ఎందుకీ అత్యుత్సాహం?! | The best side! | Sakshi
Sakshi News home page

ఎందుకీ అత్యుత్సాహం?!

Published Wed, May 14 2014 11:53 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

The best side!

తన పదేళ్ల పాలనాకాలంలో సంప్రదాయాలకూ, పద్ధతులకూ వీస మెత్తు విలువీయని యూపీఏ ప్రభుత్వం పోతూ పోతూ అదే ధోరణిని ప్రదర్శించింది. మంగళవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు వీడ్కోలు పలకడానికి ఉద్దేశించిన కేంద్ర కేబినెట్ సమావేశంలోనే సైనిక దళాల ప్రధానాధికారి పదవికి లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ ఎంపి కను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆమేరకు బుధవారం ఒక ప్రక టన కూడా విడుదల చేసింది. ఇప్పటికే సైనికదళాల వైస్ చీఫ్‌గా ఉన్న సుహాగ్ ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్‌సింగ్ జూలై 31న రిటైర య్యాక కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నిబంధనల ప్రకారం ప్రస్తుత చీఫ్ రెండు నెలల్లో రిటైరవుతారనగా కొత్తవారిని ఎంపిక చేయాలి. అలా చూసుకున్నా బిక్రమ్ పదవీ విరమణకు ఇంకా రెండున్నర నెల లకుపైగా సమయం ఉంది. అంటే కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కావలసినంత వ్యవధి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఆ బాధ్యతను నెత్తినేసుకోవాల్సిన అగత్యం అధికారం మెట్లు దిగుతున్న యూపీఏ ప్రభుత్వానికి లేదు. పాత ప్రభుత్వం పదవీకాలం పూర్తయి, కొత్త ప్రభుత్వం గద్దెనెక్కేలోగా సైన్యానికి నాథుడు లేకుండాపోయే అవకాశం లేదు. మరెందుకని ఇంత హడావుడి ప్రదర్శించారు? జనరల్ వీకే సింగ్ స్థానంలో జనరల్ బిక్రమ్‌సింగ్‌ను ఎంపిక చేసినప్పుడు కూడా మూడు నెలల ముందు నిర్ణయం తీసుకున్నామన్నది యూపీఏ పెద్దల వాదన.

ఆ విధానాన్నే సుహాగ్ విషయంలో కూడా పాటించామని వారు సమర్ధించుకుం టున్నారు. కానీ, ఇక్కడ సమస్యల్లా ప్రభుత్వ పదవీకాలంతోనే. ఒకపక్క మరో నాలుగైదు రోజుల్లో పదవినుంచి దిగిపోతూ... తామే నెలకొల్పిన ఒక సంప్రదాయాన్ని పాటించామని చెప్పడం ఏ రకమైన తర్కం? పైగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా, నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘాన్ని సంప్రదించామని యూపీఏ పెద్దలు సంజాయిషీ చెబుతున్నారు. ఇది నిబంధనలకో, సాంకేతికతకో సం బంధించిన అంశం కాదు. నైతికపరమైన అంశం. అధికారంనుంచి దిగిపోయే ప్రభుత్వం ఇంత ఉత్సాహం చూపాల్సిన అవసరం లేదు.  ఏదో స్వప్రయోజనాన్ని ఆశించి ఇలా వ్యవహరిం చారన్న అనుమానాలను కలిగించినవారమవుతామన్న స్పృహ కూడా వారికి ఉన్నట్టులేదు.

