Dalbirsing Suhag
-
బోడోల మారణకాండపై ఎన్ఐఏ దర్యాప్తు
అస్సాంలో పర్యటించిన ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ సుహాగ్ క్షేత్రస్థాయిలో పరిస్థితిపై అధికారులతో సమీక్ష కార్యాచరణను మరింత ఉధృతం చేయాలని ఆదేశం మరిన్ని బలగాలను మోహరిస్తామని వెల్లడి గువాహటి: అస్సాంలో ఆదివాసీలపై బోడో తీవ్రవాదులు విచ్చలవిడిగా విరుచుకుపడి 81 మందిని బలిగొన్న మారణకాండపై దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. ఈ మేరకు సోనిత్పూర్, కోక్రాఝర్ జిల్లాల పరిధిలో స్థానిక పోలీసులు నమోదు చేసిన నాలుగు కేసులను ఎన్ఐఏ తన ఆధీనంలోకి తీసుకోనుంది. మరోవైపు ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ శనివారం అస్సాంలో పర్యటించారు. బాధిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యలు, ప్రస్తుతమున్న బలగాల సంఖ్య, మరిన్ని అదనపు బలగాలను మోహరించే తదితర అంశాలపై స్థానిక పోలీసులు, ఆర్మీ అధికారులతో సమీక్షించారు. ప్రజలకు రక్షణ అందించడంతో పాటు తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని.. ఇందుకోసం అవసరమైతే మరిన్ని బలగాలను పంపిస్తామని సూచించారు. బాధిత ప్రాంతాల్లో శాంతి తిరిగి నెలకొల్పేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో, నిఘా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని, సాధ్యమైనంత సహకారం అందించాలని ఆర్మీ అధికారులకు సూచించారు. తర్వాత బాధిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే చేసిన ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ సుహాగ్... అనంతరం ఢిల్లీకి తిరిగివెళ్లారు. దర్యాప్తు ప్రారంభించనున్న ఎన్ఐఏ.. అస్సాం-అరుణాచల్‌ప్రదేశ్‌ల సరిహద్దులోని సోనిత్పూర్, కోక్రాఝర్ జిల్లాల్లో ఆదివాసీలపై బోడో తీవ్రవాదుల మారణకాండపై దర్యాప్తును కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకు అప్పగించింది. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించాలని అస్సాం చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఘటనపై పోలీసులు నమోదు చేసిన నాలుగు కేసులను ఎన్ఐఏ తన అధీనంలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించనుంది. మరోవైపు బోడో తీవ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా ఆదివాసీ వికాస్ పరిషత్ ఇచ్చిన బంద్ పిలుపుతో అస్సాంతో పాటు బెంగాల్ ఉత్తర ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. -
మరోసారి తల నరికితే.. తీవ్ర ప్రతిస్పందన
తొలిరోజే పాక్‌కు ఆర్మీ కొత్త చీఫ్ హెచ్చరిక న్యూఢిల్లీ: భారత సైనిక దళాల ప్రధానాధికారిగా విధులకు హాజరైన తొలి రోజే దల్బీర్‌సింగ్ సుహాగ్ పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్తులో జవాన్ల తల నరకడం లాంటి చర్యలకు దిగితే భారత్ స్పందన తగిన రీతిలో ఉంటుందన్నారు. ఆ స్పందన చాలా తీవ్ర స్థాయిలో వెంటనే ఉంటుందని స్పష్టంగా చెప్పారు. ఆర్మీ కొత్త చీఫ్‌గా శుక్రవారం ఇక్కడ సైనిక దళాల నుంచి గౌరవ వందనం అందుకున్న అనంతరం సుహాగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గతేడాది జనవరి 8న పూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద ఓ భారత జవాను లాన్స్‌నాయక్ హేమరాజ్ తలను పాక్ సేనలు నరికి వేసిన ఘటనను విలేకరులు ప్రస్తావించగా సుహాగ్ పైవిధంగా స్పందించారు. తనపై నమ్మకం ఉంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఎందుకీ అత్యుత్సాహం?!
