ఉభయ భ్రష్టత్వం
ఉభయ భ్రష్టత్వం
Published Wed, Oct 23 2013 11:56 PM | Last Updated on Tue, Oct 9 2018 4:27 PM
మసకబారిన యూపీఏ ప్రభుత్వపు పరువు ప్రతిష్టల నీలి నీడలు మన విదేశాంగ విధానంపైన కూడా కమ్ముకుంటున్నాయి. గత నెలలో అమెరికాలో పర్యటించిన ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రస్తుతం రష్యా పర్యటన ముగించి, చైనాలో పర్యటిస్తున్నారు. వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో ప్రధాన శక్తులుగా ఉన్న మూడు దేశాలలోనూ వరుసగా ఆయన చేపట్టిన ఈ పర్యటనల లక్ష్యాలు ఘనమైనవే అయినా లాంఛనప్రాయమైననిగానే ముగిసిపోతున్నాయి. పదవీ విరమణ చేస్తున్న భారత ప్రధానికి ఘనమైన వీడ్కోలు సత్కారంలాగా మన్మోహన్ అమెరికా పర్యటన ముగిసింది. నేటి రష్యా, చైనా పర్యటనలు కూడా అలాగే సాగుతున్నాయి. మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మిత్రులన్నవారే లేక ఒంటరిగా మిగిలినప్పుడు రష్యా నమ్మకమైన మిత్రునిగా నిలిచిందంటూ మన్మోహన్... ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాల గత వైభవాన్ని నెమరు వేయడానికి మించి సత్సంబంధాల పురుద్ధరణ దిశగా సాధించింది ఏమీ లేదు. గతి తప్పిన సంబంధాలకు కొండ గుర్తులా ‘కూడంకుళం ప్రతిష్టంభన’ నిలిచే ఉంది. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉండగా 1988లో నాటి సోవియట్ యూనియన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ఫలితం. ఆ విద్యుత్ కేంద్రపు ఒకటి, రెండు రియాక్టర్ల నిర్మాణం 2002లో మొదలైంది. మొదటి రియాక్టర్ మంగళవారం నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది. మరో రెండు రియాక్టర్లను కూడా రష్యా నిర్మించాల్సి ఉంది. కానీ అది కొత్త ఒప్పందం కోసం పట్టుబడుతోంది. కూడంకుళం అణు కర్మాగారానికి ‘ఆపరేటర్’ అయిన జాతీయ అణు శక్తి కార్పొరేషనే (ఎన్‌పీసీఐఎల్) ప్రమాదం జరిగిన సందర్భాల్లో నష్టపరిహారాన్ని చెల్లించేలా ఒప్పందాన్ని సవరించాలని కోరుతోంది.
రష్యా మడత పేచీలాగా కనిపిస్తున్న ఈ వివాదంలో దాని వాదన తార్కికంగా సమంజసమైనదే అవుతుంది. 2008లో యూపీఏ ప్రభుత్వాన్ని అగ్నిపరీక్షకు గురిచేసి మరీ మన్మోహన్ అమెరికాతో అణు సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అది అమల్లోకి రావడం కోసం 2010లో పార్లమెంటు అణు పరిహార చట్టాన్ని చేసింది. అమెరికా ఒత్తిడితో తయారైన ఆ తప్పుల తడక చట్టం పరిహార బాధ్యతను ‘ఆపరేటర్’పై ఉంచింది. మన అణు విద్యుత్ కేంద్రాలన్నిటికీ ఆపరేటర్ ఎన్‌పీసీఐఎల్. విదేశీ సర ఫరాదారులతో అది కుదుర్చుకునే ఒప్పందాలకు లోబడి ఆ కంపెనీల నుంచి గరిష్టంగా రూ.1,500 కోట్లకు మించకుండా పరిహారం వసూలు చేసే అవకాశాన్ని అది కల్పిస్తోంది.
