Indian Foreign Policy
-
భారత్ భేష్.. ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామాకు తాను వెనకాడబోనని చెప్పిన పాక్ పీఎం.. విపక్షాల ఒత్తిళ్లకు తలొగ్గేదిలేదంటూ వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా పాక్ ఆర్మీని విమర్శిస్తూ.. భారత్‌పై ప్రశంసలు గుప్పించాడు. ఖైబర్ ఫక్తూన్వాలో ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించాడు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవిశ్వాసం తేబోతున్న ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ.. తన ప్రభుత్వ పని తీరును సమర్థించుకున్నాడు. పనిలో పనిగా.. భారత ఆర్మీ భేషుగ్గా పని చేస్తుందని మెచ్చుకున్నాడు. భారత ఆర్మీ.. అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. అలాగే భారత విదేశాంగ విధానం అద్భుతంగా ఉంటుందని, పౌరుల కోసం ఎంతకైనా తెగిస్తుందంటూ ఆకాశానికి ఎత్తాడు. ఇక భారత్.. ఏ ఒత్తిళ్లకూ తలొగ్గని దేశమని, విధానాలు సక్రమంగా ఉండడం వల్లే తటస్థ వైఖరి అవలంభిస్తుందంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు భారత్ విధానాలు ఆ దేశానికి ఎంతో మేలు చేస్తున్నాయని వ్యాఖ్యానించాడు ఇమ్రాన్ ఖాన్. ఇక పదవీ గండంపై స్పందిస్తూ.. రాజీనామాకు తాను ఎప్పటికైనా సిద్ధమని పేర్కొన్నాడు. అలాగని విపక్షాల ఒత్తిళ్లకు తాను తలొగ్గనని, ఆర్మీకి డబ్బులిచ్చి ప్రభుత్వాన్ని, పదవిని నిలబెట్టుకోలేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉండగా.. ఆర్మీ చీఫ్ జనరల్ ఖనార్ జావెద్ బజ్వా ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇది ఇస్లామిక్ కో ఆపరేషన్’ తర్వాత ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధాని పదవికి రాజీనామా చేయాలని కోరిన సంగతి తెలిసిందే. చదవండి: ఖాన్ సాబ్.. మీరు దిగి పోవడమే మంచిది! -
అమెరికాతో తెగిన గతం బంధనాలు
జాతిహితం ప్రచ్ఛన్న యుద్ధం అంతరించి, ఏక ధ్రువ ప్రపంచం ఆవిర్భవించింది.ఆ ధ్రువం ఆకర్షణ శక్తి క్షీణిస్తుండగా మరో ధ్రువం వృద్ధి చెందుతోంది. ఏదో ఒక మేరకు బలాబలాల సమతూకం నెలకొంటోంది. క్యూబా, ఇరాన్, అమెరికా తమ పాత శత్రుత్వాలను పాతిపెట్టేశాయి. భారత్ తటపటాయిస్తూనే ఉంది. మోదీ ఆ గతాన్ని చెత్తబుట్టలోకి విసిరేశారు. ప్రజా స్వామ్యంలో అధికారం చేతులు మారుతుందే గానీ విదేశాంగ, వ్యూహాత్మక విధానాలు స్థూల జాతీయ ఏకాభిప్రాయం పునాదిగానే కొనసాగుతాయనే అపోహను తొలగించారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ కిక్కిరిసిన ఢిల్లీ ఐఐటీ ఆడి టోరియంలో జరిపిన ఇష్టాగోష్టికి నేను ప్రయోక్తగా వ్యవహరించాను. ఆ సందర్భంగా కెర్రీ భారత్, అమెరికాలు ‘చారిత్రక తటపటాయింపులను వదు ల్చుకున్నాయి’ అని అన్నారు. ఈ పదబంధాన్ని కెర్రీ ఈ ఏడాది మొదట్లో మన ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్లో చేసిన ప్రసంగం నుంచి స్వీకరించారు. చారిత్రకమైన తటపటాయింపులే