తన పదేళ్ల పాలనాకాలంలో సంప్రదాయాలకూ, పద్ధతులకూ వీస మెత్తు విలువీయని యూపీఏ ప్రభుత్వం పోతూ పోతూ అదే ధోరణిని ప్రదర్శించింది. మంగళవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు వీడ్కోలు పలకడానికి ఉద్దేశించిన కేంద్ర కేబినెట్ సమావేశంలోనే సైనిక దళాల ప్రధానాధికారి పదవికి లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ ఎంపి కను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆమేరకు బుధవారం ఒక ప్రక టన కూడా విడుదల చేసింది. ఇప్పటికే సైనికదళాల వైస్ చీఫ్‌గా ఉన్న సుహాగ్ ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్‌సింగ్ జూలై 31న రిటైర య్యాక కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నిబంధనల ప్రకారం ప్రస్తుత చీఫ్ రెండు నెలల్లో రిటైరవుతారనగా కొత్తవారిని ఎంపిక చేయాలి. అలా చూసుకున్నా బిక్రమ్ పదవీ విరమణకు ఇంకా రెండున్నర నెల లకుపైగా సమయం ఉంది. అంటే కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కావలసినంత వ్యవధి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఆ బాధ్యతను నెత్తినేసుకోవాల్సిన అగత్యం అధికారం మెట్లు దిగుతున్న యూపీఏ ప్రభుత్వానికి లేదు. పాత ప్రభుత్వం పదవీకాలం పూర్తయి, కొత్త ప్రభుత్వం గద్దెనెక్కేలోగా సైన్యానికి నాథుడు లేకుండాపోయే అవకాశం లేదు. మరెందుకని ఇంత హడావుడి ప్రదర్శించారు? జనరల్ వీకే సింగ్ స్థానంలో జనరల్ బిక్రమ్సింగ్ను ఎంపిక చేసినప్పుడు కూడా మూడు నెలల ముందు నిర్ణయం తీసుకున్నామన్నది యూపీఏ పెద్దల వాదన. ఆ విధానాన్నే సుహాగ్ విషయంలో కూడా పాటించామని వారు సమర్ధించుకుం టున్నారు. కానీ, ఇక్కడ సమస్యల్లా ప్రభుత్వ పదవీకాలంతోనే. ఒకపక్క మరో నాలుగైదు రోజుల్లో పదవినుంచి దిగిపోతూ... తామే నెలకొల్పిన ఒక సంప్రదాయాన్ని పాటించామని చెప్పడం ఏ రకమైన తర్కం? పైగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా, నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘాన్ని సంప్రదించామని యూపీఏ పెద్దలు సంజాయిషీ చెబుతున్నారు. ఇది నిబంధనలకో, సాంకేతికతకో సం బంధించిన అంశం కాదు. నైతికపరమైన అంశం. అధికారంనుంచి దిగిపోయే ప్రభుత్వం ఇంత ఉత్సాహం చూపాల్సిన అవసరం లేదు. ఏదో స్వప్రయోజనాన్ని ఆశించి ఇలా వ్యవహరిం చారన్న అనుమానాలను కలిగించినవారమవుతామన్న స్పృహ కూడా వారికి ఉన్నట్టులేదు. సైన్యానికి సంబంధించిన నియామకాలనుగానీ, ఇతర అంశా లనుగానీ వివాదాస్పదం చేయవద్దన్నది సాధారణంగా పాటించే నియమం. కానీ, గత రెండేళ్లనుంచి సైన్యం ఏదో రకంగా చర్చల్లోకి వస్తున్నది. జనరల్ వీకే సింగ్ సైనిక దళాల చీఫ్‌గా ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు ఇందుకు ఆస్కారమిచ్చింది. తన పుట్టిన తేదీని మార్చాలంటూ ఆయన సుప్రీంకోర్టుకు ఎక్కారు. అలాగే మన సైనిక దళాల సంసిద్ధత ఉత్త డొల్ల అంటూ ఆయన ప్రధానికి లేఖ రాసి సంచలనం సృష్టించారు. రాజకీయ నాయకత్వం సైన్యం అవసరా లను తీర్చడంలో దారుణంగా విఫలమైనదని ఆయన ఆరోపించారు. అంతక్రితం ఒకసారి నాసిరకం ట్రక్కుల కొనుగోలులో ఒక దళారీ తనకు రూ. 