500 మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తికి అనుమతి
Published Fri, Aug 16 2013 3:36 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
సాక్షి, చెన్నై : కూడంకులంలో అధికారికంగా అణు విద్యుత్ ఉత్పత్తికి అణుశక్తి క్రమబద్ధీకరణ కమిషన్ అనుమతి ఇచ్చింది. తొలి విడతగా 500ల మెగావాట్ల ఉత్పత్తికి పచ్చ జెండా ఊపింది. దీంతో అణు రియాక్టర్లలో వేడిమి పెంచే పనిలో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా సింధు రక్ష క్ నినాదంతో ‘మమ్మల్ని రక్షించు దేవుడా’ అని అణు వ్యతి రేక ఉద్యమకారులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
తిరునల్వేలి జిల్లా కూడంకులంలోని అణు విద్యుత్ కేంద్రంలో తొలి యూనిట్ పనులు ముగి యగా, రెండో యూనిట్ పనులు ముగింపు దశకు చేరాయి. ఈ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమకారులు ఉద్యమిస్తున్నా వాటిని లెక్కచేయకుండా విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా కేంద్రం, అణు విద్యుత్ బోర్డు వర్గాలు దూసుకెళుతున్నాయి. గత నెల 13 నుంచి తొలి యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి పనులు ప్రారంభమయ్యాయి. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఉత్పత్తి విజయవంతమైంది. దీంతో ఉత్పత్తి ప్రక్రియను అధికారికంగా వేగవంతం చేయడానికి అణుశక్తి క్రమబద్ధీకరణ కమిషన్ అనుమతి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆ కమిషన్ అధికారులు ఇటీవల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించి వెళ్లారు. అధికారిక అనుమతికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు వెలువరించలేదు. ఆ కమిషన్ ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని విద్యుత్ కేం ద్రం అధికారులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఉత్కం ఠతో ఎదురు చూశారు. ఈ పరిస్థితుల్లో బుధవారం అర్ధరాత్రి అధికారిక ఉత్పత్తికి పచ్చ జెండా ఊపుతూ ఆదేశాలు వెలువడ్డాయి.
అణు కేంద్రం సురక్షితం
అణు విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన ఆ కమిషన్ అధికారులు భద్రతా పరంగా కూడంకులం సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. ఆ కేంద్రంలో అధికారికంగా ఉత్పత్తి ప్రక్రియకు శ్రీకారం చుట్టవచ్చని ఆదేశించారు. తొలి విడతగా 500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయాలని సూచించారు. ఈ విషయంగా అణు విద్యుత్ కేంద్రం డెరైక్టర్ సుందర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ అణుశక్తి క్రమబద్ధీకరణ కమిషన్ అనుమతి కోసం ఇన్నాళ్లు వేచి చూశామన్నారు. కమిషన్ పచ్చ జెండా ఊపడంతో ఉత్పత్తి పనుల్ని వేగవంతం చేశామన్నారు. అణు రియాక్టర్లలో వేడిమి పెంచే పనుల్లో నిమగ్నమయ్యామన్నారు. ఆ వేడిమి 1200 కిలోవాట్స్ రాగానే ఉత్పత్తి పుంజుకుంటుందని వివరించారు. తొలి విడతగా 500 మెగావాట్లకు మాత్రమే అనుమతి లభించిందని, సెప్టెంబర్ మొదటి వారంలోపు ఈ మొత్తం ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ మొత్తాన్ని కేంద్రం వాటాకు పంపనున్నామన్నారు. పదిహేను రోజుల్లో 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగవచ్చని భావిస్తున్నామన్నారు. మరో మారు అణుశక్తి కమిషన్ పరిశీలనల అనంతరం అదనంగా 500 మెగావాట్లకు అనుమతి దక్కవచ్చన్నారు. అప్పుడు పూర్తి స్థాయిలో తొలి యూనిట్ ద్వారా 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు.
సింధు రక్షక్: అధికారిక ఉత్పత్తి పనులు ఓ వైపు వేగవంతమయ్యాయి. మరో వైపు తమను రక్షించు దేవుడా అని అణు విద్యుత్ కేంద్రం వ్యతిరేక ఉద్యమకారులు ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు. గురువారం కూడంకులం పరిసర 18 గ్రామాల ప్రజలు సింధు రక్షక్ నినాదంతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిలు, రోడ్లలో మోకాళ్ల మీద కూర్చుని ఎక్కడిక్కడ ప్రార్థనల్లో లీనమయ్యారు.
Advertisement
Advertisement