బోడోల మారణకాండపై ఎన్‌ఐఏ దర్యాప్తు
- అస్సాంలో పర్యటించిన ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ సుహాగ్
- క్షేత్రస్థాయిలో పరిస్థితిపై అధికారులతో సమీక్ష
- కార్యాచరణను మరింత ఉధృతం చేయాలని ఆదేశం
- మరిన్ని బలగాలను మోహరిస్తామని వెల్లడి
గువాహటి: అస్సాంలో ఆదివాసీలపై బోడో తీవ్రవాదులు విచ్చలవిడిగా విరుచుకుపడి 81 మందిని బలిగొన్న మారణకాండపై దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది. ఈ మేరకు సోనిత్‌పూర్, కోక్రాఝర్ జిల్లాల పరిధిలో స్థానిక పోలీసులు నమోదు చేసిన నాలుగు కేసులను ఎన్‌ఐఏ తన ఆధీనంలోకి తీసుకోనుంది. మరోవైపు ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ శనివారం అస్సాంలో పర్యటించారు.
బాధిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యలు, ప్రస్తుతమున్న బలగాల సంఖ్య, మరిన్ని అదనపు బలగాలను మోహరించే తదితర అంశాలపై స్థానిక పోలీసులు, ఆర్మీ అధికారులతో సమీక్షించారు. ప్రజలకు రక్షణ అందించడంతో పాటు తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని.. ఇందుకోసం అవసరమైతే మరిన్ని బలగాలను పంపిస్తామని సూచించారు. బాధిత ప్రాంతాల్లో శాంతి తిరిగి నెలకొల్పేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో, నిఘా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని, సాధ్యమైనంత సహకారం అందించాలని ఆర్మీ అధికారులకు సూచించారు. తర్వాత బాధిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే చేసిన ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ సుహాగ్... అనంతరం ఢిల్లీకి తిరిగివెళ్లారు.
దర్యాప్తు ప్రారంభించనున్న ఎన్‌ఐఏ..
అస్సాం-అరుణాచల్‌ప్రదేశ్‌ల సరిహద్దులోని సోనిత్‌పూర్, కోక్రాఝర్ జిల్లాల్లో ఆదివాసీలపై బోడో తీవ్రవాదుల మారణకాండపై దర్యాప్తును కేంద్ర హోంశాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది. ఈ ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించాలని అస్సాం చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఘటనపై పోలీసులు నమోదు చేసిన నాలుగు కేసులను ఎన్‌ఐఏ తన అధీనంలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించనుంది. మరోవైపు బోడో తీవ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా ఆదివాసీ వికాస్ పరిషత్ ఇచ్చిన బంద్ పిలుపుతో అస్సాంతో పాటు బెంగాల్ ఉత్తర ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.