మెగా అణువిద్యుత్ ప్లాంట్: రికార్డుస్థాయి ఉత్పత్తి
చెన్నై: తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం(కేఎన్‌పీపీ) పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేసి రికార్డు సష్టించింది. రష్యన్ ఫెడరేషన్ సాంకేతిక సహకారంతో దీనిని నిర్మించారు. దేశంలో 21వ అణువిద్యుత్ కేంద్రం అయిన ఈ కేఎన్‌పీపీలోని 1వ యూనిట్‌లో శనివారం వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. దేశంలో ఒక అణువిద్యుత్ కేంద్రం వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి అని ప్లాంటు డెరైక్టర్ ఆర్‌ఎస్ సుందర్ వెల్లడించారు. కేఎన్‌పీపీ 1వ యూనిట్ శనివారం మధ్యాహ్నం 1.20 గంటల నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో పనిచేయడం ప్రారంభించిందని ఆయన తెలిపారు.
అణు శక్తి నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం కొన్ని పరీక్షలు చేయాల్సి ఉన్నందున, దీనిని కొంత కాలవ్యవధి వరకూ పనిచేయించి తర్వాత ఆపివేస్తామని చెప్పారు. దేశంలోని ఇతర అణువిద్యుత్ కేంద్రాలు ఇంత వరకూ 540 మెగావాట్లు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు 680 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో మాత్రమే పనిచేశాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విద్యుత్ కేంద్రాల సామర్థ్యం కూడా 700 మెగావాట్లేనని సుందర్ తెలిపారు.