  సైన్యానికి సంబంధించిన నియామకాలనుగానీ, ఇతర అంశా లనుగానీ వివాదాస్పదం చేయవద్దన్నది సాధారణంగా పాటించే నియమం. కానీ, గత రెండేళ్లనుంచి సైన్యం ఏదో రకంగా చర్చల్లోకి వస్తున్నది. జనరల్ వీకే సింగ్ సైనిక దళాల చీఫ్‌గా ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు ఇందుకు ఆస్కారమిచ్చింది. తన పుట్టిన తేదీని మార్చాలంటూ ఆయన సుప్రీంకోర్టుకు ఎక్కారు. అలాగే మన సైనిక దళాల సంసిద్ధత ఉత్త డొల్ల అంటూ ఆయన ప్రధానికి లేఖ రాసి సంచలనం సృష్టించారు. రాజకీయ నాయకత్వం సైన్యం అవసరా లను తీర్చడంలో దారుణంగా విఫలమైనదని ఆయన ఆరోపించారు. అంతక్రితం ఒకసారి నాసిరకం ట్రక్కుల కొనుగోలులో ఒక దళారీ తనకు రూ. 14 కోట్ల లంచం ఇవ్వజూపాడని ఆరోపించారు. ఆ పరంపరలో ఆయన అసోంలోని జోర్హాట్‌లో ఆర్మీ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న సైనికులు కొందరు ఒక దోపిడీలో పాల్గొన్న ఉదంతంపై సుహాగ్‌కు షోకాజ్ నోటీసు జారీచేశారు.  ఆ విభాగం చీఫ్‌గా సుహాగ్ సరిగా వ్యవహరించలేదన్నది జనరల్ సింగ్ ఆరోపణ. పర్యవసానంగా సుహాగ్‌పై క్రమశిక్షణ చర్యలు కూడా మొదల య్యాయి. ఈస్ట్రన్ కమాండ్ చీఫ్‌గా ఆయన నియామకం ఆలస్యం అయింది. జనరల్ వీకే సింగ్ రిటైరైన తర్వాతనే సుహాగ్ ఆ పదవికి చేరుకోగలిగారు. సుహాగ్ అధికారంలో ఉన్నవారికి దగ్గరగా ఉంటు న్నారు గనుక ఆయనకు ఆ పదవి దక్కకుండా చేసేందుకు, భవిష్య త్తులో ఆర్మీ చీఫ్ కాకుండా చూసేందుకు సింగ్ నిష్కారణంగా ఆయనకు షోకాజ్ నోటీసిచ్చారన్న ఆరోపణలూ ఉన్నాయి. రిటైరైన తర్వాత  జనరల్ సింగ్ బీజేపీలో చేరారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక జనరల్ సింగ్ తన పలుకుబడి వినియోగించి సుహాగ్‌కు ఆ పదవి రాకుండా చేస్తారన్న అనుమానంతోనే మన్మోహన్ సర్కారు ఇంత తొందరపాటును ప్రదర్శించిందని కొందరి విమర్శ.
 
 సైన్యంలో ఇంతవరకూ సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని మాత్రమే పదోన్నతులు కల్పిస్తున్నారు. అందుకు విరుద్ధంగా వ్యవహరించిన ఉదంతాలు ఇటీవలికాలంలో లేవు. అలా చూస్తే సుహాగ్‌కు ఆర్మీ చీఫ్ దక్కదని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ పదవికి కావలసిన అర్హతలు ఆయనలో పుష్కలంగా ఉన్నాయి. సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేసి ఆయన తన సమర్ధతను నిరూ పించుకున్నారు. జోర్హాట్ ఉదంతానికి ముందు ఆయన పనితీరుపై ఇతరత్రా వివాదాలేమీ లేవు. కనుక కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం సుహాగ్ సేవలను పరిగణనలోకి తీసుకుంటుందో లేదోనన్న అనుమానాలు ఉండనవసరంలేదు. ఒకవేళ అలాంటి దేమైనా ఉంటే అందుకు తగినట్టుగా వ్యవహరించి, తన అర్హత లేమిటో ప్రభుత్వ పెద్దలకు చెప్పి ఒప్పించగల సామర్ధ్యం సీనియర్ అధికారిగా సుహాగ్‌కు ఉంటుంది. ఆ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించడం ద్వారా ఆర్మీ చీఫ్ నియామకాన్ని వివాదాస్పదం చేయడం యూపీఏ సర్కారుకు తగని పని. అసలే సైన్యంలో రాజకీయాలు పెరుగుతున్నాయని పలువురు మాజీ సైనికాధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ధోరణిని అరికట్టాల్సిన సమయంలో తమ చర్య మరో దుస్సంప్రదాయాన్ని నెలకొల్పిందని వారు గ్రహించడం మంచిది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement