అణు విద్యుత్ కేంద్రం మూసేయూల్సిందే :వైగో
Published Sun, Aug 11 2013 2:04 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
కూడంకులం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో మరోమారు గళమెత్తారు. అణు విద్యుత్ కేంద్రాన్ని మూసేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యుత్ వాటాలపై అధికారులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: అణు విద్యుత్ కేంద్ర వ్యతిరేక సంఘం ఆధ్వర్యంలో శనివారం చెన్నైలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసనకారులు ర్యాలీగా చెన్నై కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైగో మాట్లాడారు. అణువిద్యుత్ కేంద్రం నుంచి వెలువడే విషవాయువులతో పరిసర ప్రాంతాలు, వ్యర్థాలతో సముద్రపు నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు.
నీరు కలుషితమైతే దీనిపై ఆధారపడి బతికే జాలర్లు జీవనాధారం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంకతో భారత్ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడం వల్ల ఇప్పటికే తమిళ జాలర్లు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. తగిన భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే అణువిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించాలన్న సుప్రీంకోర్టు సూచనలు అమలు కావడం లేదని ఆరోపించారు. అలాగే ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్న సుప్రీం ఆదేశాలు అమలుకు నోచుకోలేదని తెలిపారు. ఇది పూర్తిగా కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని స్పష్టం చేశారు.
దక్కేది 140 మెగావాట్లే
అణువిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తయ్యే 2000 మెగావాట్లలో 900 మెగావాట్లు తమిళనాడుకు కేటాయిస్తామని అధికారులు అబద్ధాలు ఆడుతున్నారని వైగో తెలిపారు. వాస్తవానికి రాష్ట్రానికి దక్కేది 140 మెగావాట్లు మాత్రమేనని పేర్కొన్నారు. ఇన్ని రకాలుగా తమిళ ప్రజలను వంచిస్తూ సాగే అణువిద్యుత్ కేంద్రాన్ని అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ కేంద్రాన్ని మూసివేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు.
Advertisement
Advertisement