సామాజిక వివక్షను అరికట్టడం, అట్టడుగువర్గాల అభ్యున్నతి, పర్యావరణం, పౌరహక్కులువంటి సమస్యలపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు కోకొల్లలు. కానీ, ఇలాంటి సంస్థల వెనక స్వచ్ఛత కాకుండా స్వప్రయోజనాలు... సేవ కాకుండా దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపిం చేవారికి కొదవేమీ లేదు. స్వాభావికంగా సౌమ్యుడైన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా ఒకానొక సందర్భంలో స్వచ్ఛంద సంస్థల ఆంతర్యంపై విరుచుకుపడ్డారు. తమిళనాడులోని కూడంకుళంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న అణు విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతి రేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు అమెరికానుంచి నిధులు వచ్చిపడుతున్నాయని ఆయన ఆరోపిం చారు. అది రష్యా సహకారంతో నిర్మాణమైన ప్రాజెక్టు గనుక అమెరికా నుంచి కొన్ని సంస్థలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆటంకాలు సృష్టి స్తున్నాయన్నది ఆయన ఆరోపణల సారాంశం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంకో అడుగు ముందుకేసింది. స్వచ్ఛంద సంస్థలు విదేశాల ప్రోద్బలంతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆటంకం కలిగిస్తూ అభివృద్ధి నిరోధకంగా మారుతున్నాయని ఆరోపించింది. ఇందువల్ల జీడీపీ 2 నుంచి 3 శాతం తగ్గే ప్రమాదమున్నదని ఒక నివేదికలో హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగం ఐబీ. ఈ నివేదిక యూపీఏ ప్రభుత్వ హయాంలోనే తయారైం దని, ఇప్పుడది లీక్ కావడం వెనక నిర్దిష్ట ప్రయోజనాలున్నాయని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అంటున్నారు. పెండింగ్‌లో పడిపోర ుున అనేక ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం సిద్ధపడుతున్నదని...అందుకు తగిన ప్రాతిపదికను సిద్ధం చేయడంలో భాగంగానే ఈ నివేదికను ఇప్పుడు లీక్‌చేశారని వారి అభియోగం. స్వచ్ఛంద సేవా రంగంలో పనిచేసే కార్యకర్తలను, వారికి చేదోడువా దోడుగా నిలిచే వర్గాలను భయభ్రాంతులను చేయడమే దీని ఉద్దేశ మన్నది వారి ప్రధాన ఆరోపణ.
స్వచ్ఛంద సంస్థలన్నిటినీ ఒకే గాటన కట్టి చూడలేం. వాటి ప్రకటిత లక్ష్యాలు వేరైనట్టే, వాటి కార్యక్షేత్రాలు వేరైనట్టే ఆ సంస్థల దశ, దిశ కూడా వేరుగా ఉంటాయి. అటువంటప్పుడు స్వచ్ఛంద సంస్థలు జాతిద్రోహా నికి పాల్పడుతున్నాయని ఒక ముద్రేయడం సరికాదు. నిజమే...కొన్ని స్వచ్ఛంద సంస్థలు పేరుకే ఉంటాయి. విదేశీ విరాళాలను దండుకోవ డమే లక్ష్యంగా ఏర్పడతాయి. రాజకీయ నాయకుల, ఉన్నతోద్యోగుల సమీప బంధువులు ఏయే రంగాల్లో ‘పనిచేస్తే’ భారీయెత్తున విరాళాలు అందుతాయో తెలుసుకుని అందుకు అనుగుణంగా బోగస్ సంస్థలను స్థాపించి స్వాహాచేయడమూ ఉంటున్నది. కానీ ఉన్నతాశయాలతో, లక్ష్యాలతో చిత్తశుద్ధిగా పనిచేసే స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఉన్నాయి. 80 దశకం తర్వాత ఇలాంటి సంస్థలు ప్రజారంగంలోకి రావడంవల్ల మరుగునపడివున్న అనేక అంశాలు ఎజెండాలోకి వచ్చాయి. మనం ఎవరమూ సమస్యలుగా పరిగణించనివాటిపై ఎరుక కలిగించడమే కాదు...ఉన్న సమస్యలను కొత్త కోణంనుంచి దర్శించగలిగే చైతన్యాన్ని కూడా అందించాయి. స్త్రీవాదమైనా, దళితవాదమైనా అంత బలంగా ముందుకు రావడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ఉన్నది. ఇవి మాత్రమే కాదు...బాల కార్మిక వ్యవస్థ మొదలుకొని పర్యావరణ సమస్యల వరకూ ఎన్నో అంశాల విషయంలో ఆ సంస్థలు పౌరులను సమీకరిం చగలుగుతున్నాయి. పోరాడుతున్నాయి. అవగాహనకలిగిస్తున్నాయి.