ఆ చట్టం ప్రాతిపదికపైనే రష్యా కొత్త ఒప్పందాన్ని కోరుతోంది. ‘జనరల్ ఎలక్ట్రిక్’, ‘వెస్టింగ్‌హౌస్’ వంటి అణు కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా అమెరికా పట్టుబట్టి ఈ పరిహార చట్టాన్ని చేయించింది. అయినా నేటి వరకు ఒక్క అమెరికా కంపెనీ కూడా మన దేశంలో విద్యుత్ కేంద్ర స్థాపనకు ముందుకు రాలేదు. పైగా 2010 నాటి రష్యా అణు ఒప్పందం ప్రకారం నిర్మాణం జరగాల్సి ఉన్న పదమూడు రియాక్టర్లతోపాటూ, ఇతర దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు సైతం మూలనబడ్డాయి. స్వదేశీ చట్టాలకు లోబడి పరిష్కరించాల్సిన ప్రమాద పరిహారం సమస్యను... విదేశీ కంపెనీలు తమపై ఏ బాధ్యతా లేకుండే ఒప్పందాల కోసం పట్టుబట్టే పరిస్థితికి అవకాశం కల్పించినది మన పరిహార చట్టమే. దాని ఫలితంగానే 2020 నాటికి 20,000 మెగావాట్లు, 2032 నాటికి 63,000 మెగావాట్ల అణు విద్యుదుత్పత్తి సామర్థ్యానికి మన్మో హన్ సర్కారు రచించిన ఆర్భాటపు పథకాలు పగటి కలలుగానే మిగిలిపోయాయి.
ఒకప్పటి మన నమ్మకమైన మిత్ర దేశం రష్యా మన పరిహార చట్టం లొసుగులను ఆసరా చేసుకొని పేచీకి దిగే పరిస్థితికి చేరడం మన్మోహన్ విదేశాంగ విధాన వైఫల్యమే. మౌలిక మార్పులకు గురవుతున్న అంతర్జాతీయ బలాబలాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఆయన అమెరికా అండతో భారత్‌ను ప్రాంతీయ శక్తిగా, ప్రపంచ శక్తిగా మార్చగలనని విశ్వసించారు. అమెరికా నేతృత్వంలోని ఏక కేంద్రక ప్రపంచం విచ్ఛిన్నమవుతూ బహు కేంద్రక ప్రపంచం ఆవిర్భవిస్తున్న కాలంలో ఆయన మన విధానాన్ని అమెరికా అనుకూలమైనదిగా చేయడానికి యత్నించారు.
కొత్త, పాత అధిపత్యవాద శక్తులకు సమదూరం పాటించే అలీన విధానాన్ని అనుసరించాల్సిన సమయంలో చేసిన ఈ చారిత్రక తప్పిదం అంత తేలికగా సరిదిద్దుకోలేనిది. అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా నిష్ర్కమించనున్న నేపథ్యంలో ప్రాంతీయంగా భారత్‌పై నమ్మకం ఉంచలేని రష్యా పాకిస్థాన్‌తో చెలిమి చేస్తోంది. మునుపెన్నటికన్నా బలహీనపడ్డ అమెరికా నేతృత్వంలోని ఆసియా-పసిఫిక్ కూటమిలో భారత్ భాగస్వామి అయ్యే అవకాశాలున్నట్టు చైనా భావిస్తోంది. దీంతో అది రష్యా, పాక్‌లతో కలిసి వ్యూహాత్మక కూటమిని నిర్మించే ప్రయత్నాల్లో ఉంది. అమెరికా మనకు ఎంత ‘నమ్మకమైన’ మిత్ర దేశంగా నిలవగలదో దానితో కుదుర్చుకున్న అణు ఒప్పందం అమలు తీరే చెబుతోంది. ఇక పాక్ సీమాంతర ఉగ్రవాదంపై అది అనుసరిస్తున్న అవకాశవాద వైఖరి గురించి చెప్పనవసరం లేదు. నిజానికి నేడు మనం ‘మిత్రులన్నవారే లేక ఒంటరిగా మిగిలిన’ స్థితికి చేరువవుతున్నాం.
ఆ బలహీనతను బాగా ఎరిగిన చైనా ప్రధాని లీ కియాంగ్ సరిహద్దు వివాదం, జల వివాదాలు వంటి కీలక సమస్యలపై నామమాత్రపు చర్చలకు పరిమితమై తమకు ప్రాధాన్యాంశమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలకే పరిమితం కావాలన్న తమ దౌత్య వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. అందుకే ఇరు దేశాల ప్రధానులు బుధవారం కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం లాంఛనప్రాయమైన పునరుద్ఘాటనలకే పరిమితమైంది. రష్యాలాగే చైనా కూడా మన్మోహన్‌ను కొన్ని మాసాల ప్రధానిగానే పరిగణిస్తోంది. కొత్త ప్రభుత్వంతోనే అర్థవంతమైన చర్చలు సాధ్యమని భావిస్తోంది. ఆ వచ్చే ప్రభుత్వమైనా అన్ని ఆధిపత్య శక్తులకు సమదూరం పాటించే అలీన విధానానికి మరలుతుందని ఆశిద్ధాం.
Advertisement
Advertisement