కాదు, కాపట్యాలు కూడా ఉన్నాయన డానికి అద్భుతమైన ఆధారాలున్నా వాటిని గమనించేటంత దాకా కెర్రీ పోలేదు. ఐఐటీ క్యాంపస్ నుంచి అలా నడిచివెళ్లేంత సమీపంలోనే గమాల్ అబ్దుల్ నాసర్ పేరిట ఉన్న ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డులోని ఒక భాగాన్ని చూసే వారు. ప్రచ్ఛన్న యుద్ధం/అలీన విధానం కాలం నాటి ఆ ఈజిప్ట్ నియంత వారసత్వాన్ని ఆ దేశస్తులే తిరస్కరించారు. ఆయన పేరిట ఉన్న మార్గం బహుశా ప్రపంచంలో అదొక్కటే. అదే రింగ్ రోడ్డు తూర్పున ఓ మైలు దూరంలో హోచిమిన్ మార్గం అయిపోతుంది. ప్రచ్ఛన్న యుద్ధం ఇంకా భారత రాజధాని వీధుల్లో, ముఖ్య స్థలాల్లో సజీవంగానే ఉందనడానికిఇది నిదర్శనం. అయితే ఇది సగం కథ మాత్రమే అవుతుంది. అదే రోజు సాయంత్రం కెర్రీ అంతుబట్టని రీతిలో ఢి ల్లీలో మరో రెండు రోజులు ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకు కారణాలేమిటా అని ఊహాగా నాలు సాగాయి. కాలం చెల్లిన విధానాలకు చెల్లు చీటి వానాకాలపు వరదలు ఢిల్లీ నగరాన్ని ఎంతగా ముంచెత్తినా విమానాశ్రయం మాత్రం నిక్షేపంగా ఉంది! మరుసటి రోజుకుగానీ ఆ కీలక కారణమేమిటో బయటపడలేదు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ అల్ సిసీ లాంఛనంగా ఢిల్లీ పర్యటనకు వస్తున్నారు. కెర్రీ ఆయన్ను ఇక్కడ కలుసుకోవాలనుకున్నారు. చరిత్రకు సంబంధించి భారత్‌కు ఉన్న తటపటాయింపులు, కపటత్వాలను ఇది నొక్కి చెబుతుంది. 25 ఏళ్ల క్రితమే ప్రచ్ఛన్న యుద్ధం అంతరించి, ఏక ధ్రువ ప్రపంచం ఆవిర్భవించింది. ఆ ధ్రువం ఆకర్షణ శక్తి సైతం క్షీణించి, మరో ధ్రువం వృద్ధి చెందుతోంది. అది దాన్ని సవాలు చేయకపోయినా సతాయిస్తోంది. అది తక్కువగా వ్యవస్థీకృతమైనదే అయినా ప్రపంచస్థాయి బలాబలాల సమతూకం నెలకొనడానికి దారి తీస్తోంది. క్యూబా, ఇరాన్, అమెరికా తమ పాత శత్రుత్వాలను పాతిపెట్టేశాయి. భారత్ మాత్రం తటపటాయిస్తూనే ఉంది లేదా కొంత భాగం ఈ మార్పును హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంటే మరో భాగం గతంలో గడ్డకట్టుకు పోయి ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యంలో అల్ సిసీని ఢిల్లీలో కలుసుకోవడానికి కెర్రీ ఇలా ఆగిపోవడం ఈ తటపటాయింపులు, కపట త్వాలను... ఉన్నదున్నట్టుగా చెప్పాలంటే మేధోపరమైన సోమరితనాన్ని దిగ్భ్రాంతికరంగా వెల్లడి చేస్తుంది. నాసర్ మార్గ్ గుర్తు వద్ద ఆ ముగ్గురు నేతలూ కలసి ఫొటో దిగేలా చేయలేక పోవడం ఎంతటి విచారకరం? అయితేనేం నేడు వచ్చిన మార్పు ప్రాధాన్యాన్ని మీరు గుర్తించగలరు, అర్థం చేసుకోగలరు. బెర్లిన్ గోడ కూలిన తదుపరి వచ్చిన ప్రధానులలో ప్రాముఖ్యతగలిగిన వారు ముగ్గురు... పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మో హన్‌సింగ్. వారు ఈ పాత విముఖతను వదల్చడానికి ప్రయత్నించారు. ఒక్కొక్కరు తమవైన భిన్న పద్ధతుల్లో, తామున్న పరిస్థితుల్లో ఆ పని చేయడానికి యత్నించారు. అయితే ఎక్కడో ఒక చోట కాపట్యాలకంటే తటపటాయింపులే ఎక్కువగా