తదుపరి ఆర్మీచీఫ్‌గా దల్బీర్‌సింగ్ సుహాగ్
బీజేపీ నిరసనలను పట్టించుకోకుండా నియమించిన ప్రభుత్వం
జూలై 31న రిటైరవనున్న ప్రస్తుత ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్‌ను తదుపరి ఆర్మీ చీఫ్‌గా ప్రభుత్వం నియమించింది. ఆర్మీచీఫ్ నియామకంపై బీజేపీ నుంచి ఎదురవుతున్న నిరసనలను పట్టించుకోకుండా, ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ సుహాగ్ నియామకంపై రక్షణ శాఖ సిఫారసును మంగళవారం ఆమోదించింది. ప్రస్తుత ఆర్మీచీఫ్ జనరల్ బిక్రమ్ సింగ్ జూలై 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత సుహాగ్ ఆర్మీచీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ జనరల్స్‌లో గూర్ఖా అధికారి అయిన దల్బీర్‌సింగ్ సుహాగ్ (59) అందరి కంటే సీనియర్. చిత్తోర్‌గఢ్ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం చేసిన సుహాగ్, 1970లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొంది, 1974 జూన్‌లో 4/5 గూర్ఖా రెజిమెంట్‌లో చేరారు. సైనిక శిక్షణకు సంబంధించి దేశ విదేశాల్లో పలు కోర్సులు పూర్తిచేసిన సుహాగ్, శ్రీలంకలో చేపట్టిన ‘ఆపరేషన్ పవన్’లో కంపెనీ కమాండర్‌గా కీలక పాత్ర పోషించారు. కాశ్మీర్ లోయలో 2003 జూలై నుంచి 2005 మార్చి వరకు చేపట్టిన చొరబాటు నిరోధక ఆపరేషన్‌కు నాయకత్వం వహించారు.
కార్గిల్ యుద్ధంలో 2007 అక్టోబర్ నుంచి 2008 డిసెంబర్ వరకు 8 మౌంటైన్ డివిజన్‌ను విజయవంతంగా నడిపించారు. జనరల్ వీకే సింగ్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న సమయంలో తలెత్తిన వివాదం అనంతరం 2012 జూన్ 16న ఈస్టర్న్ ఆర్మీ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు. వీకే సింగ్ ఆర్మీ చీఫ్‌గా ఉన్నప్పుడు ఆయన సుహాగ్‌పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా నిషేధం విధించారు. వీకే సింగ్ పదవీ విరమణ తర్వాత బిక్రమ్ సింగ్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే సుహాగ్‌పై నిషేధాన్ని తొలగించారు. ఆర్మీ చీఫ్‌గా దల్బీర్ ఎంపికపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొద్దిరోజుల్లోనే కొత్త ప్రభుత్వం అధికారంలోకి రానున్నందున ఇప్పటికిప్పుడే ఈ నియామకాన్ని చేపట్టేందుకు తొందరేమొచ్చిందని ప్రశ్నించింది.