ప్రజల దృష్టి మళ్లించేందుకే..
న్యూఢిల్లీ: మోదీ సర్కారు ప్రజల దృష్టిని అనవసర అంశాలపైకి మళ్లించేందుకు అవినీతి అంశంపై ఆధారపడుతోందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి ముసుగులో సంక్షేమ రాజ్య నిర్మాణం మొత్తాన్నీ ధ్వంసం చేస్తున్నారని తప్పుపట్టారు. తీవ్ర వివక్ష, మతతత్వంతో కూడిన అభిప్రాయాన్ని ప్రచారం చేసేందుకు చరిత్రను నిరంతరం తిరగరాస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ బుధవారమిక్కడ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తన సహజ స్వభావానికి భిన్నంగా అనూహ్య రీతిలో మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలతో దాడికి దిగారు. ఆర్థికాభివృద్ధిపై ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పలను ప్రశ్నించారు. ‘గ్రామీణ భారతం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఆర్థిక పునరుద్ధరణ బలహీనంగా ఉంది. దేశంలో ప్రజాస్వామ్య సంస్థలకు ముప్పు పొంచివుంది. అసమ్మతిని అణచివేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. గర్వకారణమైన సమ్మిళిత సాంస్కృతిక సంపద గల భారత్ నిజమైన బహుళత్వ, స్వేచ్ఛాయుత, లౌకిక ప్రజాస్వామ్యంగా వికసించేలా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతో కష్టపడిందన్నారు. తమ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం రూపొందించిన చాలా పథకాలను కొత్త పేర్లతో మోదీ సర్కారు ప్రవేశపెడుతోందని ఎద్దేవా చేశారు. ‘ఎన్డీయే సర్కారు చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం.. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన కొత్త తయారీ విధానమేనన్నారు.
ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు...
‘‘నాకు సంబంధించినంత వరకూ.. నేను కానీ, నా కుటుంబం కానీ, నా స్నేహితులు కానీ ఎవరైనా ధనవంతులు అయ్యేందుకు నేను ప్రభుత్వ అధికారాన్ని ఎన్నడూ వినియోగించలేదు’’ అని మన్మోహన్ స్పష్టంచేశారు. 2జీ స్పెక్ట్రమ్ టెలికాం లెసైన్సుల కేటాయింపుల్లో సహకరించకపోతే హాని తలపెడతామని నాటి ప్రధాని మన్మోహన్ తనను హెచ్చరించారంటూ ట్రాయ్ మాజీ చైర్మన్ ప్రదీప్ బైజాల్ ఆరోపణల నేపధ్యంలో మన్మోహన్ పై విధంగా స్పందించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోదీ సర్కారు యూపీఏ పాలన అవనితీమయమని, విధానపక్షవాతం ఉండేదని అవాస్తవాలను ప్రచారం చేస్తోందని తప్పుపట్టారు.
మోదీతో మన్మోహన్ భేటీ...
మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసిన మన్మోహన్ కొన్ని గంటల తర్వాత మోదీని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. ‘డాక్టర్ మన్మోహన్‌సింగ్ గారిని కలవటం ఎంతో సంతోషంగా ఉంది. 7 రేస్ కోర్స్ రోడ్‌కు ఆయనను మరోసారి ఆహ్వానించా ను. మా భేటీ బాగా జరిగింది’ అని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. మోదీ, మన్మోహన్ ఆర్థిక, విదేశాంగ అంశాలపై చర్చించారని కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ తెలిపారు.