వారి ప్రయత్నాలను నీరుగార్చాయి. పీవీ అమెరికాతో మైత్రిని కోరితే, వాజ్‌పేయి భారత్ అమెరికాలు వ్యూహాత్మక భాగస్వాములంటూ ఎన్ఎస్ఎస్పీపై (వ్యూహాత్మక భాగస్వామ్యంలోని తదు పరి చర్యలు) సంతకం చేశారు. కానీ తీవ్ర జాతీయవాద ఆర్ఎస్ఎస్ దీన్ని అనుమానంతో చూసి, వ్యూహాత్మక నిపుణుడు బ్రజేష్ మిశ్రా అమెరికాకు అతిగా అనుకూలుడని భావించింది. ఇక మన్మోహన్సింగైతే మన రెండు దేశాలు సహజ మిత్రులు అనే భావనను వాడారు. ఎన్ఎస్ఎస్పీని ముందుకు తీసుకుపోయి అణు ఒప్పందంపై సంతకాలు చేసి తన ప్రభు త్వానికి ముప్పును సైతం ఆహ్వానించారు. ఆ తదుపరి సమాచారం, ఎత్తుగడలు, సరఫరాల సహకారం, ఉమ్మడి శిక్షణలపై మరిన్ని సైనిక- వ్యూహాత్మక ఒప్పం దాల కోసం చర్చలు జరిపారు. అయితే ఆయన పార్టీకే చెందిన చేతులు ముడుచుకు కూచున్న ప్రచ్ఛన్న యుద్ధ యోధులు నాటి రక్షణ మంత్రి ఏకే ఆంథోనీ నేతృత్వంలో ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. మోదీ ఆ గతాన్ని నిస్సం కోచంగా చెత్తబుట్టలోకి విసిరేశారు. నిస్సంకోచంగా తొక్కిన కొత్త బాట కొనసాగింపు, నిలకడా, వాటికి విరుద్ధంగా స్థాన చలనం, మార్పు అనేవి భారత విదేశాంగ విధాన రూపకల్పనలో ఎడతెగని చర్చగా ఉంటూ వచ్చాయి. వాటిలో మొదటిదే సునాయాసంగా విజయం సాధిస్తుండే ది. ప్రజా స్వామ్యంలో అధికారం చేతులు మారుతుంది. అలా అని విదేశాంగ, వ్యూహాత్మక విధానంలో స్థాన చలనం సైతం జరుగుతుందని అర్థం కాదు. అవి విశాల జాతీయ ఏకాభిప్రాయం ప్రతిపదికపై అవి తప్పక కొనసాగు తాయి. ఇదే ఇంతవరకు దాదాపుగా ఎదురేలేని విజ్ఞతగా చలామణి అయింది. మోదీ అధికారంలోకి వచ్చి మూడో సంవత్సరంలోకి ప్రవేశి స్తుండగా ఆయన ఈ అపోహను తొలగించారు. ఇది కేవలం అమెరికాను నిస్సంకోచంగా వాటేసుకోవడం మాత్రమే కాదని మీకేఅనిపిస్తుంది. త్వరలో అమెరికాకు కొత్త అధ్యక్షులు రానున్నారు. ఈ ఏడాది చివరికి అధ్యక్షునిగా ఉండేది ఎవరో ఆ దేవుడికే ఎరుక. అయినా ఫర్వాలేదనే వైఖరికిగానీ లేదా అలీన దేశాల (నామ్) శిఖరాగ్ర సమావేశానికి గైర్హాజరు కావడమనే సంకేతాత్మక చర్యగానీ చెప్పేది అదే. చైనా పట్ల, ఇస్లా మిక్ ప్రపంచం పట్ల వైఖరిలో కూడా ఇది కనిపిస్తుంది. చైనాతో సంబం ధాలలో దాదాపు అసాధ్యమైన వ్యూహాత్మక కదలికను తేవడాన్ని ఆయన తన వ్యక్తిగత లక్ష్యంగా చేసుకున్నారు. పూర్తి లావాదేవీల రూపంలోని సంబంధా లను తిరిగి మలచుకోవాలన్న ఆయన ప్రయత్నం ఇంకా సఫలం కాలేదు. మన మార్కెట్లు మనకు కావాలి, కనీసం ఆ విషయంలోనైనా సంబంధాలు ఒడిదుడుకులకు గురికాకుండా చూసుకోవాలి. అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ), మసూద్ అజర్ తదితర వ్యవహారాల్లో చైనా ప్రతి కూల వైఖరి చేపట్టినప్పుడు మోదీ వీధి పోరాట యోధునిలాగా స్పందిం చారు. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రశ్నార్థకంగా మారేలా చేశారు. చైనా నుంచి తక్కువ సాంకేతికత, నైపుణ్యాలతో తయారయ్యే చౌక దిగుమతులపైకి చాక చక్యంగా స్వదేశీ దాడిని సాగిస్తున్నారు. గత వారంలో ఆయన సంప్రదాయక మైన మట్టి విగ్రహాల పట్ల ప్రేమ, విశ్వాసాల ప్రాధాన్యాన్ని గురించి మాట్లాడటాన్ని గమనించండి. చైనా నుంచి ఆకర్ష ణీయమైన ప్లాస్టిక్ బొమ్మలను దిగుమతి చేసుకోవడం చౌక అని చెప్ప నవసరం లేదు. తెగిపడ్డ గతం బంధాలు అలాగే ఇస్లామిక్ ప్రపంచంతో.. సున్నీలు షియాలు ఇద్దరితో ద్వైపాక్షిక, లావాదేవీలపరమైన సంబంధాలను పెంపొందింపజేసుకోవడం కోసం ఆయన వ్యక్తిగత, దేశ ప్రతిష్టలు రెండిటినీ ఉపయోగిస్తున్నారు. అమెరికా నుంచి యూరప్‌కు, చైనాకు చివరకు సౌదీ అరేబియా, యూఏఈల వరకు అన్ని దేశాలకు ఇస్లాం తీవ్రవాదం విస్తరించింది. ఈ పరిస్థితుల్లో ఐఎస్ఐఎస్ విస్తరణను వెనక్కు మరల్చడానికి ఇరాన్ కీలకమైనదిగా కనిపిస్తోంది. అందుకు దాన్ని ఉపయోగించుకునే అవకాశం మోదీకి ఉంది. ఆ పని చేస్తున్న క్రమంలోనే ఆయన ఇస్లామిక్ ప్రపంచంతో సంబంధాలను పాలస్తీనా ఇజ్రా యెల్ సమస్యతో ముడిపెట్టి నిర్వచించుకోవడమనే పాత బంధనాలను ఆయన పూర్తిగా తెంచుకున్నారు. కశ్మీర్ సమస్య ఒకప్పటిలాగా భారత్‌ను భయపెట్టే సమస్యగా లేకపోవడం గురించి ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఈసీ) దేశాల నుంచి గుసగుసలు వినవస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిట్-బలిస్తాన్, బలూచిస్తాన్ సమస్యలను లేవనెత్తడాలతో కూడిన నూతన పాకిస్తాన్ విధానానికి దోహదం చేసినది ఈ వైఖరే. క శ్మీర్పై ఆచితూచి ప్రవర్తించడమనే 25 ఏళ్ల పాత వైఖరిని పూర్తిగా విడనాడారు. అయితే ఈ కొత్త వైఖరి ఫలితాలనిస్తోందనడం చర్చనీయాంశం కావచ్చు. ఆ పాత వైఖరి వల్ల ఇక ఎలాంటి ప్రయోజనమూ లేదని మోదీ భావించారు. ప్రత్యేకించి పాకిస్తాన్ నానాటికి మరింత ఏకాకి అవుతున్న పరిస్థితుల్లో, దానికి ఉన్న తలనొప్పి సృష్టించే (తద్వారా బ్లాక్మెయిల్ చేయడం) విలువ క్షీణించిపోతుండగా... పాత వైఖరిని విడచి ముందుకు సాగడం అవసరమని మోదీ భావన. ఈ విషయాన్ని ఇలా చూడండి: పాకిస్తాన్ 22 మందిని కాదు వంద మంది రాయబారులను ప్రపంచమంతటికీ పంపి భారత్‌తో తమకు కశ్మీర్ సమస్య ఉన్నదని చెప్పగలదు. అయితే, భారత్... పాకిస్తాన్‌తో, అది ఎగు మతి చేసే ఇస్లామిక్ ఉగ్రవాదంతో అందరికీ సమస్య ఉందని తిప్పి కొట్టగలదు. తిరుగే లేని వాదనఇది. కశ్మీర్/పాకిస్తాన్ సమస్యలపై మన పాత విధానాన్ని కొనసాగించడానికి బదులుగా మోదీ దానితో తెగతెంపులు చేసు కోవడాన్ని వివరించేది కూడా అదే. అయితే దీనికి మరో విషయంలో కలిగిన విధానపరమైన చలనాన్ని కూడా నొక్కి చెప్పడం అవసరం. మోదీ ప్రభుత్వం అణు తటపటాయింపులను కూడా వదుల్చుకుంది. అణు ప్రతినిరోధ శక్తిని ఇక నెంత మాత్రమూ పాకిస్తాన్ చేతుల్లోనే ఉంచడానికి ఇష్టపడటం లేదు. కాబట్టి మోదీ చేతులకు ఆ బంధనాలు ఇప్పుడు లేవు. రచయిత:శేఖర్ గుప్త twitter@ shekar gupta -
అమెరికాతో రక్షణ బంధం