14 కోట్ల లంచం ఇవ్వజూపాడని ఆరోపించారు. ఆ పరంపరలో ఆయన అసోంలోని జోర్హాట్లో ఆర్మీ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న సైనికులు కొందరు ఒక దోపిడీలో పాల్గొన్న ఉదంతంపై సుహాగ్‌కు షోకాజ్ నోటీసు జారీచేశారు. ఆ విభాగం చీఫ్‌గా సుహాగ్ సరిగా వ్యవహరించలేదన్నది జనరల్ సింగ్ ఆరోపణ. పర్యవసానంగా సుహాగ్‌పై క్రమశిక్షణ చర్యలు కూడా మొదల య్యాయి. ఈస్ట్రన్ కమాండ్ చీఫ్‌గా ఆయన నియామకం ఆలస్యం అయింది. జనరల్ వీకే సింగ్ రిటైరైన తర్వాతనే సుహాగ్ ఆ పదవికి చేరుకోగలిగారు. సుహాగ్ అధికారంలో ఉన్నవారికి దగ్గరగా ఉంటు న్నారు గనుక ఆయనకు ఆ పదవి దక్కకుండా చేసేందుకు, భవిష్య త్తులో ఆర్మీ చీఫ్ కాకుండా చూసేందుకు సింగ్ నిష్కారణంగా ఆయనకు షోకాజ్ నోటీసిచ్చారన్న ఆరోపణలూ ఉన్నాయి. రిటైరైన తర్వాత జనరల్ సింగ్ బీజేపీలో చేరారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక జనరల్ సింగ్ తన పలుకుబడి వినియోగించి సుహాగ్‌కు ఆ పదవి రాకుండా చేస్తారన్న అనుమానంతోనే మన్మోహన్ సర్కారు ఇంత తొందరపాటును ప్రదర్శించిందని కొందరి విమర్శ. సైన్యంలో ఇంతవరకూ సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని మాత్రమే పదోన్నతులు కల్పిస్తున్నారు. అందుకు విరుద్ధంగా వ్యవహరించిన ఉదంతాలు ఇటీవలికాలంలో లేవు. అలా చూస్తే సుహాగ్‌కు ఆర్మీ చీఫ్ దక్కదని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ పదవికి కావలసిన అర్హతలు ఆయనలో పుష్కలంగా ఉన్నాయి. సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేసి ఆయన తన సమర్ధతను నిరూ పించుకున్నారు. జోర్హాట్ ఉదంతానికి ముందు ఆయన పనితీరుపై ఇతరత్రా వివాదాలేమీ లేవు. కనుక కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం సుహాగ్ సేవలను పరిగణనలోకి తీసుకుంటుందో లేదోనన్న అనుమానాలు ఉండనవసరంలేదు. ఒకవేళ అలాంటి దేమైనా ఉంటే అందుకు తగినట్టుగా వ్యవహరించి, తన అర్హత లేమిటో ప్రభుత్వ పెద్దలకు చెప్పి ఒప్పించగల సామర్ధ్యం సీనియర్ అధికారిగా సుహాగ్‌కు ఉంటుంది. ఆ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించడం ద్వారా ఆర్మీ చీఫ్ నియామకాన్ని వివాదాస్పదం చేయడం యూపీఏ సర్కారుకు తగని పని. అసలే సైన్యంలో రాజకీయాలు పెరుగుతున్నాయని పలువురు మాజీ సైనికాధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ధోరణిని అరికట్టాల్సిన సమయంలో తమ చర్య మరో దుస్సంప్రదాయాన్ని నెలకొల్పిందని వారు గ్రహించడం మంచిది. -
తదుపరి ఆర్మీచీఫ్‌గా దల్బీర్‌సింగ్ సుహాగ్
-
తదుపరి ఆర్మీచీఫ్‌గా దల్బీర్‌సింగ్ సుహాగ్