ఈ స్వచ్ఛంద సంస్థల నిర్వహణ ను, వాటి ఆదాయమార్గాలను నియంత్రించేందుకు...ఆరా తీసేందుకు తగిన చట్టాలున్నాయి. చట్ట ఉల్లంఘన జరిగినట్టు రుజువైతే చర్యలు తీసుకోవడాన్ని కూడా ఎవరూ ప్రశ్నించరు. అవి మరింత పారదర్శకంగా, జవాబుదారీ తనంతో పనిచేయడంకోసం వాటిని సమాచార హక్కు చట్టంకిందకు తీసుకొస్తామన్నా అభ్యంతరపెట్టేవారు ఉండరు. నిజంగా జాతి భద్రతకు, ఆర్ధిక వ్యవస్థ మనుగడకు ఇబ్బందులు కలిగిస్తున్నారని రుజువైతే చర్య తీసుకోవద్దని కూడా ఎవరూ అనరు. కానీ, కూడం కుళంలో అణు విద్యుత్తు ప్రాజెక్టును వ్యతిరేకించారనో, మరోచోట థర్మల్ విద్యుత్కేంద్రం వద్దన్నారనో ఆ సంస్థలకు దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు. సమస్యలపై ఆ సంస్థల అవగాహనలో లోపం ఉన్నదనుకున్నా... అవి లేవనెత్తుతున్న ప్రశ్నలు సరైనవి కావ నుకున్నా వాటిని చర్చకు పెట్టాలి. ప్రజలకు నచ్చజెప్పాలి. ఒప్పిం చాలి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో జరగవలసింది అదే. అంతేతప్ప భిన్నాభిప్రాయాన్నో, అసమ్మతినో వ్యక్తంచేసినవారిని అణచాలని చూడటం...వారిపై జాతి వ్యతిరేక ముద్రేయడం సరైన విధానం అనిపించుకోదు. కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం లేవనెత్తిన సమస్యలెన్నో ఉన్నాయి. జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతంలో ఆ ప్రాజెక్టు నిర్మించారని, దాని సమీ పంలో చేపల వేటను నిషేధించారు గనుక మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని ఉద్యమకారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. వాటన్నిటికీ సమర్ధవంతంగా జవాబివ్వడాన్ని విడనాడి ఉద్యమకారుల ల్యాప్ టాప్‌లో ప్రస్తుత, ప్రతిపాదిత అణు విద్యుత్ ప్రాజెక్టులను గుర్తించిన మ్యాప్ లభించడమే నేరమన్నట్టు చిత్రించడం సరికాదు. ఎక్కడెక్కడ అణు విద్యుత్తు ప్రాజెక్టులు నెలకొల్పదల్చుకున్నదీ ప్రభుత్వమే తెలిపింది. ప్రస్తుతం ఉన్నవేమిటో అందరికీ తెలుసు. అలాంటపుడు ఆ మ్యాప్ ఉండటం దానికదే నేరమెలా అవుతుంది? భిన్నాభి ప్రాయా లకూ, అసమ్మతికీ చోటిచ్చినప్పుడే ప్రజల సమస్యలు అవగాహన కొస్తాయి. వాటి ఉనికే ఉండవద్దనుకోవడం సమస్యల పరిష్కారానికి దోహదపడదు.
‘స్వచ్ఛంద సేవ’లో కుట్రా?!
Published Sun, Jun 15 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM
Advertisement
Advertisement