రక్షణ రంగంలో మనతో మరింత సాన్నిహిత్యం ఏర్పడాలని పన్నెండేళ్లనుంచి తపనపడుతున్న అమెరికా కోరిక ఈడేరింది. సైనిక వసతులు, సామగ్రి, సేవలు పరస్పరం వినియోగించుకోవడానికి వీలు కల్పించే కీలక ద్వైపాక్షిక ఒప్పందం (లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్) ‘లెమోవా’పై రెండు దేశాలూ బుధవారం సంతకాలు చేశాయి. వాస్తవానికి ఇందుకు సంబంధించి నాలుగు నెలల క్రితమే ఇరు దేశాలమధ్యా సూత్రప్రాయంగా అవగాహన కుది రింది. ఇప్పుడు జరిగింది లాంఛనప్రాయమే. ఈ ఒప్పందంతో రెండు దేశాల సైనిక, నావికా దళాలు ఆహారం, ఆయుధాలు, మరమ్మతులు, ఇంధన అవసరాలు, స్థావరాల వినియోగంలాంటి అనేక అంశాల్లో పరస్పరం సహకరించుకోవడానికి మార్గం సుగమమైంది. అయితే ఇవన్నీ అంశాలవారీ పరిశీలన అనంతరం పరస్పర అంగీకారంతో మాత్రమే అమలు జరుగుతాయన్న క్లాజ్ ఈ ఒప్పందంలో ఉంది. భారత్‌లో అమెరికా తన సైనిక స్థావరాలు నెలకొల్పుకోవడానికి ఈ ఒప్పందం అంగీకరించబోదని రక్షణమంత్రి మనోహర్ పరీకర్ వివరణనిచ్చినా... ఇది అంతర్జాతీయంగా భారత్ ప్రస్తుతం అవలంబిస్తున్న తటస్థ విధానానికి తూట్లు పొడుస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆసియా పసిఫిక్, పశ్చిమాసియా ప్రాంతాల్లో ఇప్పుడు అమెరికాకు ఉన్న తగువుల్లో మనకిష్టం లేకపోయినా తల దూర్చక తప్పని స్థితి ఏర్పడవచ్చునని హెచ్చరిస్తున్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఉనికి ప్రాధాన్యత సంతరించుకుంటుందని, ఇది ప్రపంచానికి మంచి చేస్తుందని బుధవారం వాషింగ్టన్లో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ అనడాన్నిబట్టి అమెరికా మననుంచి చాలానే ఆశిస్తున్నదని చెప్పాలి. దౌత్యరంగంలో ప్రతి అంశమూ కీలకమైనదే. రెండు దేశాలు సమావేశం కావడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం మాత్రమే కాదు... అందుకు ఎంచుకున్న సమయమూ, సందర్భమూ కూడా పరిగణనలోకి వస్తాయి. హేగ్‌లోని అంత ర్జాతీయ సాగర జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ మూడేళ్లనాటి ఫిలిప్పీన్స్ ఫిర్యాదుపై గత నెల తీర్పు వెలువరిస్తూ దక్షిణ చైనా సముద్ర వివాదంలో చైనా వాదన చెల్లదని తీర్పునిచ్చింది. ఆ తీర్పును మన దేశం స్వాగతించడంతోపాటు అన్ని పక్షాలూ దాన్ని గౌరవించాలని హితవు పలికింది. ఈ నేపథ్యంలో భారత్, అమెరికాల సమావేశాన్ని, ఒప్పందం కుదరడాన్ని అర్ధం చేసుకుంటే ఇరు దేశాల సంబంధాలూ తామిద్దరికి మాత్రమే కాదు... ప్రపంచానికే మంచిదని కిర్బీ ఎందుకన్నారో అవగాహనకొస్తుంది. దక్షిణ చైనా సముద్రంలో చైనాతో తగాదా ఉన్న మరో దేశం వియత్నాంలో ఈ నెలలోనే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించబోతున్నారు. చైనాలో జరగబోయే జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్తూ మోదీ వియత్నాంను సందర్శిస్తారు. దేనిపైన అయినా నేరుగా అభిప్రాయం వ్యక్తం చేయని చైనా ఈ ‘లెమోవా’ ఒప్పందంపైన కూడా అధి కారంగా మాట్లాడలేదు. అయితే ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ‘గ్లోబల్ టైమ్స్’ భారత్-అమెరికాల బంధం చైనా, పాకిస్తాన్లకు మాత్రమే కాదు...