బీజేపీ నిరసనలను పట్టించుకోకుండా నియమించిన ప్రభుత్వం జూలై 31న రిటైరవనున్న ప్రస్తుత ఆర్మీ చీఫ్ న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్‌ను తదుపరి ఆర్మీ చీఫ్‌గా ప్రభుత్వం నియమించింది. ఆర్మీచీఫ్ నియామకంపై బీజేపీ నుంచి ఎదురవుతున్న నిరసనలను పట్టించుకోకుండా, ప్రధాని మన్మోహన్సింగ్ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ సుహాగ్ నియామకంపై రక్షణ శాఖ సిఫారసును మంగళవారం ఆమోదించింది. ప్రస్తుత ఆర్మీచీఫ్ జనరల్ బిక్రమ్ సింగ్ జూలై 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత సుహాగ్ ఆర్మీచీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ జనరల్స్‌లో గూర్ఖా అధికారి అయిన దల్బీర్‌సింగ్ సుహాగ్ (59) అందరి కంటే సీనియర్. చిత్తోర్‌గఢ్ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం చేసిన సుహాగ్, 1970లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొంది, 1974 జూన్‌లో 4/5 గూర్ఖా రెజిమెంట్‌లో చేరారు. సైనిక శిక్షణకు సంబంధించి దేశ విదేశాల్లో పలు కోర్సులు పూర్తిచేసిన సుహాగ్, శ్రీలంకలో చేపట్టిన ‘ఆపరేషన్ పవన్’లో కంపెనీ కమాండర్‌గా కీలక పాత్ర పోషించారు. కాశ్మీర్ లోయలో 2003 జూలై నుంచి 2005 మార్చి వరకు చేపట్టిన చొరబాటు నిరోధక ఆపరేషన్‌కు నాయకత్వం వహించారు. కార్గిల్ యుద్ధంలో 2007 అక్టోబర్ నుంచి 2008 డిసెంబర్ వరకు 8 మౌంటైన్ డివిజన్‌ను విజయవంతంగా నడిపించారు. జనరల్ వీకే సింగ్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న సమయంలో తలెత్తిన వివాదం అనంతరం 2012 జూన్ 16న ఈస్టర్న్ ఆర్మీ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు. వీకే సింగ్ ఆర్మీ చీఫ్‌గా ఉన్నప్పుడు ఆయన సుహాగ్‌పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా నిషేధం విధించారు. వీకే సింగ్ పదవీ విరమణ తర్వాత బిక్రమ్ సింగ్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే సుహాగ్‌పై నిషేధాన్ని తొలగించారు. ఆర్మీ చీఫ్‌గా దల్బీర్ ఎంపికపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొద్దిరోజుల్లోనే కొత్త ప్రభుత్వం అధికారంలోకి రానున్నందున ఇప్పటికిప్పుడే ఈ నియామకాన్ని చేపట్టేందుకు తొందరేమొచ్చిందని ప్రశ్నించింది. -
కొత్త ఆర్మీ చీఫ్ నియామకానికి లైన్ క్లియర్
న్యూఢిల్లీ: ఆర్మీ కొత్త చీఫ్ నియామకం విషయంలో ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ అంశంలో ముందుకే వెళ్లాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ పదవికి వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ పేరును కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ)కి రక్షణ శాఖ సిఫారసు చేసింది. లెఫ్టినెంట్ జనరళ్లలో ఈయనే సీనియర్. ప్రధాని అధ్యక్షతన గల ఏసీసీ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల సమయంలో ఆర్మీ కొత్త చీఫ్ నియామకం చేపట్టడంపై బీజేపీ తీవ్రంగా తప్పుపట్టడంతో దీనిపై వివాదం నెలకొంది. ఈ నిర్ణయాన్ని ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి వదిలివేయాలని బీజేపీ డిమాండ్ చేయడంతోపాటు దీనిపై ఈసీకి కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.