణు విద్యుత్ ప్రాజెక్టు ల ద్వారా రాష్ట్రానికి వాటాగా విద్యుత్ సరఫరా పెరగనుంది.
అటు కూడంకుళం, ఇటు కల్పాకంల నుంచి ఈ విద్యుత్ తమిళనాడుకు అందబోతున్న దృష్ట్యా, సీఎం జయలలిత ఆశిస్తున్న నిరంతర విద్యుత్ సరఫరా నినాదానికి బలాన్ని చేకూర్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. కూడంకుళంలో తొలి యూనిట్ ద్వారా ఇప్పటికే నిర్ణీత వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి అవుతోంది. ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతున్న తొలి యూనిట్ నుంచి రాష్ట్రానికి వాటాగా మరింత విద్యుత్ అందనుంది. శుక్రవారం ఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చిన అణు విద్యుత్ బోర్డు కమిషన్ సభ్యుడు శేఖర్ బాసు మీనంబాక్కం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
కూడంకుళం తొలి యూనిట్ ఉత్పత్తి నిర్విరామంగా సాగుతోందని వివరించారు. రోజుకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుతోందన్నారు. ఇక రెండో యూనిట్ పనులు ముగింపు దశకు చేరాయన్నారు. గత ఏడాది చివర్లో అన్ని పనులు ముగించాల్సి ఉన్నా, చిన్న చిన్న సాంకేతిక సమస్యలతో జాప్యం తప్పలేదన్నారు. ప్రస్తుతం అన్ని సమస్యల్ని అధిగమించామని, ఈ ఏడాది ఆఖర్లో రెండో యూనిట్ ద్వారా ఉత్పత్తికి శ్రీకారం చుట్టడం తథ్యమన్నారు.
కల్పాకం:కల్పాకంలో ఉన్న అణువిద్యుత్ యూ నిట్ల ద్వారా ఉత్పత్తి ఆశాజనకంగా ఉందని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడి విద్యుత్ వాటాను తమిళనాడుకు అందిస్తున్నట్లు చెప్పా రు. ప్రస్తుతం ఇక్కడ అదనంగా రెండు యూ నిట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు తగ్గ పనులు ఆరంభం అయ్యాయని, త్వరలో ఆ రెండు యూనిట్ల ద్వారా ఉత్పత్తి ప్రక్రియకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందన్నారు. తమిళనాడుకు కూడకుళం, కల్పాకంల రూపంలో అదనపు విద్యుత్ అందనుందని చెప్పారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను కేంద్ర గ్రిడ్‌కు పంపి, అక్కడి నుంచి వాటాల విభజనతో విద్యుత్ అందుతుందని స్పష్టం చేశారు.