రష్యాకు కూడా ఆగ్రహం తెప్పిస్తుందని వ్యాఖ్యానించింది. ఏ దేశాలమధ్య కుదిరే ఒప్పం దమైనా వేరే దేశం మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలనడం వరకూ ఫర్వాలేదు కానీ...ఆగ్రహం తెప్పిస్తుందని హెచ్చరించడం చెల్లుబాటు కాని విషయం. మన దేశానికి ఆగ్రహం తెప్పిస్తుందని తెలిసినా 1962లో సైనిక సామగ్రి సరఫరా మొదలుకొని తాజాగా జలాంతర్గాములు సమకూర్చడం వరకూ పాకిస్తాన్‌తో చైనా సైనికపరమైన ఒప్పందాలు అనేకం కుదుర్చుకుంది. ఏ దశలోనూ భారత్‌కు ఇవి ఇబ్బందులు కలిగిస్తాయని, కోపం తెప్పిస్తాయని చైనా అనుకున్నట్టు లేదు. అయితే ‘లెమోవా’ ఒప్పందంలోని మంచి చెడ్డలు మన ప్రయోజనాల వెలుగులో పరిశీలించాల్సిందే. ఈ ఒప్పందం సైనిక వసతులు మొదలుకొని అనేక అంశాల్లో పరస్పరం సహకరించుకోవడానికి వీలు కల్పిస్తున్నా ప్రపంచంలో ఏమూలనైనా స్థావరాలున్నది అమెరికాకే తప్ప మనకు కాదు. కనుక ఆచరణలో లబ్ధి పొందేది అమెరికాయే తప్ప మనం కాదు. తజికిస్తాన్లోని వైమానిక దళ స్థావరం మినహా మనకు ఎక్కడా స్థావరాలు లేవు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న వర్తమాన తరుణంలో ఈ ఒప్పందం అందులో అనవసరంగా మన ప్రమేయాన్ని పెంచు తుందన్నది విపక్షాల ఆరోపణ. మన ప్రయోజనాలు, అవసరాలు గీటురాయిగా దేన్నయినా నిర్ణయించుకునే స్వేచ్ఛకు ఇలాంటి ఒప్పందాలు పరిమితులు విధిస్తాయని అవి ఆందోళనపడుతున్నాయి. అయితే ఇంతక్రితం ఇతర దేశాలతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందానికీ, ఇప్పుడు మనతో కుదుర్చుకున్న ఒప్పందా నికీ మౌలికంగా తేడా ఉంది. వేరే దేశాలతో అమెరికా ఇంతవరకూ సైనిక వసతుల, సేవల మద్దతు ఒప్పందం (లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్-ఎల్ఎస్ఏ) మాత్రమే కుదుర్చుకుంది. ఆ మాదిరి ఒప్పందంపైనే మనల్ని కూడా సంతకం చేయాలని ఇన్నాళ్లనుంచి అమెరికా పట్టుబడుతోంది. మన దేశం అందుకు సంసిద్ధత కనబర చకపోవడంవల్లే ఒప్పందం ఇంత ఆలస్యమైంది. ఇది మెచ్చదగిందే. మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా ఎల్ఎస్ఏ కు అనుకూలంగా ఉన్నా యూపీఏ సర్కారులోని ఇతరులు మాత్రం పడనివ్వలేదు. ఈ ఒప్పందానికి బీజాలు వాజపేయి నేతృ త్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో పడినా మోదీ ప్రభుత్వం కూడా ఒప్పందం ముసాయిదాలో మార్పులుండాలని కోరింది. ఫలితంగా ఎల్ఎస్ఏ స్థానంలో ‘లెమోవా’ వచ్చింది. ఇరు దేశాలమధ్యా కుదరాల్సిన కీలక ఒప్పందాల పరంపరలో ఇది రెండోది. మొదటిది వాజపేయి హయాంలో కుదిరిన సైనిక సమాచార భద్రత ఒప్పందం(జీఎస్‌ఓఎంఐఏ). మరో రెండు-కమ్యూనికేషన్లు, సమాచార భద్రత ఒప్పందం(సిస్మోవా), పరస్పర మౌలిక మార్పిడి, సహకార ఒప్పందం(బెకా) ఉన్నాయి. ప్రస్తుత ఒప్పందంపై విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పారదర్శకంగా వ్యవహరించడం, ఆ ఒప్పందాలపై చర్చించడం అవసరమని కేంద్రం గుర్తించాలి. -
ఉభయ భ్రష్టత్వం
