కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు మూడు, నాలుగో యూనిట్ల నిర్మాణంపై కొన్నేళ్లుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించుతూ భారత్, రష్యా ఒప్పందం కుదుర్చుకున్నాయి.
న్యూఢిల్లీ: కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు మూడు, నాలుగో యూనిట్ల నిర్మాణంపై కొన్నేళ్లుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించుతూ భారత్, రష్యా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అణు ప్రమాదం సంభవించినప్పుడు పౌర నష్టపరిహారం పొందడంపై కేంద్రం 2010లో రూపొందించిన పౌర పరిహార అణు ప్రమాద చట్టంలోని నిబంధనపై రష్యా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ ఒప్పందం కార్యరూపం దాల్చలేదు.
ప్రధాని మన్మోహన్ గత ఏడాది రష్యా పర్యటనలో ఈ అంశంపై జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. తాజాగా అణు ఇంధన విభాగం కార్యదర్శి ఆర్.కె. సింగ్ గత నెల రష్యా అధికారులతో ఇక్కడ జరిపిన చర్చల్లో ఈ వ్యవహారం కొలిక్కి వచ్చింది. రూ. 33 వేల కోట్లతో ఈ యూనిట్లను నిర్మించేందుకు రష్యాతో భారత అణు విద్యుత్ కార్పొరేషన్ లిమిటెడ్ గురువారం ఒప్పందం చేసుకున్నట్లు అధికార వర్గాలు శుక్రవారం ఢిల్లీలో పేర్కొన్నాయి.