మసకబారిన యూపీఏ ప్రభుత్వపు పరువు ప్రతిష్టల నీలి నీడలు మన విదేశాంగ విధానంపైన కూడా కమ్ముకుంటున్నాయి. గత నెలలో అమెరికాలో పర్యటించిన ప్రధాని మన్మోహన్సింగ్ ప్రస్తుతం రష్యా పర్యటన ముగించి, చైనాలో పర్యటిస్తున్నారు. వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో ప్రధాన శక్తులుగా ఉన్న మూడు దేశాలలోనూ వరుసగా ఆయన చేపట్టిన ఈ పర్యటనల లక్ష్యాలు ఘనమైనవే అయినా లాంఛనప్రాయమైననిగానే ముగిసిపోతున్నాయి. పదవీ విరమణ చేస్తున్న భారత ప్రధానికి ఘనమైన వీడ్కోలు సత్కారంలాగా మన్మోహన్ అమెరికా పర్యటన ముగిసింది. నేటి రష్యా, చైనా పర్యటనలు కూడా అలాగే సాగుతున్నాయి. మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మిత్రులన్నవారే లేక ఒంటరిగా మిగిలినప్పుడు రష్యా నమ్మకమైన మిత్రునిగా నిలిచిందంటూ మన్మోహన్... ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాల గత వైభవాన్ని నెమరు వేయడానికి మించి సత్సంబంధాల పురుద్ధరణ దిశగా సాధించింది ఏమీ లేదు. గతి తప్పిన సంబంధాలకు కొండ గుర్తులా ‘కూడంకుళం ప్రతిష్టంభన’ నిలిచే ఉంది. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉండగా 1988లో నాటి సోవియట్ యూనియన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ఫలితం. ఆ విద్యుత్ కేంద్రపు ఒకటి, రెండు రియాక్టర్ల నిర్మాణం 2002లో మొదలైంది. మొదటి రియాక్టర్ మంగళవారం నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది. మరో రెండు రియాక్టర్లను కూడా రష్యా నిర్మించాల్సి ఉంది. కానీ అది కొత్త ఒప్పందం కోసం పట్టుబడుతోంది. కూడంకుళం అణు కర్మాగారానికి ‘ఆపరేటర్’ అయిన జాతీయ అణు శక్తి కార్పొరేషనే (ఎన్పీసీఐఎల్) ప్రమాదం జరిగిన సందర్భాల్లో నష్టపరిహారాన్ని చెల్లించేలా ఒప్పందాన్ని సవరించాలని కోరుతోంది. రష్యా మడత పేచీలాగా కనిపిస్తున్న ఈ వివాదంలో దాని వాదన తార్కికంగా సమంజసమైనదే అవుతుంది. 2008లో యూపీఏ ప్రభుత్వాన్ని అగ్నిపరీక్షకు గురిచేసి మరీ మన్మోహన్ అమెరికాతో అణు సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అది అమల్లోకి రావడం కోసం 2010లో పార్లమెంటు అణు పరిహార చట్టాన్ని చేసింది. అమెరికా ఒత్తిడితో తయారైన ఆ తప్పుల తడక చట్టం పరిహార బాధ్యతను ‘ఆపరేటర్’పై ఉంచింది. మన అణు విద్యుత్ కేంద్రాలన్నిటికీ ఆపరేటర్ ఎన్పీసీఐఎల్. విదేశీ సర ఫరాదారులతో అది కుదుర్చుకునే ఒప్పందాలకు లోబడి ఆ కంపెనీల నుంచి గరిష్టంగా రూ.1,500 కోట్లకు మించకుండా పరిహారం వసూలు చేసే అవకాశాన్ని అది కల్పిస్తోంది. ఆ చట్టం ప్రాతిపదికపైనే రష్యా కొత్త ఒప్పందాన్ని కోరుతోంది. ‘జనరల్ ఎలక్ట్రిక్’, ‘వెస్టింగ్‌హౌస్’ వంటి అణు కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా అమెరికా పట్టుబట్టి ఈ పరిహార చట్టాన్ని చేయించింది. అయినా నేటి వరకు ఒక్క అమెరికా కంపెనీ కూడా మన దేశంలో విద్యుత్ కేంద్ర స్థాపనకు ముందుకు రాలేదు. పైగా 2010 నాటి రష్యా అణు ఒప్పందం ప్రకారం నిర్మాణం జరగాల్సి ఉన్న పదమూడు రియాక్టర్లతోపాటూ, ఇతర దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు సైతం మూలనబడ్డాయి. స్వదేశీ చట్టాలకు లోబడి పరిష్కరించాల్సిన ప్రమాద పరిహారం సమస్యను... విదేశీ కంపెనీలు తమపై ఏ బాధ్యతా లేకుండే ఒప్పందాల కోసం పట్టుబట్టే పరిస్థితికి అవకాశం కల్పించినది మన పరిహార చట్టమే. దాని ఫలితంగానే 2020 నాటికి 20,000 మెగావాట్లు, 2032 నాటికి 63,000 మెగావాట్ల అణు విద్యుదుత్పత్తి సామర్థ్యానికి మన్మో హన్ సర్కారు రచించిన ఆర్భాటపు పథకాలు పగటి కలలుగానే మిగిలిపోయాయి. ఒకప్పటి మన నమ్మకమైన మిత్ర దేశం రష్యా మన పరిహార చట్టం లొసుగులను ఆసరా చేసుకొని పేచీకి దిగే పరిస్థితికి చేరడం మన్మోహన్ విదేశాంగ విధాన వైఫల్యమే. మౌలిక మార్పులకు గురవుతున్న అంతర్జాతీయ బలాబలాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఆయన అమెరికా అండతో భారత్‌ను ప్రాంతీయ శక్తిగా, ప్రపంచ శక్తిగా మార్చగలనని విశ్వసించారు. అమెరికా నేతృత్వంలోని ఏక కేంద్రక ప్రపంచం విచ్ఛిన్నమవుతూ బహు కేంద్రక ప్రపంచం ఆవిర్భవిస్తున్న కాలంలో ఆయన మన విధానాన్ని అమెరికా అనుకూలమైనదిగా చేయడానికి యత్నించారు. కొత్త, పాత అధిపత్యవాద శక్తులకు సమదూరం పాటించే అలీన విధానాన్ని అనుసరించాల్సిన సమయంలో చేసిన ఈ చారిత్రక తప్పిదం అంత తేలికగా సరిదిద్దుకోలేనిది. అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా నిష్ర్కమించనున్న నేపథ్యంలో ప్రాంతీయంగా భారత్‌పై నమ్మకం ఉంచలేని రష్యా పాకిస్థాన్‌తో చెలిమి చేస్తోంది. మునుపెన్నటికన్నా బలహీనపడ్డ అమెరికా నేతృత్వంలోని ఆసియా-పసిఫిక్ కూటమిలో భారత్ భాగస్వామి అయ్యే అవకాశాలున్నట్టు చైనా భావిస్తోంది. దీంతో అది రష్యా, పాక్‌లతో కలిసి వ్యూహాత్మక కూటమిని నిర్మించే ప్రయత్నాల్లో ఉంది. అమెరికా మనకు ఎంత ‘నమ్మకమైన’ మిత్ర దేశంగా నిలవగలదో దానితో కుదుర్చుకున్న అణు ఒప్పందం అమలు తీరే చెబుతోంది. ఇక పాక్ సీమాంతర ఉగ్రవాదంపై అది అనుసరిస్తున్న అవకాశవాద వైఖరి గురించి చెప్పనవసరం లేదు. నిజానికి నేడు మనం ‘మిత్రులన్నవారే లేక ఒంటరిగా మిగిలిన’ స్థితికి చేరువవుతున్నాం. ఆ బలహీనతను బాగా ఎరిగిన చైనా ప్రధాని లీ కియాంగ్ సరిహద్దు వివాదం, జల వివాదాలు వంటి కీలక సమస్యలపై నామమాత్రపు చర్చలకు పరిమితమై తమకు ప్రాధాన్యాంశమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలకే పరిమితం కావాలన్న తమ దౌత్య వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. అందుకే ఇరు దేశాల ప్రధానులు బుధవారం కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం లాంఛనప్రాయమైన పునరుద్ఘాటనలకే పరిమితమైంది. రష్యాలాగే చైనా కూడా మన్మోహన్‌ను కొన్ని మాసాల ప్రధానిగానే పరిగణిస్తోంది. కొత్త ప్రభుత్వంతోనే అర్థవంతమైన చర్చలు సాధ్యమని భావిస్తోంది. ఆ వచ్చే ప్రభుత్వమైనా అన్ని ఆధిపత్య శక్తులకు సమదూరం పాటించే అలీన విధానానికి మరలుతుందని ఆశిద్ధాం.